ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి

17 Nov, 2014 23:45 IST|Sakshi
ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి

 రామాయంపేట: తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తామని మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రామాయంపేటలోని జాతీయ రహదారి పక్కన నూతనంగా నిర్మించిన హోటల్‌ను ఆమె సోమవారం ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మెదక్ సెగ్మెంట్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు.

ఈమేరకు నిధుల మంజూరు కోసం సీఎంకు ప్రతిపాదనలు కూడా సమర్పించామన్నారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా మొదటి విడతగా మండలంలోని 15 చెరువులను తీసుకున్నామని, వీటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తామన్నారు. పింఛన్ల మంజూరీలో అర్హులకు అన్యాయం జరగదని స్పష్టం చేశారు. అనంతరం ఆమె అయ్యప్పస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈసందర్భంగా ఆమెతో పాటు మెదక్ ఆర్డీఓ నగేశ్‌ను, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డిని ఎంపీపీ అధ్యక్షురాలు పుట్టి విజయలక్ష్మి  శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పాతూరి ప్రభావతి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మానెగల్ల రామకిష్టయ్య, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతల ఏసుపాలు, పట్టణశాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, జిల్లా కార్యదర్శి అందె కొండల్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా కార్యదర్శి మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


 ‘సి’ గ్రేడ్ ధాన్యాన్యి కొనుగోలు చేసేలా చర్యలు
 చేగుంట, వెల్దుర్తి:  కొనుగోలు కేంద్రాల్లో ‘సి’ గ్రేడ్ ధాన్యాన్ని కూడా సేకరించేలా చర్యలు చేపడుతున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వడియారం శివారులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 120 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేస్తామన్నారు. రైతుల వద్ద ‘సి’  గ్రేడ్ ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.1180ల మద్దతు ధరకు సేకరిస్తున్నట్లు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలకు ప్రాధాన్యత కల్పించామన్నారు.  

జిల్లాలో రూ.17వేల కోట్లను రైతు రుణాలను మాఫీ చేశామని, 25 శాతం డబ్బులను తిరిగి రుణాలుగా అందించామన్నారు. జిల్లాలో రూ.900 కోట్లను రైతులకు రుణాలుగా అందించామన్నారు. రోడ్ల నిర్మాణం కోసం జిల్లాకు రూ.70 కోట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు