ఒక ఆవరణలో ఒకటే బడి!

24 Dec, 2019 02:23 IST|Sakshi

కొత్త కాన్సెప్ట్‌పై విద్యా శాఖ దృష్టి

రెండు మూడు స్కూళ్లను కలిపి ఒకటిగా చేయాలని యోచన

తగ్గిపోనున్న 3 వేల ప్రభుత్వ పాఠశాలలు

సాక్షి, హైదరాబాద్‌: ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒకే స్కూల్‌. ఎక్కువ మంది విద్యార్థులు.. సరిపడా టీచర్లు.. మౌలిక వసతుల సద్వినియోగం.. తద్వారా మెరుగైన విద్యా బోధన అనే కొత్త ప్రణాళికపై విద్యా శాఖ దృష్టి సారించింది. అమలు సాధ్యాసాధ్యాలపై ఆలోచనలు చేస్తోంది. అయితే అన్ని స్కూళ్లలో కాకుండా కనీసం ఒకే ఆవరణలో (50 మీటర్లలోపు) ఒకటికి మించి ఉన్న స్కూళ్లను కలిపేసి ఒకే స్కూల్‌గా చేయొచ్చా..? సాంకేతిక సమస్యలేమైనా వస్తాయా..? ఉపాధ్యాయ సంఘాల నుంచి ఎలాంటి వాదన వస్తుందన్న కోణంలోనూ ఆలోచనలు చేస్తోంది. ఇది కనుక కార్యరూపం దాల్చితే దాదాపు 3 వేల ప్రభుత్వ పాఠశాలలు తగ్గి, 23 వేలకు పరిమితం అయ్యే అవకాశం ఉంది.

ఒకే ఆవరణలో రెండు, మూడు.. 
ప్రస్తుతం రాష్ట్రంలో 26,050 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో ఒకే ఆవరణలో రెండు మూడు స్కూళ్లు కొనసాగుతున్న పాఠశాలలు 7,077 ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఆవరణల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, మరికొన్నింటిలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు వేర్వేరు స్కూళ్లు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా స్కూళ్లలో ఇద్దరు ముగ్గురు ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు ముగ్గురు పీఈటీలు ఉండటంతో మానవ వనరులు వృథా అవుతున్నట్లు విద్యా శాఖ దృష్టికి వచ్చింది. అయితే ఒకే ఆవరణలో ఉన్న అలాంటి స్కూళ్లను ఒకే స్కూల్‌గా (1 నుంచి 10 వరకు) మార్చేస్తే ఒకరే హెడ్‌ మాస్టర్‌.. ఒకరే పీఈటీ/పీడీ ఉంటారు. తద్వారా మిగతా వారి సేవలను అవసరమైన వేరే స్కూళ్లలో సద్వినియోగపరచుకునే వీలు కలుగుతుందని అధికారులు యోచిస్తున్నారు.

విధానం మార్పు కుదిరేనా? 
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రాథమిక (ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు), ప్రాథమికోన్నత (1 నుంచి 7వ తరగతి వరకు), ఉన్నత (6 తరగతి నుంచి 10వ తరగతి వరకు) మూడంచెల పాఠశాలల విధానం ఉంది. అయితే జాతీయ స్థాయిలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ విధానం, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సెకండరీ ఎడ్యుకేషన్‌ విధానం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎలిమెంటరీ, సెకండరీ విద్యా విధానం ఉండాలని గతంలో చెప్పింది.

ఈ నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒకే స్కూల్‌ విధానం సాధ్యం అవుతుందీ లేనిదీ పరిశీలించి ముందుకు వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఒకే ఆవరణలో ఒకటికి మించి ఎక్కువ పాఠశాలలు ఉన్నవి హైదరాబాద్‌ జిల్లాలోనే అత్యధికంగా ఉన్నాయి. ఆ తర్వాత సంగారెడ్డి, నిజామాబాద్‌లో ఎక్కువగా ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది.

మరిన్ని వార్తలు