ధూంధాంగా ఏడుపాయల జాతర

21 Jan, 2015 00:44 IST|Sakshi
ధూంధాంగా ఏడుపాయల జాతర

పాపన్నపేట: ‘‘మాస్టర్ ప్లాన్‌తో ఏడుపాయలకు మెరుగులు దిద్దుతాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరుగుతున్న తొలి అతిపెద్ద జాతర ఏడుపాయలే. ఇక నుంచి ఏడుపాయల వనదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తాం. మాస్టర్ ప్లాన్ సర్వే కోసం రూ.20 లక్షలు తక్షణమే మంజూరు చేస్తున్నాం.

జానపదుల జాతరగా పేరొందిన ఏడుపాయల జాతరను ధూంధాంగా నిర్వహించి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేందుకు శాయశక్తులా కృషి చేస్తాం’’ అని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఏడుపాయల్లో మాఘ అమావాస్య ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఏడుపాయల జాతరను తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా నిర్వహిస్తామన్నారు.

ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు ఎస్.కుమార్ ఆర్కిటెక్చర్ కంపెనీతో ఒప్పందం జరిగినట్లు చెప్పారు. వెంటనే యాక్షన్‌ప్లాన్ తయారు చేసేందుకు ప్రభుత్వం తరఫున రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి అతిపెద్ద జాతర ఏడుపాయల జాతరేనన్నారు. ఇకనుంచి ప్రతి మహాశివరాత్రి జాతరకు ప్రభుత్వం తర ఫున దుర్గమ్మతల్లికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామని, ఈ మేరకు దేవాదయ శాఖ మంత్రితో మాట్లాడామని చెప్పారు.

ఈ మహాజాతరను కన్నుల పండువగా నిర్వహించేందుకు ఈనెల 24న కలెక్టర్, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతిరోజు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏడుపాయల్లో విశాలమైన రోడ్లు, అందరికీ సరిపడ తాగునీరు, విద్యుత్ కాంతులు, పచ్చని హరిత వనాలు ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.

జైకా నిధుల కింద అమ్మవారి ఆలయం ఎదుట బ్రిడ్జిని, 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను, ఔట్‌పోస్టును ఏర్పాటు చేస్తామన్నారు. వనదుర్గ ప్రశస్తిని తెలంగాణలోని పల్లెపల్లెకూ విస్తరింపజేస్తామన్నారు. అమ్మవారి పవిత్రతను కాపాడుతూ యజ్ఞశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. డిప్యూటీ స్పీకర్ వెంట పాలక మండలి చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ మెంచు నగేష్, ఈఓ వెంకట కిషన్‌రావులు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు