ఈకామ్ ఎక్స్‌ప్రెస్ గుడ్‌న్యూస్ ‌: 7 వేల ఉద్యోగాలు 

17 Jun, 2020 13:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : కరోనా సంక్షోభ సమయంలో ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ  ఈకామ్ ఎక్స్‌ప్రెస్  తీపి కబురు చెప్పింది. 7000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు టెక్నాలజీ-ఎనేబుల్డ్ ఎండ్-టు-ఎండ్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఈకామ్ ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది. రాబోయే రెండు నెలల్లో లాస్ట్-మైల్ డెలివరీ, గిడ్డంగుల నిర్వహణ, కార్యకలాపాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,  డేటా సైన్సెస్ విభాగాల్లో పూర్తి సమయం ఉద్యోగులుగా ఈ నియామకాలుంటాయని ఈకామ్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. అంతేకాదు రానున్న పండుగ సీజన్ నాటికి ఆన్‌లైన్ షాపింగ్, డోర్‌స్టెప్ డెలివరీలకు ప్రాధాన్యతనిచ్చేలా దాదాపు 35000 మంది ఉద్యోగులను నియమించుకునే ప్రణాళికలను కూడా రూపొందించింది. 

హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, సూరత్, చండీగడ్, ఇండోర్, పట్నా, లక్నో, కాన్పూర్, భోపాల్, జైపూర్‌నుంచి వీరిని ఎంపిక  చేస్తామని కంపెనీ  ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త నియామకాలు తమ మొత్తం సిబ్బందిలో 25 శాతం అని సంస్థ సినియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ సౌరభ్ దీప్ సింగ్లా వెల్లడించారు. ఈ క్లిష్ట సమయాల్లో, నగరాల్లో ఆన్‌లైన్ షాపింగ్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో డోర్ డెలివరీలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రవాణా సేవలను అందించే సంస్థగా తమకు ఉద్యోగులే తమకు ఇరుసులాంటి వారని పేర్కొన్నారు. సురక్షితంగా, సకాలంలో డెలివరీ సేవలు లక్ష్యంగా ఈ కొత్త నియామకాలని ఆయన వెల్లడించారు. 

మరిన్ని వార్తలు