పరీక్షల్లేకుండానే పై క్లాసులకు

6 May, 2020 03:24 IST|Sakshi

1 నుంచి 9 తరగతుల విద్యార్థులు పై తరగతులకు

ప్రమోట్‌ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఒకటి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులందరినీ పైతరగతులకు ప్రమోట్‌చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మేనేజ్‌మెంట్‌ పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పైతరగతులకు పంపాలని ఏప్రిల్‌ 19న జరిగిన కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని అదేరోజు సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. చదవండి: సెప్టెంబర్‌ 1నుంచి ఇంజనీరింగ్‌ క్లాసులు  

విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించరాదని స్పష్టంచేశారు. దీనిపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామ్‌చంద్రన్‌ మంగళవారం ఉత్తర్వులు (జీవో 54) జారీచేశారు. కరోనా నేపథ్యంలో 2019–20 విద్యా సంవత్సరంలో 1 నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–2 (వార్షిక) పరీక్షలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వారందరినీ 2020–21 విద్యా సంవత్సరంలో పైతరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఉత్తర్వులు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ని యాజమాన్యాల పాఠశాలలకు వర్తిస్తాయని పేర్కొన్నారు. చదవండి: జూలై 26న నీట్‌ 

 

మరిన్ని వార్తలు