...నాట్‌ గుడ్‌!

13 Sep, 2019 03:45 IST|Sakshi

అంగన్‌వాడీలకు అస్తవ్యస్తంగా కోడిగుడ్ల సరఫరా

సకాలంలో స్టాకు అందకపోవడంతో చేతులెత్తేస్తున్న వైనం

సాక్షి, హైదరాబాద్‌: పౌష్టికాహార లోపాలను అధిగమించేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా తీసుకుంటున్న చర్యలు ఆశించిన ఫలితాలివ్వడం లేదు. ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి, పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతిరోజు 200 మిల్లీలీటర్ల పాలు, ఉడికించిన కోడిగుడ్డు ఇవ్వాలి. వీటితోపాటు అధిక పోషక విలువలున్న ఆహారాన్ని వండి వడ్డించాలి. అయితే గత కొన్ని నెలలుగా ఈ ప్రక్రియ గాడి తప్పింది. సకాలంలో కోడిగుడ్ల స్టాకును కాంట్రాక్టర్లు అంగన్‌వాడీ కేంద్రాలకు చేర్చడం లేదు. దీంతో క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన ఉడికించిన కోడిగుడ్లు లబ్ధిదారులకు అందండం లేదు.

సకాలంలో స్టాకును ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతున్నట్లు అంగన్‌వాడీ టీచర్లు పేర్కొంటున్నారు. సెపె్టంబర్‌ నెలకు అవసరమైన స్టాకు ఇప్పటివరకు అంగన్‌వాడీ కేంద్రాలకు చేరలేదు. రాష్ట్రవ్యాప్తంగా 32,217 కేంద్రాలనుంచి కోడిగుడ్ల ఇండెంట్లు ఆన్‌లైన్‌లో ప్రవేశపెట్టారు. కానీ ఇప్పటివరకు 2,139 కేంద్రాలకు మాత్రమే స్టాకు చేరినట్లు తెలుస్తోంది. మొత్తంగా 86.66 లక్షల కోడిగుడ్లకుగాను ఇప్పటివరకు 6.32 లక్షల గుడ్లు మాత్రమే సరఫరా అయ్యాయి. దీంతో పూర్తిస్థాయి పోషకాహారాన్ని ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. సాంకేతిక కారణాలను చూపుతూ డీలర్లు స్టాకును సకాలంలో ఇవ్వడం లేదు. కొందరు డీలర్లు బిల్లులు చెల్లించని సాకుతో ఆలస్యంగా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పెట్టిన ఇండెంట్లు, గుడ్ల సరఫరా 
ఇండెంట్లు పంపిన కేంద్రాలు- 32,217
ఇప్పటివరకు పంపిణీ- 2,139
శాతం- 6%
ఇండెంట్‌ పరిమాణం- 8,66,6551
ఉత్పత్తి అయిన పరిమాణం- 6,32,565
శాతం- 7.3%

మరిన్ని వార్తలు