జిల్లాకు.. విద్యాశాఖ

3 Jun, 2014 02:33 IST|Sakshi
జిల్లాకు.. విద్యాశాఖ

- మంత్రిగా ప్రమాణం చేసిన గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
- మాట నిలబెట్టుకున్న కేసీఆర్   
- టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం


సాక్షిప్రతినిధి, నల్లగొండ,  ‘‘జగదీష్‌రెడ్డిని గెలిపించి, నాకు ఇవ్వండి. ఆయనను మంత్రిని చేసి సూర్యాపేటకు పంపిస్తా..’’ అని గత ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట బహిరంగ సభలో హామీ ఇచ్చిన కేసీఆర్.. మాట నిలబెట్టుకున్నారు. తన కేబినెట్‌లో జగదీష్‌రెడ్డికి చోటు కల్పించారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు 11మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. తొలి విడతలోనే అవకాశం దక్కించుకున్న జగదీష్‌రెడ్డికి విద్యాశాఖ బాధ్యతలు అప్పజెప్పారు. తెలంగాణ కొత్త రాష్ట్రంలో, జిల్లాకు తొలిమంత్రిగా జగదీష్‌రెడ్డి రికార్డుల్లో నిలిచిపోనున్నారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పదవి దక్కింది.

ఎన్నికల్లో పూర్తి మెజారిటీని సాధించిన టీఆర్‌ఎస్.. ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో సహజంగానే, జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడైన జగదీష్‌రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. జిల్లానుంచి టీఆర్‌ఎస్ తరపున ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచినా, సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, అధికార ప్రతినిధి కూడా అయిన జగదీష్‌రెడ్డికే అవకాశాలు ఉంటాయని అంచనా వేశారు. దానికి తగినట్టుగానే మంత్రి పదవికి పోటీపడే సీనియ ర్లు ఎవరూ లేకపోవడం కూడా కలిసి వచ్చింది.

తొలిసారి జిల్లాకు.. విద్యాశాఖ
గతంలో వివిధ ప్రభుత్వాల్లో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులు మంత్రులుగా పనిచేశారు. అయినా ఇప్పటిదాకా జిల్లాకు విద్యాశాఖ దక్కలేదు. ఉమ్మడి రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్)లో ఎక్కువకాలం మంత్రిగా పనిచేసి రికార్డు సొం తం చేసుకున్న నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుం దూరు జానారెడ్డి ఎక్కువ శాఖలకూ ప్రాతి నిధ్యం వహించారు. కానీ ఆయన కూడా విద్యాశాఖను ఇంతవరకు నిర్వహించలేదు. గతంలో మంత్రులుగా పనిచేసిన పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఉమామాధవరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు గడిచిన నాలుగు దశాబ్దాల్లో మంత్రులుగా పనిచేసినవారే.

రాష్ట్ర పాలనలో కీలకమైన హోం, పంచాయతీరాజ్, వ్యవసా యం తదితర శాఖలూ జిల్లాకు దక్కాయి. కానీ, ఈసారి అనూహ్యంగా జగదీష్‌రెడ్డికి విద్యాశాఖ దక్కింది. గతంలో విద్యాశాఖను మూడు ముక్కలు చేసి ముగ్గురు మంత్రులకు బాధ్యతలు  అప్పజెప్పినా, ఈసారి మాత్రం విద్యాశాఖను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఒక్క మంత్రికే అప్పజెప్పినట్లు చెబుతున్నారు. మలి విడతలో తీసుకునే మంత్రులకూ శాఖలను విడగొట్టి ఇవ్వనిపక్షంలో విద్యాశాఖ మంత్రిగా నియమితులైన జగదీష్‌రెడ్డి అధీనంలోనే ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలు ఉంటాయని భావిస్తున్నారు. తొలి విడతలోనే జగదీష్‌రెడ్డికి మంత్రిపదవి దక్కడంతో టీఆర్‌ఎస్ శ్రేణు లు హర్షం వ్యక్తం చేశాయి. పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్న ఆయన, ఇప్పుడు మంత్రి కూడా కావడంతో ఆ పార్టీ నేతలు ఆనందంలో మునిగిపోయారు.

>
మరిన్ని వార్తలు