ఎట్టకేలకు విద్యార్థుల లెక్కలు!

30 Dec, 2018 02:56 IST|Sakshi

సెప్టెంబర్‌లోనే చేయాల్సిన లెక్కలపై ఇప్పుడు కసరత్తు 

కేంద్రం మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో ఆలస్యం 

బడ్జెట్‌ ప్రతిపాదనలకు సమీపిస్తున్న గడువు 

విద్యార్థుల లెక్కలపై విద్యాశాఖ దృష్టి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాల సేకరణకు విద్యాశాఖ ఎట్టకేలకు చర్యలు చేపట్టింది. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్‌ నెలలోనే విద్యార్థులు, టీచర్లు, సదుపాయాలపై సేకరించాల్సిన లెక్కలను ఇప్పుడు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల వివరాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీ కాకపోవడంతో ఇన్నాళ్లు ఆలస్యమైందని అధికారులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా వివిధ పథకాలను కలిపి సమగ్ర శిక్ష అభియాన్‌ పేరుతో ఒకే పథకంగా చేసిన నేపథ్యంలో వివరాల సేకరణలో కొత్త విధానం ఏమైనా అందుబాటులోకి తెస్తుందని రాష్ట్రంలోని అధికారులు ఎదురుచూశారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు జారీ కాలేదు. మరోవైపు రాష్ట్రంలో విద్యార్థులు, పాఠశాలలు, సదుపాయాలు, టీచర్ల సంఖ్య ఆధారంగా విద్యాశాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉంది.  

పాత పద్ధతి ప్రకారమే.. 
కేంద్రం నుంచి మార్గదర్శకాలు రాకపోయినా తమ వద్ద ఉన్న పాత ఫార్మాట్‌ ప్రకారమే వివరాల సేకరణకు ఆ శాఖ చర్యలు చేపట్టింది. లెక్కలు సేకరించాల్సిన సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేసిన విద్యాశాఖ జనవరి 3 నుంచి 5 వరకు పాఠశాలల వారీగా వివరాల నమోదుకు చర్యలు చేపట్టింది. ప్రధాన ఉపాధ్యాయుల నేతృత్వంలో పాఠశాల రికార్డుల ప్రకారం ప్రతీ విద్యార్థి వివరాలను యూడైస్‌కు చెందిన డేటా క్యాప్షర్‌ ఫార్మాట్‌లో నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని డీఈవోలకు పాఠశాల విద్య అదనపు డైరెక్టర్‌ పీవీ శ్రీహరి ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం జనవరి 7, 8 తేదీల్లో స్కూల్‌ కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్లు, క్లస్టర్‌ రీసోర్స్‌ పర్సన్లు ఆ డేటాను ధ్రువీకరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తర్వాత మండల స్థాయిలోనూ మరోసారి వివరాలను పరిశీలించి ఆన్‌లైన్లో జనవరి 18 నుంచి 28లోగా నమోదు చేసేలా చర్యలు చేపట్టింది. 29 నుంచి 31 వరకు జిల్లా స్థాయిలో రిపోర్టులు జనరేట్‌ చేసి, వాటిల్లో ఏమైనా లోపాలు ఉంటే సవరించి ఆ డేటాను రాష్ట్ర కార్యాలయానికి అందజేసేలా ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 12 నుంచి 15లోగా పాఠశాలల వారీగా స్కూల్‌ రిపోర్టు కార్డులను ఆయా పాఠశాలలు, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ కార్యాలయం, గ్రామ పంచాయతీల్లో నోటీస్‌ బోర్డుపై ప్రదర్శించేలా చర్యలు చేపట్టింది.  

మరిన్ని వార్తలు