‘ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’పై ఈసీదే నిర్ణయం.. 

14 Mar, 2019 18:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. ఈ సినిమాపై ఢిల్లీలో ఫిర్యాదు చేశారని, ఆయన తెలిపారు.  సీఈవో రజత్‌ కుమార్‌ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్‌ ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఆర్టికల్స్‌, న్యూస్‌ ఐటమ్స్‌ ప్రచారం చేయకూడదె, చూపకూడదు. అలాగే కులం, భాష ప్రాతిపదికగా ఓటు అడగకూడదు. గత ఎన్నికల్లో 26 లక్షలమంది కొత్తగా ఓటు నమోదు చేసుకుంటే వారికి ఉచితంగా గుర్తింపు కార్డు ఇచ్చాం. ఇప్పుడు కొత్తగా 3 లక్షలమంది నమోదు చేసుకున్నారు. ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వారికి కూడా ఉచితంగా ఓటర్ కార్డులు ఇస్తాం. 

మూడు రోజులుగా ఎన్నికల కోడ్‌ అమలు చేస్తున్నాం. నాలుగున్నర లక్షల పోస్టర్లను తొలగించాం. సి విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేస్తే ఆర్వోలు చర్య తీసుకుంటారు. ప‍్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు తొలగించాం. ఫ్లయింగ్‌  స్క్వాడ్‌ను ఏర్పాటు చేశాం. 18న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేస్తాం. 33 జిల్లాలకు డీఈవోలను నియమించాం. నగదు, మద్యం పంపిణీపై గతంలో కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పుడు కూడా ప్రత్యేక నిఘా ఉంటుంది. అనధికారికంగా నడిచే బెల్ట్‌ షాపులు నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. లిక్కర్‌ షాపులు సమయాపాలన పాటించాలి. 2014లో 1649 కేసులు నమోదు అయ్యాయి. అందులో మూడు కేసులులపై ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇక 2018లో 922 కేసుల నమోదు కాగా, 71 కేసులపై చర్యలు తీసుకున్నాం.’  అని తెలిపారు.

కాగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను నిలిపివేయాలంటూ టీడీపీ కార్యకర్త దేవిబాబు చౌదరి ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడును ఆ సినిమాలో కించపరిచేలా చూపించారని, ఆ ప్రభావం ఓటింగ్‌పై పడే అవకాశం ఉందని అన్నారు. తొలివిడత పోలింగ్‌ పూర్తయ్యేవరకూ సినిమా విడుదలను వాయిదా వేయాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు రాంగోపాల్ వర్మ ఇప్పటికే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను ఈ నెల 22న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు.

మరిన్ని వార్తలు