21 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్

5 Sep, 2014 00:45 IST|Sakshi
21 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్

28వ తేదీ వరకు సర్టిఫికెట్ల తనిఖీ
 23 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు వెబ్ ఆప్షన్లు
 3న సీట్ల కేటాయింపు... 6 నుంచి తరగతులు
 అర్హులు 1,47,188.. అందుబాటులో ఉన్న సీట్లు 69,068
 ఇంకా అందని అఫిలియేషన్ల సమాచారం...
 అవి అందిన తర్వాతే కాలేజీలు, సీట్ల సంఖ్యపై స్పష్టత
 ఒక్క ఏడాది బీఎడ్ ఇదే ఆఖరు
 
 సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో ఒకటైన ‘బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్)’లో ప్రవేశాల కోసం.. ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ తేదీలను ఏపీ ఉన్నత విద్యా మండలి గురువారం ప్రకటించింది. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియను నిర్వహిస్తారు. 23వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి... 3వ తేదీన సీట్ల కేటాయింపును ప్రకటిస్తారు. బీఎడ్ తరగతులు 6వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. కాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి ఈ ప్రవేశాల ప్రక్రియను చేపడుతున్నందున కన్వీనర్‌గా ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన నిమ్మ వెంకట్రావు, కో-కన్వీనర్‌గా ఉస్మానియా వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సుధీర్‌రెడ్డిని నియమించారు. కౌన్సెలింగ్ కోసం తెలంగాణలో 23, ఆంధ్రప్రదేశ్‌లో 17 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీఈసెట్) కౌన్సెలింగ్‌పై ఈ నెల 9న నిర్ణయించనున్నారు.
 
 అన్నింటికీ అఫిలియేషన్లు వచ్చేనా?
 
 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని బీఎడ్ కాలేజీలకు ఇంకా అఫిలియేషన్లు లభించలేదు. రెండు రాష్ట్రాల్లో కలిపి 647 బీఎడ్ కాలేజీలు ఉండగా... కేవలం తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 12 కాలేజీలకు ఇచ్చిన అఫిలియేషన్ల సమాచారం మాత్రమే ప్రవేశాల క్యాంపు అధికారులకు అందింది. అయితే కౌన్సెలింగ్ 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో... ఆ లోగా మిగతా కాలేజీల సమాచారం అందుతుందని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది లాగే మొత్తం 647 బీఎడ్ కాలేజీల్లోని 69,068 సీట్ల భర్తీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అఫిలియేషన్లు పొందే కాలేజీల సంఖ్యను బట్టి కాలేజీలు, సీట్ల సంఖ్యలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
 
 ఈ సారే ఆఖరు..!
 
 ఏడాది కాలవ్యవధి గల బీఎడ్ కోర్సు   ఈసారే చివరిది కానుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీని కాలవ్యవధి రెండేళ్లకు పెరగనుంది. జస్టిస్ వర్మ కమిటీ సిఫారసుల మేరకు ఎన్‌సీటీఈ 2015-16 విద్యా సంవత్సరం నుంచి బీఎడ్, ఎంఎడ్ కోర్సులను రెండేళ్ల కోర్సులుగా మార్పు చేయనుంది. అంతేకాకుండా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎడ్, బీఈఎల్‌ఈడీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది.
 
 సబ్జెక్టుల వారీగా అర్హులు
 
 గణితం     30,582
 ఫిజిక్స్     11,909
 జీవశాస్త్రం     36,113
 సాంఘికశాస్త్రం     66,408
 ఇంగ్లిష్     2,176
 
 గణాంకాలివీ..
 
 పరీక్ష రాసింది:    1,49,005
 అర్హత సాధించింది:    1,47,188
 కాలేజీలు: 647..     సీట్లు: 69,068
 
 తెలంగాణలో..
 కాలేజీలు: 261..     
 సీట్లు:    27,744    అర్హులు:     97,477
 
 ఆంధ్రప్రదేశ్‌లో..
 కాలేజీలు: 386..     
 సీట్లు:    41,324    అర్హులు:     49,711
 
 
 వర్సిటీల వారీగా..
 
 వర్సిటీ         పరీక్ష రాసింది     అర్హులు
 ఏయూ    28,319    28,048
 ఓయూ    98,745    97,477
 ఎస్వీయూ     19,711    19,462
 నాన్‌లోకల్    2,230    2,201
 మొత్తం    1,49,005    1,47,188

 


 

మరిన్ని వార్తలు