జనవరి 4న తుది ఓటరు జాబితా: ఈసీ

30 Dec, 2019 20:23 IST|Sakshi

జనవరి 8 నుంచి నామినేషన్లు స్వీకరణ

జనవరి 6వ తేదీ తరువాత రిజర్వేషన్లు ప్రకటన

ఈసీ నాగిరెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల సంఘం కొత్త పద్దతిని ప్రారంభించిందని, తుది ఓటరు జాబితాకు ముందే షెడ్యూల్‌ విడుదల చేశామని ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల డ్రాప్ట్‌ ఓటర్‌ జాబితా అందుబాటులో ఉందని, వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేశామన్నారు. ఓటరు జాబితాపై జనవరి 2వ తేది వరకు అభ్యంతరాలు చెప్పవచ్చని తెలిపారు. అసెంబ్లీ జాబితాలో పేరు ఉండి.. ఇప్పుడు లేకపోతే సమస్యను పరిష్కరిస్తామన్నారు. జనవరి 4న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామన్నారు. సెక్షన్‌ 195, 197 ప్రకారం ప్రభుత్వ అనుమతితోనే షెడ్యూల్ విడుదల చేశామని పేర్కొన్నారు. షెడ్యూల్ విడుదల చట్టప్రకారం చేశామని, ఎన్నికల నిర్వహణపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాగిరెడ్డి స్పష్టం చేశారు. 

రాజకీయ పార్టీల సమావేశంలో గొడవ వల్ల వివరంగా చెప్పలేక పోయామని, జనవరి 6వ తేదీ తరువాత రిజర్వేషన్లు ప్రకటిస్తామన్నారు. జనవరి 8 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. టీ పోల్‌ సాఫ్ట్‌వేర్‌ నుంచి, ఓటరు జాబితా నుంచి నామినేషన్ ఫామ్‌ తీసుకోవచ్చని అన్నారు. నామినేషన్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినంత మాత్రాన నామినేషన్ వేసినట్లు కాదన్నారు. ఒరిజినల్ నామినేషన్ కాపీని రిటర్నింగ్ అధికారికి నేరుగా ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో 35 నుంచి 40 వేల వరకు సిబ్బంది ఉంటారని, విధుల్లో వచ్చే సిబ్బంది అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది 13 వ తేది వరకు పోస్టల్ ఓటు కోసం  దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  

సీడీఎంఏ డైరెక్టర్‌ శ్రీదేవి మాట్లాడుతూ..141 మున్సిపాలిటీలకు కలిపి రాష్ట్ర స్థాయిని యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లు ప్రకటిస్తామన్నారు. 130 మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా ఖరారు చేస్తామని తెలిపారు. జనవరి 5వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ ఛైర్మన్ రిజర్వేషన్లు ప్రకటిస్తామని, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల రిజర్వేషన్లు కలెక్టర్లు ప్రకటిస్తారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు