నిత్యం విషం తింటున్నాం..

6 Dec, 2017 03:52 IST|Sakshi

పండ్లే కాదు ఉప్పు, పప్పు, పాలు అన్నీ కల్తీయే: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: ‘నిత్యం విషమే తింటున్నాం. మన పిల్లలూ ఈ విషాన్నే తినాల్సి వస్తోంది. రసాయనాలతో పండించిన, మగ్గబెట్టిన ఫలాలే కాదు.. పాలు, పెరుగు, పంచదార, ఉప్పు, బియ్యం.. ఇలా అన్నీ కల్తీనే. కల్తీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏం యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాయి? తనిఖీలు ఏమైనా చేస్తున్నారా? కోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు మాత్రం అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం.. అని చెబుతారు. లేదంటే దాని గురించే పట్టించుకోరు.

అయినా మీ బాధ్యతల గురించి మేం ఎందుకు చెప్పాలి? మీ అంతట మీరు మీ బాధ్యతలను నిర్వర్తించలేరా? మేం చెబితే పాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయంటారు. చెప్పకపోతే మీరంతట మీరు చేయరు. కాల్షియం కార్బైడ్‌ ఉపయోగించి పళ్లను మగ్గబెడుతున్న వారికి సంబంధించి ఇటీవలి కాలంలో ఎన్ని తనిఖీలు చేశారు? ఎన్ని కేసులు పెట్టారు? ఎంత మందిని ప్రాసిక్యూట్‌ చేశారు? ఈ వివరాలన్నీ తదుపరి విచారణ నాటికి కోర్టు ముందుంచండి. లేనిపక్షంలో కోర్టులంటే ఏమిటో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి’ అని హైకోర్టు ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలకు తేల్చిచెప్పింది. కాల్షియం కార్బైడ్‌ను ఉపయో గించి పండ్ల వ్యాపారులు కాయల్ని మగ్గబెట్టి అమ్మకాలు చేస్తుండటంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు పిల్‌గా పరిగణించింది. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. 

 అధికారులు నామమాత్రంగానే ఉన్నారు... 
ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా (అమికస్‌ క్యూరీ) నియమితులైన సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదిస్తూ..ప్రతీ ఒక్కటి కల్తీ అవుతున్నాయని, కల్తీలకు పాల్పడే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. తనిఖీలు నిర్వహించే అధికారుల సంఖ్య నామమాత్రంగా ఉందని తెలిపారు. ఎఫ్‌ఎస్‌వోలు ఏపీలో 28, తెలంగాణలో 20 మందే ఉన్నారని, అండమాన్‌లోనూ  28 మంది ఉన్నారని, తమిళనాడులో ఏకంగా 554 మంది ఉన్నారని వివరించారు. తనిఖీ అధికారుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. కోర్టు ఆదేశించినప్పుడో, ఆగ్రహాన్ని వ్యక్తం చేసినప్పుడో అధికారులు తనిఖీలు చేసి ఊరుకుంటున్నారని, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంటేనే ఫలితాలు ఉంటాయని పేర్కొంది. ఆకస్మిక తనిఖీలు ఎన్ని చేశారు, ఎంతమందిపై కేసు నమోదు చేశారు, కోర్టుల్లో శిక్షలు పడ్డాయా, లేదా పూర్తి వివరాలతో కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయాలని 2 రాష్ట్రాలను ధర్మాసనం ఆదేశించింది. విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.  

మరిన్ని వార్తలు