‘జూన్’జాటం

12 Jun, 2014 02:38 IST|Sakshi
‘జూన్’జాటం

నిత్యావసరాల ధరలు ఎన్నిమార్లు పెరిగినా ఎలాగోలా తట్టుకున్నారు. వేసవి రోజులన్నాళ్లు కరెంటు లేక పోయినా ఇంటిలో కాసింతైనా నిశ్చింతగా ఉండగలిగారు. కానీ ఇప్పుడా అవకాశం  లేకుండా పోతోంది. వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో నేటినుంచి బడిగంటలు మోగబోతున్నాయి. ఇంటి బడ్జెట్‌లో పిల్లాడి చదువు ఖర్చులు వచ్చి చేరబోతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, దుస్తులు, బూట్లు, స్టేషనరీ సామగ్రి కొనుగోళ్లకు తల్లిదండ్రులు బడ్జెట్ లెక్కలు వేసుకుంటున్నారు. పెరిగిన ఖర్చుతో వారి గుండె ఝల్లుమంటోంది. అంచనాలకు మించిన పెరిగిన ధరలు దడ పుట్టిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితిల్లో తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అదనపు బడ్జెట్‌తో అన్నీ సమకూర్చి బడికి పంపాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
 
బ్యాగులు ...
పాఠశాలలు మొదలుకొని కళాశాలల విద్యార్థుల వరకు పుస్తకాల మోతకు బ్యాగులు అవసరం. మార్కెట్లో అన్ని రకాల తరగతులకు సంబంధించిన బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. నర్సరీ నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు రకరకాల అనువైన బ్యాగులు విక్రయిస్తున్నారు. నర్సరీ నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు రూ.250 నుంచి రూ.700 ధరల్లో బ్యాగులు దొరుకుతున్నా యి. కళాశాల విద్యార్థులకు పాఠ్య, నోట్‌బుక్స్ పెట్టుకోవడంతోపా టు ల్యాప్‌టాప్ పెట్టుకునే సౌలభ్యం గల బ్యాగులూ లభిస్తున్నాయి. ఒక్కో బ్యాగు రూ.వెయ్యి నుంచి రూ..1500 వరకు ధర ఉంది.  
 
నోట్‌బుక్స్
గతంతో పోలిస్తే నోట్ బుక్స్ ధర 20 శాతం మేర పెరిగింది. నిరుడు రూ.10 ధర పలికిన పుస్తకం నేడు రూ.12కు చేరింది. లాంగ్ నోట్‌బుక్ రూ.20 నుంచి రూ.22 పలుకుతోంది. రఫ్ నోట్స్‌లైతే రూ.12 నుంచి మార్కెట్‌లో లభ్యమవుతున్నారుు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నోట్ బుక్స్ ధరల్ని విపరీతంగా పెంచేయడంతో బయటి మార్కెట్‌లో వీటికి డిమాండ్ పెరిగింది.
 
సైకిళ్లు
ఇంచుమించు అన్ని ప్రైవేటు పాఠశాలలకు స్కూల్ బస్సులు ఉన్నారుు. బస్సు సౌకర్యం అందుబాటులో లేక, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విద్యార్థులుసైకిళ్లు వినియోగిస్తున్నారు. బాలురు, బాలికలకు సంబంధించి వివిధ రకాల మోడళ్లలో సైకిళ్లు మార్కెట్‌లో లభ్యమవుతున్నారుు. ఒక్కోటి రూ.3వేల నుంచి రూ.5వేలు పలుకుతోంది.
 
