మళ్లీ బడికి..

12 Aug, 2019 12:23 IST|Sakshi

ఏళ్ల తరబడి విద్యార్థుల మధ్య పాఠశాలలో గడిపిన టీచర్లకు పదవీ విరమణ పొందిన తర్వాత ఇంట్లో ఒంటరిగా కూర్చోడానికి ఇష్టపడరు. అదేవిధంగా కాలక్షేపం కోసం ఇతర పనులు చేయడానికి కష్టంగా భావిస్తారు. అందుకే వారి అనుభవం, జ్ఞానాన్ని పిల్లలకు అందించాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వివరాలు సేకరించే పనిలో ఎంఈఓలు నిమజ్ఞమయ్యారు. స్వచ్ఛందంగా ముందుకు వస్తే పాఠశాలలు బలపడి ఉత్తీర్ణత శాతం పెంచుకోవడానికి దోహదపడుతుంది. ముందుగా ధన్వాడ, మరికల్‌లో విద్యాంజలి పేరుతో ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యాం. 

సాక్షి, మహబూబ్‌నగర్‌(నారాయణపేట) : పదవీ విరమణ వయస్సుకే కాని పనిచేయాలనే మనస్సుకు కాదు. ఇదే నినాదంతో విద్యాశాఖ ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఎన్నో సంవత్సరాలుగా విద్యాబోధన చేసి పదవీ విరమణ పొందిన టీచర్లు చాలావరకు ఇంటికే పరిమితం అవుతుంటారు. మరి కొందరు ఇష్టం లేకపోయినా కాలక్షేపం కోసం వివిధ రకాలైన వృత్తులు చేస్తుంటారు. అలాంటి వారి సేవలను తిరిగి సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యాబోధనతో చక్కటి ఫలితాలు సాధించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో విద్యాంజలి పేరుతో రూపొందించిన కార్యక్రమం ముందుగా ధన్వాడ, మరికల్‌ మండలాల్లో ప్రారంభించి అన్ని మండలాలకు విస్తరించాలని భావిస్తున్నారు. 

రిటైర్డ్‌ అయినా సేవలో..  
ఏళ్ల తరబడి సర్కారు ఉప్పు తిన్నందుకు కనీసం శేష జీవితంలో తాను పనిచేసిన శాఖలో సేవ చేయాలనే తలంపుతో ఉన్న రిటైర్డ్‌ టీచర్ల వివరాల సేకరణలో జిల్లా విద్యాశాఖ అధికారులు నిమజ్ఞమయ్యారు. కొత్తగా ఏర్పాటైన నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో ఇటీవల చాలా మంది పదవీ విరమణ పొందారు. వారిలో కొందరు ఉచితంగా బోధన చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ముందుగా ధన్వాడ, మరికల్‌ మండలాల్లో పైలెట్‌ ప్రాజె క్టుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. ఆ మేరకు ఆయా మండలాల్లో ప్రస్తుతానికి 30 మందిని గుర్తించగా 22 మంది సేవ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సంఖ్య రాబో యే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంద ని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.  

సౌకర్యవంతమైన సేవలు.. 
ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా విద్యాబోధన చేయడానికి ముందుకు వస్తున్న రిటైర్డ్‌ టీచర్లకు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన సేవలను తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది. స్వచ్ఛందంగా వస్తుండటంతో వారు స్థానికంగా నివాసం ఉన్నచోటనే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. గతంలో విద్యాబోధన చేసిన అనుభవం, జ్ఞానాన్ని విద్యార్థులతో పంచుకోవడంతో రాబోయే టెన్త్‌ ఫలితాల్లో సైతం ఉత్తీర్ణత శాతం పెంరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.  

జిల్లాలో ప్రయోజనం పొందేది
కొత్తగా ఏర్పాటైన నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 11 మండలాల పరిధిలో 75 ఉన్నత, 86 యూపీఎస్, 337 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 68,501మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉన్నత పాఠశాలలకు ఉపయోగపడే లెక్షరర్లు, జీహెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్స్, పండిత్‌లతో విద్యాబోధన చేయిస్తారు. వీరి రాకతో ముఖ్యంగా 6461మంది టెన్త్‌ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. అదేవిధంగా ఎస్‌జీటీలుగా పదవీ విరమణ పొందిన వారిని ప్రాథమిక పాఠశాలలో వారి సేవలను సద్వినియోగం చేసుకోనున్నారు.   

మరిన్ని వార్తలు