సొంతింటికి గ్రహణం!

3 Oct, 2019 12:10 IST|Sakshi
భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు

కామారెడ్డి నియోజకవర్గంలో పూర్తయిన డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు

కనీస సౌకర్యాలులేక ఆగిన కేటాయింపు

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్న నిర్మాణాలు

ఇళ్లులేని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని తీసుకువచ్చింది. కామారెడ్డి నియోజకవర్గంలో విడతల వారీగా 1,675 ఇళ్లు మంజూరు కాగా 1500 నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. కానీ వాటికి సెప్టిక్‌ ట్యాంకులు, డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో లబ్ధిదారులకు కేటాయించలేకపోతున్నారు.

సాక్షి, కామారెడ్డి:  కామారెడ్డి జిల్లాలో 2015–16, 2017–18 సంవత్సరాల్లో కలిపి మొత్తం 7,686 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరయ్యాయి. బాన్సువాడ నియోజక వర్గానికి 2,810, జుక్కల్‌కు 1,466, కామారెడ్డికి 1,675, ఎల్లారెడ్డికి 1,735 ఇళ్లు కేటాయించారు. ఇందులో 7,186 ఇళ్లకు టెండర్లు పిలువగా.. 4,863 ఇళ్లకు టెండర్లు ఖరారయ్యాయి. దీంతో ఆయా నియోజక వర్గాల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టు పొందిన సంస్థలు పనులు మొదలుపెట్టాయి. చాలావరకు నిర్మాణాలు పూర్తికావచ్చాయి. బాన్సువాడలో నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. ఇంకా కొన్ని నిర్మాణాలు కొనసాగుతున్నాయి.  

కామారెడ్డిలో..
కామారెడ్డి నియోజకవర్గంలో 1,675 ఇళ్లు మంజూరు కాగా 1500 నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. ఇళ్ల నిర్మాణాలు పూర్తై దాదాపు ఆరు నెలలు గడచినా సెప్టిక్‌ ట్యాంకుల నిర్మాణానికి నిధులు లేకపోవడంతో లబ్ధిదారులకు కేటాయించలేకపోతున్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వద్ద రోడ్లు, విద్యుత్‌ వంటి సౌకర్యాలు కూడా కల్పించాల్సి ఉంది. ఒక్కో బ్లాక్‌కు ఒక్కో సెప్టిక్‌ ట్యాంకు నిర్మించి, డ్రెయినేజీలు ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. దీనికిగాను రూ.2.89 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.   

తప్పని ఎదురుచూపులు 
నియోజకవర్గంలో దాదాపు 1,500 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటిని చూసి నిరుపేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇళ్ల మంజూరు కోసం అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందిస్తూనే ఉన్నారు. అయితే ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇళ్లను కేటాయించడం లేదు. సెప్టిక్‌ ట్యాంకులు, డ్రెయినేజీల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు. 

వృథాగా..
నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తై వృథాగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. ముఖ్యంగా మద్యపానం, పేకాట, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్లు తమ పని ముగించుకుని వెళ్లారు. దీంతో అక్కడ ఎటువంటి కాపలా లేకపోవడంతో కొందరు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చుకున్నారు.  

అసెంబ్లీలో ప్రస్తావించిన విప్‌ గంప 
కామారెడ్డి నియోజక వర్గంలో 1,500 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, వాటికి సెప్టిక్‌ ట్యాంకులు నిర్మిస్తే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించారు. రూ.2.89 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఇప్పటికీ ఎలాంటి చలనం లేకపోవడంతో ఇళ్లు దిష్టిబొమ్మల్లా మిగిలాయి.  

మరిన్ని వార్తలు