కవర్లు, నేమ్ స్టిక్కర్లు..
ఏడాది పాటు పుస్తకాలు భద్రంగా ఉండాలంటే కనీస జాగ్రత్తలు అవసరం. పుస్తకాలు చిరగకుండా,  మారిపోకుండా ఉండేందుకు అట్టలు, నేమ్ సిక్కర్లు తప్పనిసరి. వివిధ రకాల బొమ్మలతోకూడిన కాగితం, సింథటిక్ అట్టలపై విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. పుస్తకాలకు భ ద్రతతో పాటు అందాన్నిఇచ్చే కవర్లు నాణ్యతనుబట్టి రూ.15నుంచి రూ.75వరకు, స్టిక్కర్లురూ.3 నుంచిరూ.10 వరకుమార్కెట్‌లో ధరపలుకుతున్నాయి.  స్కేలు రూ.10 నుంచి రూ.45, పరీక్ష ప్యాడ్ రూ.20 నుంచి రూ.135 వరకు ధర ఉంది.
 
టిఫిన్ బాక్స్‌లు..
విద్యార్థులు పాఠశాలకు తీసుకెళ్లేందుకు టిఫిన్ బాక్స్‌లు కావా లి. మార్కెట్లో వాటి ధర రూ.200 నుంచి రూ.400 వరకు ఉన్నాయి. రక రకాల కంపెనీలతో కూడిన టిఫిన్ బాక్స్‌లు లభిస్తున్నాయి. టిఫిన్ డబ్బాలను తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా బ్యాగులు అమ్ముతున్నారు. ఒక్కో బ్యాగు ధర రూ.60 నుంచి రూ.140 వరకు ఉన్నాయి.
 
వాటర్ బాటిళ్లు..
కొన్ని పాఠశాలల్లో తాగునీరు అందుబాటులో ఉండడం లేదు. విద్యార్థులు ఇంటి నుంచే లంచ్ బాక్స్‌ల వెంట తా గునీరు తీసుకెళ్తున్నారు. నీటిని చల్లగా ఉంచే బాటిల్స్ కూడా కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. వర్షాకాలం, చలికాలాల్లో చల్లని నీరు పడని విద్యార్థులు వాటర్ బాటిల్స్‌ను తీసుకెళ్లవచ్చు. వాటర్ బాటిళ్ల ధర రూ.20 నుంచి రూ.100 వరకు ఉంటోంది. నీటిని చల్లగా ఉంచే విధంగా రూపొందించిన ప్రత్యేక బాటిళ్లురూ.200కు విక్రయిస్తున్నారు.
 
షూస్.. సాక్స్‌లు..
నలుపు, తెలుపు బూట్లు, సాక్స్‌లు కూడా పాఠశాల ప్రారంభంతో కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. తరగతి, వయసు పెరగడంతో  ఏటా బూట్లు కొనుగోలు చేయక తప్పడం లేదు. నర్సరీ విద్యార్థులకు రూ.150 నుంచి రూ.300 వరకు ఉన్నాయి. పదో తరగతి విద్యార్థులకు రూ.200 నుంచి రూ.500 వరకు బూట్ల ధరలు ఉన్నాయి. సాక్స్‌ల ధరలు రూ.25 నుంచి రూ.40 వరకు ఉన్నాయి. కాటన్, నైలాన్ సాక్స్‌లు కూడా ఉన్నాయి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు సాక్స్‌లపై పాఠశాల పేరును ముద్రించి అక్కడే విక్రయిస్తున్నాయి.
 
పెన్నులు, పెన్సిళ్లు..
పెన్నులు, పెన్సిళ్లు లేకపోతే విద్యార్థులకు చదువు సాగదు. పెన్నులు రూ.3 నుంచి రూ.200 వరకు ఉన్నాయి. పెన్సిల్ రూ.2 నుంచి రూ.50 వరకు, ఎరేజర్ రూ.1 నుంచి రూ.5 వరకు లభిస్తున్నాయి.
 
పలకలు, జామెట్రీ బాక్స్‌లు
నర్సరీ నుంచి యూకేజీ వరకు పలకల వినియోగం తప్పనిసరి. మార్కెట్లో పిల్లలను ఆకట్టుకునేందుకు రకరకాల పలకలను ప్రవేశపెట్టారు. నలుపు రంగుపలక రూ.20కు లభిస్తోంది. చిన్నారుల్ని ఆకట్టుకునే మ్యాజిక్ స్లేట్‌లు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవి ఒక్కోటి రూ.200. వివిధ రకాల జామెట్రీ బాక్స్‌లు రూ.20 నుంచి రూ.300 వరకు లభిస్తున్నాయి.
 
