ఇడ్లీ రూ. 10.. ఇన్నోవా అద్దె రూ. 2,640

30 Oct, 2018 08:49 IST|Sakshi

ఎన్నికల వ్యయానికి అభ్యర్థుల ఖర్చు

ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు

ధరలు తగ్గించాలన్న రాజకీయ పార్టీలు  

సాక్షి, సిటీబ్యూరో: టీ/ కాఫీ రూ. 6 ఇడ్లీ (2) రూ. 10, వడ (2) రూ.15, నీళ్లసీసా 500మి.లీ రూ.10 వెజ్‌ బిర్యానీ రూ.80, చికెన్‌బిర్యాని రూ.120, టాటా ఇండికా (ఏసీ)  అద్దె రోజుకు రూ.1,440, క్వాలిస్‌ (ఏసీ)అద్దె రోజుకు రూ. 2,160, ఇన్నోవా (ఏసీ ) అద్దె రోజుకు :రూ. 2,640, బస్సు (30 సీట్లు) రూ.3,600, సుమో నాన్‌ ఏసీ రూ.1,440 డ్రైవర్‌ బత్తా రోజుకు రూ. 240.. ఏమిటీ ధరలు అనుకుంటున్నారా..? త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో  అభ్యర్థులు చేసే ఖర్చులకు సంబంధించి ప్రతిపాదించిన  ధరలు. వ్యయానికి సంబంధించి ఆయా అంశాలకు జిల్లా ఎన్నికల అధికారులు ప్రతిపాదించినవాటిలో ఆహార పదార్థాల ధరలు తక్కువగా ఉండటంతో వాటికి ఓకే అన్న రాజకీయపార్టీల ప్రతినిధులు హోర్డింగులు, లౌడ్‌స్పీకర్లు, వాహనాల అద్దెల ధరలు మాత్రం ఎక్కువగా ఉన్నాయని వాటిని తగ్గించాలని కోరారు. 

ఎన్నికల్లో ప్రచార సామగ్రి తదితర అంశాల ఖర్చును నిర్ధారించేందుకు సోమవారం హైదరాబాద్‌ జిల్లా  ఎన్నికల అధికారి ఎం.దానకిశోర్‌ రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వాహనాలు, ప్రచార సామగ్రి ధరలు మార్కెట్‌ రేటు కంటే ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించాలని టీడీపీ ప్రతినిధి వనం రమేశ్, బీజేపీ ప్రతినిధి పొన్న వెంకటరమణ, తదితరులు డిమాండ్‌ చేశారు.  అభ్యర్థి ఎన్నికల వ్యయం రూ. 28 లక్షలకు మించకూడదు కనుక, ఎక్కువ ధరలుంటే.. ఎక్కువ వ్యయం నమోదు కానుండటంతో ప్రచార సామాగ్రి ధరలు తగ్గించాలని  కోరారు.  దాదాపు రూ. 1600 వ్యయమయ్యే  పోడియం ఖర్చు రూ8640గా చూపారన్నారు. ఫ్లెక్సీల ధరలు, వాహనాలు, లౌడ్‌స్పీకర్ల అద్దెధరలు ఎక్కువగా చూపారని, వాటిని తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అన్నీ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని  అధికారులు హామీ ఇచ్చారు. ఒకే ఇంట్లో భారీసంఖ్యలో ఉన్న ఓట్లకు సంబంధించి ఫిర్యాదుదారులతో కలిసి అధికారులు పరిశీలనకు వెళ్లాలని రాజకీయపార్టీల ప్రతినిధులు సూచించారు. ముఖ్యంగా పాతబస్తీలో స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు.  

బోగస్‌ ఓట్లు తొలగించాం: దానకిశోర్‌  
నగరంలో బోగస్‌ ఓట్ల గురించి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి తొలగించినట్టు దానకిశోర్‌ తెలిపారు.  కొన్ని కోర్టు కేసులో ఉన్నాయని పేర్కొన్నారు.  రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సంబంధించి సభలు, సమావేశాలు, పాదయాత్రలకు తప్పనిసరిగా ఇ–సువిధ ఆన్‌లైన్‌ ద్వారానే అనుమతులను పొందాలని స్పష్టం చేశారు. అనుమతులకు దరఖాస్తు చేసిన 48 గంటల్లోగా అనుమతి ఇవ్వాలనే నిబంధనలు ఉన్నప్పటికీ 24గంటల్లోనే ఇవ్వాలని రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీచేశామని తెలిపారు.

మరిన్ని వార్తలు