కేజీ టు పీజీలోనూ వృత్తి విద్య!

14 Feb, 2015 03:31 IST|Sakshi
కేజీ టు పీజీలోనూ వృత్తి విద్య!

- అనుసంధానించాలనే యోచనలో విద్యాశాఖ


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న కేజీ టు పీజీ ఉచిత నిర్భంద విద్యలో వృత్తి విద్య కోర్సులను ప్రవేశపెట్టే అంశంపైనా విద్యాశాఖ ఆలోచనలు చేస్తోంది. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను (ఎన్‌ఎస్‌క్యూఎఫ్) రూపొందించిన కేంద్ర ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్యా కోర్సులను ప్రవేశ పెట్టాలని స్పష్టం చేసింది. తద్వారా విద్యార్థులు వివిధ దశల్లోని ఆయా కోర్సులను చదువుకోవడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్న కేజీ టు పీజీలో వృత్తి విద్యా కోర్సుల ప్రవేశంపైనా ప్రభుత్వం ఆలోచిస్తోంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో దీనిపై చర్చించినట్లు తెలిసింది.

కేజీ టు పీజీపై విధాన పత్రం రూపొందించేందుకు నిర్వహించిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, విద్యావేత్త చుక్కా రామయ్య, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు, అదనపు డెరైక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివి ద అంశాలపై చర్చించారు. ఇప్పటివరకు రాష్ట్ర విద్యా విధానంలో గురుకుల విద్య మాత్రమే పక్కాగా సత్ఫలితాలు ఇస్తోందన్న భావనకు ప్రభుత్వం వచ్చిం ది. అందుకే కేజీ టు పీజీ విద్యా సంస్థల్లో గురుకుల విద్య, ఇంగ్లిషు మీడియం విద్యను ప్రవేశపెట్టాలని సమావేశంలో ప్రాథమికంగా ఓ అవగాహనకు వచ్చారు. అయితే ఏ తరగతి నుంచి ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టాలి? ఏ తరగతి నుంచి గురుకుల విద్యను అమలు చేయాలన్న ఆంశాలపై వివిధ కోణాల్లో ఆలోచనలు చేశారు.

కొంత మంది కిండర్‌గార్టెన్ (కేజీ) నుంచే ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టాలని పేర్కొనగా మరికొంత మంది 4వ తరగతి నుంచి ఇంగ్లిషు మీడియం ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలని కొందరు పేర్కొనగా, తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు కేజీ నుంచే ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టాలని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్రాథమిక స్థాయిలో తెలుగుతోపాటు ఇంగ్లిషు మీడియంను కూడా కొనసాగించడానికి వీలు అవుతుందా? ఇంగ్లిషును ఒక సబ్జెక్టుగా కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న ఆంశాలపై చర్చించారు. ఇప్పటివరకు అంతర్జాతీయంగా ఎక్కడా లేని కొత్త విధానం అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ, జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయని, ఎలా ముందుకు సాగాలన్న అంశాలపై చర్చ జరి గింది. మొత్తానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలకు చెందిన నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న ముఖ్య లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలా ముందుకు సాగాలన్న అంశాలపై ఈనెల 18 లేదా 19 తేదీల్లో మరోసారి సమావేశమై విధాన పత్రాన్ని ఖరారు చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత ఆ విధానపత్రాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదానికి పంపించనున్నారు. సీఎం ఆమోదం తరువాత తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలతో చర్చించాలని, వెబ్‌సైట్‌లో పెట్టి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించారు.
 

మరిన్ని వార్తలు