యూనిఫాం..
ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు తప్పనిసరి. నర్సరీ నుంచి పదో తరగతి వరకు యూనిఫాం ఉండాల్సిందే. వయసు, తరగతిని బట్టి ఒక్కో విద్యార్థికి రూ.300 నుంచి రూ.1000 వరకు యూనిఫాంకు ఖర్చు చేయాల్సి వస్తుంది. యూనిఫాం బట్టల అమ్మకాలు జరుగుతున్నప్పటికీ కుట్టు కూలీ ఖర్చు ఎక్కువ కావడంతో తల్లిదండ్రులు రెడీమేడ్ దుస్తులపై మొగ్గు చూపుతున్నారు. ఒక్కో స్కూల్‌కు ఒక్కో రకమైన యూనిఫాం ఉండడంతో అన్ని షాపుల్లో వాటి అమ్మకాలు సాగుతున్నాయి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలల్లోనే యూనిఫాంలు విక్రయిస్తున్నాయి.
 
టై.. బెల్ట్..
టై.. బెల్ట్‌లు కూడా మార్కెట్లో అన్ని పాఠశాలలకు సంబంధించినవి అందుబాటులో ఉన్నాయి. పాఠశాలల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. స్కూళ్లో ఒక్కో టై రూ.50 నుంచి రూ.100 వరకు ఉంటుంది. బయట మార్కెట్‌లో వ్యాపారులు తక్కువ ధరకే టై, బెల్టుల అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక్కో టై రూ.10 నుంచి రూ.20, బెల్ట్‌లు రూ.15 నుంచి రూ.30లకే లభిస్తున్నాయి.
 
అప్పులు చేస్తున్నాం..
ఈ సంవత్సరం పంటలు బాగా పండలేదు. ఖరీఫ్ కోసం ఇప్పుడు మళ్లీ పెట్టుబడులు పెట్టే కాలం వచ్చింది. ఎరువులు, విత్తనాలు కొనడానికే అప్పులు చేస్తున్నాం. ఇప్పుడే పిల్లలను స్కూలుకు పంపే సమయం వచ్చింది. వాళ్లకూ పైసలు కావాలి. మరింత అప్పు చేయక తప్పేలా లేదు.
 - శేఖర్‌రెడ్డి, నారెగూడ
 
భారం పెరుగుతోంది..
పిల్లలను పాఠశాలలకు పంపాలంటే వారికి పుస్తకాలు, బూట్లు, యూనిఫాంలు, బ్యాగులు కొనాలి. సీజన్ కావడంతో వాటి ధరలు మండిపోతున్నాయి. స్కూలు ఫీజులు విపరీతంగా పెరిగిపోయాయి. బస్‌ల ఫీజులు కూడా బాగా పెరిగాయి. ఏం చేస్తాం పిల్లల కోసం భారం మోయాల్సిందే.
- ప్రభాకర్, గుబ్బడిపత్తేపూర్
 
ప్రభుత్వ ఆజమాయిషీ లేదు..
ఫీజుల వసూలపై ప్రభుత్వ ఆజమాయిషీ లేకపోవడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వేలకువేల రూపాయలు వసూలుచేస్తున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యనందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.  
- డి. లలిత, విద్యార్థి తల్లి
 
అప్పుల నెలగా మారింది..
ప్రైవేటు స్కూళ్ల అడ్డగోలు నిబంధనలతో జూన్ అంటేనే తల్లితండ్రులకు అప్పుల నెలగా మారింది. పుస్తకాలు, టైలు, పెన్నులు తదితర వస్తువులన్నీ పాఠశాలల్లోనే కొనుగోలు చేయలనడంతో ఎక్కువ ధరలు వెచ్చించి అప్పుల పాలవుతున్నాం.
- మామిండ్ల ముత్యాలుయాదవ్, విద్యార్థి తండ్రి

>
మరిన్ని వార్తలు