ఇదీ సెక్షన్ తప్పదు యాక్షన్..!

20 Nov, 2018 10:35 IST|Sakshi

నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా శిక్షార్హులే..

ఎన్నికల చట్టాలపై ఇటీవల పెరిగిన ఆసక్తి  

ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేస్తున్న విద్యార్థులు, యువత 

ప్రస్తుతం అందరికీ ఈ సమాచారం ఎంతో ఉపయుక్తం  

సాక్షి, సిటీబ్యూరో: ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులను ఎన్నుకోవడానికి ఎన్నికలే ప్రధాన భూమిక వహిస్తాయి. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువ కేసులు నమోదు చేస్తుంటారు. ప్రచారంలో పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు అదుపు తప్పి వ్యవహరిస్తే దండన తప్పదు. సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకొంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన ‘సర్కార్‌’ సినిమా చూసిన తర్వాత ప్రజల్లో ఎన్నికల చట్టాలు గురించి తెలుసుకోవాలన్నా ఆసక్తి ఎక్కువైంది. పలువురు విద్యార్థులు, యువత ఇంటర్నెట్‌లో ఎన్నికల చట్టాలు – నిబంధనలు గురించి సెర్చ్‌ చేయటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొన్ని ఎన్నికల చట్టాలను వివరించే కథనం.

49పి: ఒక వ్యక్తి ఓటు మరొకరు వేస్తే, పోలింగ్‌ ఆఫీసర్‌కు సదరు ఓటర్‌ 49–పి సెక్షన్‌ ప్రకారం తన ఆధారాలు చూపాలి. ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సదరు ఓటర్‌కు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 
134(అ): ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ఏజెంటుగా గానీ పోలింగ్‌ ఏజెంటుగా గానీ, ఓట్ల లెక్కింపు సందర్భంగా గానీ ఏజెంటుగా వ్యవహరిస్తే శిక్షార్హులు. అందుకు3 నెలల జైలుశిక్ష లేదాజరిమానా.

ఇవీ సెక్షన్లు..
123: జాతి, మతం, కులం, సంఘం, భాషను రెచ్చగొట్టేలా వ్యవహరించడం, ఒత్తిడికి లోనుచేస్తే.. ఈ సెక్షన్‌ కింద ఫిర్యాదు చేయొచ్చు.  
125: ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందిస్తే మూడేళ్లపాటు జైలు శిక్ష లేదా జరిమానా. రెండింటినీ విధించేఅవకాశం ఉంటుంది.  
126: ఎన్నికల సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తే శిక్షార్హులు. దీనికి రెండేళ్ల జైలు లేదా జరిమానా విధిస్తారు.  
127: ఎన్నికల సమావేశం సందర్భంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడినా.. పోలీస్‌ అధికారి అయినా ఆ వ్యక్తులను అరెస్టు చేయొచ్చు. ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 2 వేల జరిమానావిధించవచ్చు.  
128: బహిరంగంగా ఓటేస్తే మూడు నెలల జైలు లేదా జరిమానా.  
129: ఎన్నికలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, పోలీసులు పోటీచేసే అభ్యర్థికి సహకరించినా, ప్రభావం కలిగించినా శిక్షార్హులు. దీనికిగాను 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు.
130: పోలింగ్‌ స్టేషన్‌కు 100 మీటర్ల లోపల ప్రచారం చేయొద్దు. ఒకవేళ చేస్తే రూ.250 జరిమానా పడుతుంది.  
131: పోలింగ్‌ కేంద్రానికి సమీపంలో నియమాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే.. ఏ పోలీస్‌ అధికారి అయినా.. ఆ సామగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా. రెండూ అమలు చేయొచ్చు.  
132: ఓటేసే సమయంలో నియమ నిబంధనలు పాటించని వారికి 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా.  
134: అధికార దుర్వినియోగానికి పాల్పడితే శిక్షార్హులే. ఇందుకు రూ.500 జరిమానావిధిస్తారు.  
134(ఆ): ఠాణా పరిసర ప్రాంతాలకు మారణాయుధాలతో వెళ్లడం నిషేధం. అలా వెళ్లినవారికి 2 నెలల జైలుశిక్ష, జరిమానా వేస్తారు.
135: పోలింగ్‌ కేంద్రం నుంచి బ్యాలెట్‌ పత్రం, ఈవీఎం అపహరిస్తే శిక్షార్హులు. ఏడాది పాటు జైలుశిక్ష, రూ. 500 జరిమానా విధిస్తారు. 
135(ఆ): ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల రోజు వేతన సెలవుగా మంజూరు చేసినా శిక్ష. అందుకు రూ. 5వేల జరిమానా విధించొచ్చు. 
135(ఇ):  పోలింగ్, కౌంటింగ్‌ రోజున మద్యం విక్రయించడం, మద్యం, డబ్బు ఇవ్వడానికి ఆశ చూపడం నేరం. అందుకు 6 నెలల జైలుశిక్ష. రూ. 2 వేల వరకు
జరిమానా విధిస్తారు. 
133: ఎన్నికల సందర్భంగా ఓటర్లను పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరవేసేందుకు వాహనాలు
సమకూర్చినా, అద్దెకు తీసుకున్నా శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష, జరిమానా ఉంటుంది.

మరిన్ని వార్తలు