సాగునీటికి కత్తెర..

8 Sep, 2019 02:09 IST|Sakshi

బడ్జెట్‌లో కేటాయింపులు 7 వేల కోట్లు దాటకపోవచ్చని అంచనా

రూ.26 వేల కోట్ల అంచనాలను 6,500 కోట్లకు కుదించిన ఆర్థికశాఖ

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక మాంద్యం దెబ్బ రాష్ట్ర బడ్జెట్‌పై కూడా పడింది. ఈసారి బడ్జెట్‌లో పలు రంగాలకు భారీగా కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సాగునీటి రంగానికి కూడా భారీ కుదింపు తప్పేలాలేదు. గత ఐదేళ్లుగా రూ.25 వేల కోట్లు ఈ రంగానికి కేటాయించగా, ఈసారి రూ.7 కోట్లలోపే నిధులు ఇవ్వనున్నట్లు సమాచారం. కొన్ని ప్రాజెక్టులకు ముందు పంపిన ప్రతిపాదనలతో పోలిస్తే కుదించిన అంచనాలు ఆరేడు రెట్లు తగ్గాయి. అయితే ప్రాజెక్టులు ఆగకుండా చూసేందుకు ప్రభుత్వం ‘కార్పొరేషన్ల’ ద్వారా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్‌లో సాగునీటి శాఖకు భారీ కోత పడే అవకాశాలున్నాయి. 

గత ఐదేళ్ల బడ్జెట్‌లలో భారీ కేటాయింపులతో ముందు వరుసలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు తొలిసారి కేటాయిం పులు తగ్గే అవకాశాలున్నాయి. ఆర్థిక మాంద్యానికి తోడు కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులు తగ్గిన నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్ల లోపే కేటాయింపులు పరిమితమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సాగునీటి శాఖ రూ.26,500 కోట్లతో ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. దాన్ని రూ.7 వేల కోట్లకు తగ్గించాలని ఆదేశాలు రావడంతో ఆ దిశగానే మళ్లీ ప్రతిపాదనలు సమర్పిం చారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదేళ్లుగా సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లకు తగ్గకుండా నిధులు కేటాయిస్తోంది. అందుకు తగ్గట్లే నిధులు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌లో ఆరు నెలల కాలానికి రూ.10వేల కోట్ల కేటాయింపులు చేయగా, అందులో రూ.3,600 కోట్ల మేర ఖర్చు చేసింది.

ఇక ప్రస్తుతం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌ కోసం రూ.26 వేల కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపింది. ఇందులో అధికంగా పాలమూరు–రంగారెడ్డికి రూ.7 వేల కోట్లు, కాళేశ్వరానికి రూ.6 వేల కోట్ల మేర కేటాయింపులు కోరారు. పూర్వ పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుల పూర్తికి రూ.1,200 కోట్ల మేర కేటాయింపులతో ప్రతిపాదనలు సమర్పించారు. అనంతరం మాంద్యం నేపథ్యంలో అన్ని శాఖల బడ్జెట్‌లో 40 శాతం కోత విధించాలని ఆర్థిక శాఖ నుంచి నీటి పారుదల శాఖకు మౌఖిక ఉత్తర్వులు అందాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ప్రతిపాదనలను పూర్తిగా కుదించారు. పాలమూరు ప్రాజెక్టుల ప్రతిపాదనల అంచనాను రూ.1,200 కోట్ల నుంచి రూ.200 కోట్లకు తగ్గించారు. 

ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రాజెక్టులకు రూ.1,400 కోట్లతో మొదట ప్రతిపాదనలు పంపగా, దాన్ని రూ.400 కోట్లకు కుదించారు. మైనర్‌ ఇరిగేషన్‌ కింద చేపడుతున్న పనులకు మొదట రూ.2,100 కోట్ల కేటాయింపులు చేసేలా ప్రతిపాదనలు వెళ్లగా, దాన్ని ఏకంగా రూ.400 కోట్లకు తగ్గించినట్లు తెలుస్తోంది. ఇతర ప్రాజెక్టుల పరిధిలోనూ ఇదే మాదిరి ప్రతిపాదనలు తగ్గించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. మొత్తంగా రూ.7 వేల కోట్లకు తగ్గించి ప్రతిపాదనలు పంపగా ఆర్థికశాఖ దాన్ని రూ. 6,500 కోట్లకు పరిమితం చేసినట్లు తెలిసింది. అయితే ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ల ద్వారా తీసుకునే రుణాలను బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రభుత్వం చూపదు. అంటే ఈ రుణాల ద్వారానే ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేసే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు