ఈజిప్టు ఉల్లి..రావే తల్లీ..!

8 Dec, 2019 04:05 IST|Sakshi

ఇంకా తగ్గని ‘ఉల్లిఘాటు’..

రాష్ట్రానికి పెరిగిన దిగుమతి..శనివారం 5,514 క్వింటాళ్ల రాక

2 వేల క్వింటాళ్లు అధికంగా వచ్చినా ధరలకు కళ్లెం పడని తీరు

కర్ణాటక ఉల్లికి మలక్‌పేట మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.16 వేలు పలికిన ధర

బహిరంగ మార్కెట్‌లో కిలో ధర రూ.170–180

సాక్షి, హైదరాబాద్‌: పొరుగు రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతులు పెరిగినా ధర మాత్రం ఇంకా ఆకాశంలోనే ఉంది. వస్తున్న ఉల్లిగడ్డ డిమాండ్‌కు తగ్గట్టుగా లేకపోవడంతో ధరలు దిగి రావడం లేదు. నిన్నమొన్నటితో పోలిస్తే మాత్రం కాస్త ఊరటినిచ్చేలా రూ.20 మేర ధరలు తగ్గడం కొంతలో కొంత ఉపశమనం కలిగిస్తోంది. శనివారం సైతం మలక్‌పేట మార్కెట్‌లో క్వింటాలు ఉల్లి ఏకంగా రూ.16,000 పలకగా, మహారాష్ట్ర ఉల్లి రూ.14,000 పలికింది. అంటే హోల్‌సేల్‌ మార్కెట్‌లో ధర రూ.160 వరకు ఉండగా, బహిరంగ మార్కెట్‌లో అది రూ.170–180 మధ్య ఉంది. ఈ ఇబ్బంది ఈజిప్టు నుంచి వచ్చే ఉల్లి దిగుమతులు తీరుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పుడు ధర బాగా తగ్గే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు.

2 వేల క్వింటాళ్లు అధికంగా మార్కెట్‌లోకి.. 
కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ నుంచి ఉల్లి దిగుమతులు తగ్గడంతో గడిచిన కొద్ది రోజుల నుంచి ