పీహెచ్‌సీల్లో ఈసీజీ సేవలు

21 May, 2018 14:26 IST|Sakshi
నిజాంసాగర్‌ పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన ఈసీజీ కేంద్రం

నిజాంసాగర్‌(జుక్కల్‌) : కార్పొరేట్‌ ఆస్పత్రులతో పాటు జిల్లా కేంద్ర ఆస్పత్రులకే పరిమితమైన అధునాతన వైద్య సదుపాయాలు ప్రస్తుతం పల్లెలకు విస్తరిస్తున్నాయి. అమ్మఒడి, కేసీఆర్‌ కిట్లు, ఆరోగ్యలక్ష్మి తదితర ప్రతిష్టాత్మక పథకాలు తీసుకొచ్చిన .. ప్రా«థమిక ఆరోగ్య కేంద్రాల్లో అధునాతన సదుపాయాలను కల్పిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ సేవలు అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

ఛాతినొప్పి, గుండెనొప్పితో బాధ పడుతున్న రోగులు ఈసీజీ కోసం పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది. ఈసీజీ పరీక్షల కోసం వందల రూపాయలు వెచ్చించాల్సి వచ్చేది. నొప్పి వచ్చినప్పుడల్లా పట్టణాలకు పరుగులు తీస్తూ జేబులు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. 

అయితే, సర్కారు ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసే క్రమంలో భాగంగా వైద్య సేవలను విస్తృతం చేస్తోంది. పీహెచ్‌సీలలో వసతులను మెరుగు పరిచిన ప్రభుత్వం.. మండల కేంద్రాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు రూ.50 వేల విలువ గల ఈసీజీ యంత్రాన్ని, ఇతర పరికరాలను సరఫరా చేసింది. దాంతో ఆయా మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి.

గుండెనొప్పి వ్యాధిగ్రస్తులతో పాటు 45 సంవత్సరాల వయస్సు పై బడిన వారు ఈసీజీ పరీక్షలను చేయించుకుంటున్నారు. ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ యంత్రాల ద్వారా రోగులకు స్థానిక వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. పల్లెల్లో ఈసీజీ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆరోగ్య కేంద్రాల్లోనే పరీక్షలు 

మండల కేంద్రాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ పరీక్షలను ఉచితంగా చేస్తున్నాం. గుండెనొప్పి సంబంధిత వ్యాధుల నిర్దారణకు ఈసీజీ సేవలు దొహదపడుతున్నాయి. ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ పరీక్షల ద్వారా రోగుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకమూ పెరుగుతుంది. 

– స్పందన, ఆరోగ్య కేంద్రం వైద్యురాలు, నిజాంసాగర్‌   

మరిన్ని వార్తలు