రాష్ట్రంలో ఎగ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ

13 Mar, 2018 03:07 IST|Sakshi

లిథియం అయాన్‌ బ్యాటరీల ఉత్పత్తి యూనిట్‌ కూడా

ముందుకు వచ్చిన జపాన్‌ కంపెనీ ఇసే

సాక్షి, హైదరాబాద్ ‌: జపాన్‌కు చెందిన ప్రముఖ ఫుడ్‌ కంపెనీ ఇసే (ఐఎస్‌ఈ) ఫుడ్స్‌ రాష్ట్రంలో కోడిగుడ్ల ప్రాసెసింగ్‌ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. సిద్దిపేట జిల్లా నంగనూర్‌ మండలం నర్మెట గ్రామంలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనుంది. కోళ్ల ఫారంలో లభించే వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీ ప్లాంట్, పౌల్ట్రీ టెక్నాలజీలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. శిక్షణలో భాగంగా ఇక్కడి విద్యార్థులను జపాన్‌కు తీసుకెళ్లనుంది.

సుజుకీ మోటార్స్‌ కంపెనీ భాగస్వామ్యంతో లిథియం అయాన్‌ బ్యాటరీల పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రాన్నీ ఏర్పాటు చేయనుంది. రెండు మూడేళ్లలో ఇక్కడి నుంచే బ్యాటరీలు ఉత్పత్తి కానున్నాయి. వీటి ఏర్పాటుకు అనుమతులు, రాయితీల మంజూరు పత్రాలను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, మహేందర్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఐఎస్‌ఈ కంపెనీ ప్రతినిధులకు అందజేశారు.

జపాన్‌ ప్రధాన మంత్రి ప్రత్యేక సలహాదారు మిట్సుహిరో మియాకొవాషీ నేతృత్వంలో హైదరాబాద్‌కు వచ్చిన ఇసే ఫుడ్స్‌ చైర్మన్, ఆ దేశ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రులు సమావేశమయ్యారు. నగరంలోని నేషనల్‌ బ్యాట్మింటన్‌ అకాడమీ ద్వారా.. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు ఇసేతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రాన్ని సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో ఒక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

ఎగ్‌ బాస్కెట్‌ ఆఫ్‌ ఇండియాగా రాష్ట్రానికి ఇప్పటికే పేరుందని, పౌల్ట్రీ రంగంలో దేశంలో అగ్రస్థానంలో ఉందని మంత్రి ఈటల తెలిపారు. ఇసే పరిశ్రమ స్థాపన ద్వారా ఇక్కడి పౌల్ట్రీ పరిశ్రమకు, మొక్కజొన్న పంటలు పండించే రైతన్నలకు లబ్ధి కలగనుందని కంపెనీ చైర్మన్‌ హికొనొబు తెలిపారు. అధునాతన పద్ధతుల్లో మొక్కజొన్నను నిల్వ చేయ డం ద్వారా కనీసం 30% ఆదాయం పెరుగుతుందని, ఈ మేరకు ప్రభుత్వంతో పనిచేస్తామన్నారు.

మరిన్ని వార్తలు