గుడ్డు గుటుక్కు!

26 Aug, 2019 10:25 IST|Sakshi

అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం అంతంతే   

పట్టించుకోని సంబంధిత అధికారులు

కేంద్రాలపై కొరవడిన పర్యవేక్షణ   

సాక్షి, సిటీబ్యూరో: అందరికీ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడింది. ఆశయం ఘనంగా ఉన్నా అమలు మాత్రం అస్తవ్యస్తంగా తయారైంది. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది చేతివాటంతో కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ అంతంతగా మారింది. కోడిగుడ్లు సరఫరా కాకుండానే మాయమవుతున్నాయి. చిన్నారులు, కౌమార బాలికలు, గర్భిణులు, బాలింతలకు సమగ్ర పోషకాహారం అందించాలనే లక్ష్యం గాడి తప్పుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడేళ్లలోపు బాలబాలికలు బాలామృతం, ప్రతినెలా పదహారు కోడిగుడ్ల చొప్పున పంపిణీ చేయాల్సి ఉంది. కేంద్రానికి వచ్చే వారికి పోషక పదార్థాలతో కూడిన ఆరోగ్యలక్ష్మి, బాలామృతం ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు, తక్కువ బరువున్న పిల్లలకు, గర్భిణులకు సప్లిమెంటరీ న్యూట్రిషన్‌ ప్రోగ్రామ్‌ (ఎస్‌ఎన్‌పీ) ఆహారాన్ని అందిస్తారు. తక్కువ బరువున్న చిన్నారులకు రూ.9, గర్భిణులకు రూ.7 చొప్పున ఖర్చు చేస్తారు. చిన్నారులకు 12– 15 గ్రాములు, గర్భిణులకు 18– 20 గ్రాముల ప్రొటీన్లు అందేందుకు రోజువారీ ఆహారంలో గుడ్డు అందించటం తప్పనిసరి. గర్భిణులకు రోజూ పోషకాహారంతోపాటు పాలు కూడా అందించాల్సి ఉంటుంది. కానీ అంగన్‌ వాడీ కేంద్రాల్లో అమలవుతున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో సుమారు 35– 45 శాతం అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్లు, పాలు పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. అడపాదడపా  సంబంధిత అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో నిర్వాహకుల చేతివాటం బయటపడుతున్న ప్పటికీ చర్యలు మాత్రం కానరావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

భిన్నంగా హాజరు శాతం..
అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరు శాతం వాస్తవికతను భిన్నంగా కనిపిస్తోంది. సుమారు 63,894 చిన్నారులు నమోదై ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చిన్నారుల హజరు శాతం సగానికిపైగా తక్కువగా ఉంటున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. గత ఏడాది అప్పటి కలెక్టర్‌ యోగితా రాణా ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు హాజరు శాతాన్ని తీవ్రంగా పరిగణించారు. ముఖ్యంగా చిన్నారుల హాజరు శాతం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినా ఫలితం లేకుండాపోయింది. అంగన్‌వాడీల సూపర్‌వైజర్లు, వర్కర్లు కమిటీగా  ఏర్పడి బస్తీలు, కాలనీలో ప్రజలకు అవగాహన కల్పించేలా చేపట్టిన చర్యలు ముందుకు సాగలేదు. 

మరిన్ని వార్తలు