వీడని గందరగోళం! 

23 Jun, 2018 01:44 IST|Sakshi

ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై తకరారు 

నామమాత్రంగా ప్రాథమిక జాబితాపై అభ్యంతరాల పరిశీలన 

జిల్లా విద్యా శాఖాధికారులకు ఎడిట్‌ ఆప్షన్‌ 

అక్కడ ఫిర్యాదు చేసి సరి చేసుకోవాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల తుది సీనియారిటీ జాబితా గందరగోళాన్ని సృష్టిస్తోంది. ప్రాథమిక జాబితాపై వచ్చిన అభ్యంతరాలను నామమాత్రంగా పరిశీలించినట్లు ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టీచర్ల బదిలీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 75,317 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 31,514 మందికి ఒకేచోట పనిచేసే సర్వీసు గడువు ముగియడంతో తప్పనిసరి బదిలీ కానుంది. మరో 43,803 మంది సాధారణ నిర్దేశిత సర్వీసు పూర్తి కానప్పటికీ స్థానచలనం కోసం బదిలీ దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బదిలీ దరఖాస్తులను పరిశీలించిన యంత్రాంగం ఈ నెల 15న ప్రాథమిక సీనియారిటీ జాబితా ప్రకటించింది.

ఈ క్రమంలో ఏకంగా మూడో వంతు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వీటిని పరిశీలించేందుకు వారం రోజులు గడువు తీసుకున్న విద్యాశాఖ.. శుక్రవారం తుది జాబితాను ప్రకటించింది. ఇందులోనూ పెద్ద సంఖ్యలో తప్పులు దొర్లినట్లు ఉపాధ్యాయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చాలాచోట్ల మెడికల్‌ బోర్డులు తిరస్కరించిన వాటిని కూడా ప్రిఫరెన్షియల్‌ కోటాలో నమోదు చేయడం గందరగోళం సృష్టిస్తోంది. మరికొందరి ఎన్‌టైటిల్‌మెంట్‌ పాయింట్లలోనూ వ్యత్యాసాలు రావడంతో టీచర్లలో గాబరా మొదలైంది. శనివారం నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రారంభం కానుంది. ఈనెల 23న గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, 24, 25 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్లు, 26, 27 తేదీల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 

డీఈవోలకు ఎడిట్‌ ఆప్షన్‌.. 
విద్యా శాఖ ప్రకటించిన తుది సీనియారిటీ జాబితాలో అభ్యంతరాలుంటే డీఈవోలకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు వెబ్‌సైట్‌లో ఎడిట్‌ చేసేలా అవకాశం కల్పించింది. తాజాగా ప్రకటించిన తుది సీనియారిటీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి ఆ మేరకు డీఈవోలు మారుస్తారు. దీంతో తుది సీనియారిటీ జాబితా మారనుంది. అయితే వేల సంఖ్యలో అభ్యంతరాలుండటంతో వాటిని ఒకట్రెండు రోజుల్లో ఎలా మారుస్తారని ఉపాధ్యాయులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన తుది జాబితాలో పెద్ద సంఖ్యలో పొరపాటు వచ్చినట్లు ఆరోపిస్తున్నారు. స్పౌజ్‌ పాయింట్లు, ప్రిఫరెన్షియల్‌ పాయింట్ల కేటాయింపులో భారీగా అవకతవకలున్నాయని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.సరోత్తంరెడ్డి, జి.చెన్నకేశవరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పొరపాట్లను సవరించాక జాబితా విడుదల చేసిన అనంతరం పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలని కోరారు. వెబ్‌కౌన్సెలింగ్, వెబ్‌ ఆప్షన్లపై అవగాహన లేకపోవడంతో ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారని ఎస్సీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు భుజంగరావు, సదానంద్‌గౌడ్‌ పేర్కొన్నారు. అవగాహన కల్పించాకే కౌన్సెలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికిప్పుడు వెబ్‌ఆప్షన్లపై అవగాహన సాధ్యం కాదని, మాన్యువల్‌ పద్ధతిలో కౌన్సెలింగ్‌ జరపాలని టీఎస్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్లా, సి.రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు. 

తేలని అంతర జిల్లా స్పౌజ్‌ పాయింట్లు.. 
ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌లో అంతర జిల్లా స్పౌజ్‌ (భార్యా,భర్తలు) పాయింట్లకు అవకాశం కల్పించాలని ఉపాధ్యాయుల నుంచి వినతులు వస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగి పనిచేసే జిల్లా పరిధిలో స్పౌజ్‌ ఉంటేనే ప్రత్యేక పాయింట్లు ఇస్తున్నారు. ఒకవేళ ఉద్యోగి భర్త గానీ, భార్య గానీ పొరుగు జిల్లాలో పనిచేస్తే ఇందులో  పరిగణించట్లేదు. దీంతో కొందరు ఉపాధ్యాయులు తమ స్పౌజ్‌ పొరుగు జిల్లా పనిచేస్తే స్పౌజ్‌ పాయింట్లు ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు విద్యాశాఖకు సూచన చేసింది. కానీ కోర్టు ఇచ్చిన సూచన విద్యా శాఖ పట్టించుకోవట్లేదని పలువురు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు