ఒకటికి రెండు, మూడుసార్లు పునఃపరిశీలన..!

4 May, 2019 08:08 IST|Sakshi

పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న విద్యాశాఖ 

ఇంటర్‌ ఫలితాల వివాదాల నేపథ్యంలో అప్రమత్తం 

 వచ్చే వారంలో టెన్త్‌ ఫలితాలు విడుదల చేసే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తప్పుల కారణంగా తలెత్తిన వివాదాల నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. త్వరలో విడుదల కానున్న పదోతరగతి పరీక్షల ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా పక్కా చర్యలు చేపడుతోంది. తొందరపడి ఫలితాలు ప్రకటించి 5.5 లక్షల మంది విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టకుండా.. ఒకటికి రెండు, మూడుసార్లు పునఃపరిశీలన జరిపాకే ఫలితాలను వెల్లడించాలని నిర్ణయించింది. పదో తరగతి పరీక్ష ఫలితాల ప్రాసెస్, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి.. శుక్రవారం విద్యాశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సుధాకర్, ఇతర అధికారులు, సాంకేతిక సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.

పదోతరగతి పరీక్షల ఫలితాల విషయంలో ఒక్క పొరపాటు కూడా జరక్కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. స్కానింగ్‌ ప్రక్రియ కూడా ముగిసింది. ఫలితాల ప్రాసెస్‌ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో తప్పులు దొర్లకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. తప్పులు దొర్లకుండా పక్కాగా పరిశీలన జరపడంతోపాటు ఒకవేళ విద్యార్థులకు అనుమానాలున్నా, ఫిర్యాదు చేయాలన్నా ఆన్‌లైన్‌లోనే చేసేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

విద్యార్థులు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా, తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుని లాగిన్‌ నుంచి, లేదా ఇంటర్నెట్‌ సెంటర్‌ నుంచి ఫిర్యాదు చేసేలా, దానికి మెసేజ్‌ రూపంలో రెస్పాన్స్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా రీ–వెరిఫికేషన్‌ ప్రక్రియను చేపట్టనున్నారు. శనివారం నుంచి వచ్చే నాలుగైదు రోజులు పునఃపరిశీలన జరుపనున్నారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక వీలైతే వచ్చే 10వ తేదీన ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. పరిశీలన ప్రక్రియ కనుక సవ్యంగా పూర్తికాకపోతే 15వ తేదీలోగా పూర్తి చేసి ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించారు. మొత్తానికి 10–15 తేదీల మధ్య ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

పరీక్షల విషయంలో తీసుకోనున్న జాగ్రత్తలివే! 

  • ఒక సబ్జెక్టు మినహా మిగతా సబ్జెక్టుల్లో పాస్‌ అయిన విద్యార్థులు ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ అయినా, ఆబ్సెంట్‌ పడినా ఆ జవాబు పత్రాలను రీ–వెరిఫికేషన్‌ చేస్తారు. 
  • సున్నా మార్కులు వచ్చినా వారి జవాబు పత్రాలను పునఃపరిశీలిస్తారు. సబ్జెక్టుల వారీగా మార్కుల వ్యత్యాసాన్ని సరిపోల్చి చూస్తారు. 
  • సైన్స్‌లో అత్యధిక మార్కులు వచ్చి, మ్యాథ్స్‌లో తక్కువ మార్కులు వస్తే మళ్లీ పరిశీలన జరుపుతారు. 
  • అన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చి ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తే ఆ విద్యార్థి జవాబు పత్రాన్ని రీ–చెక్‌ చేస్తారు. 
  • ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు పాఠశాలలకు ప్రత్యేక లింకు ఇస్తారు. 
  • పాఠశాలల వారీగా విద్యార్థుల మార్కులను కూడా ఆయా పాఠశాలలకు పంపిస్తారు. అందులో ఏమైనా అనుమానాలు ఉన్నా, తక్కువ మార్కులు వచ్చినట్లు గుర్తించినా విద్యార్థులు సంబంధిత ప్రిన్సిపాల్‌ దగ్గర్నుంచే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేస్తారు. 
  • పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు తలెత్తే అనుమానాలను నివృత్తి చేసేందుకు, ఫిర్యాదులను స్వీకరించేందుకు ఆన్‌లైన్‌ విధానం ప్రవేశ పెడతారు. విద్యార్థులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఆన్‌లైన్‌ లింక్‌ ఇస్తారు. అవసరమైతే మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెస్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక సర్వర్‌ను అందుబాటులో ఉంచుతారు. 
  • విద్యార్థులెవరూ హైదరాబాద్‌కు రావాల్సిన అవసరమే లేకుండా ఆన్‌లైన్‌ ద్వారానే వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపడతారు. ఈ క్రమంలో విద్యార్థి ఫిర్యాదు చేసిన వెంటనే అతని మొబైల్‌ నంబరుకు మెసేజ్‌ పంపిస్తారు. అది పరిష్కారం అయ్యాక కూడా మెసేజ్‌ పంపిస్తారు. ఈ–మెయిల్‌ ఐడీకి కూడా ఆ వివరాలను పంపిస్తారు. వీటికి సంబంధించిన వెబ్‌సైట్‌/వెబ్‌లింక్‌/మొబైల్‌ యాప్‌ను నాలుగైదు రోజుల్లో సిద్ధం చేయాలని నిర్ణయించారు.
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా