నైరుతి.. నత్తనడక

12 Jun, 2019 01:39 IST|Sakshi

ఈ నెల 16న రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం 

నైరుతి ఆలస్యంతో ఖరీఫ్‌ పంటల సాగుపై ప్రభావం 

మరోవైపు అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 

పలుచోట్ల 40 నుంచి 44 డిగ్రీల వరకు రికార్డు

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు మందకొడిగా సాగుతున్నాయి. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడి గాలిలోని తేమ అటువైపు వెళ్తుండటంతో రుతుపవనాలు మందకొడిగా ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. దీంతో రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించే అవకాశముందన్నారు. ఈ నెల 16 నాటికి తెలంగాణలోకి ప్రవేశిస్తాయని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో సగటున 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల 44 డిగ్రీ వరకూ నమోదు కావడం గమనార్హం. సాధారణం కంటే మూడు నుంచి ఏడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరోవైపు అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ముందు ప్రకటించినట్లుగా ఈ నెల 6న కేరళలోకి, 11న తెలంగాణలోకి ప్రవేశించాలి. కానీ రెండ్రోజులు ఆలస్యంగా అంటే ఈ నెల 8న కేరళలోకి ప్రవేశించాయి. అనంతరం 13న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని తర్వాత ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ తేదీ కూడా మారుతోంది. పోనీ ఈ నెల 16వ తేదీనైనా కచ్చితంగా వస్తాయా? లేదా? అన్న అనుమానాలను కొందరు వాతావరణ శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంతో పోలిస్తే ఈసారి 97 శాతం వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ ప్రకారం సాధారణ నైరుతి సీజన్‌ వర్షపాతం 755 మిల్లీమీటర్లు (ఎంఎం) కాగా, 97 శాతం లెక్కన ఈసారి 732 ఎంఎంలు కురిసే అవకాశముంది. గతేడాది జూన్‌ 8నే తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. కానీ ఇప్పుడు మరింత ఆలస్యం కావడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది.  

ఖరీఫ్‌ సాగుపై ఆందోళన... 
నైరుతి రుతుపవనాలు ఇంకా కేరళ దాటి పైకి రాలేదు. తెలంగాణలోకి ఎప్పుడు వస్తాయో స్పష్టత రావడంలేదు. ఈపాటికి రుతువపనాలు వచ్చి వర్షాలు కురిస్తేనే రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేసే పరిస్థితి ఉంటుంది. కానీ వేడి సెగలు కక్కుతుండటం, వర్షాలు లేకపోవడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడుతుండటంతో కొందరు రైతులు ఇవే రుతుపవనాల వర్షాలుగా భావించి దుక్కి దున్ని విత్తనాలు చల్లారు. కానీ అధిక ఉష్ణోగ్రతలతో అవి భూమిలోనే మాడిపోయే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

అందులో దాదాపు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే సూచనలున్నాయి. గతేడాది 1.03 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయితే, ఈసారి అదనంగా 7 లక్షల ఎకరాలకు పెరుగుతుందని అంచనా వేశారు. ఆ మేరకు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశారు. కానీ వరుణుడు కరుణించకపోవడంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉం టుందోనని రైతులను, వ్యవసాయాధికారులు ఆందో ళన చెందుతున్నారు. అనేకచోట్ల ఇప్పటికీ 40–45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్, రామగుండంలో 44, మెదక్, నిజామాబాద్‌లో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక వేడితో భూమి సెగలు కక్కుతోంది. దుక్కి దున్నుతుంటే వేడి పైకి వస్తోందని రైతులు అంటున్నారు.

ఉపరితల ఆవర్తనం..
ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాగల మూడు రోజులు ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాజారావు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా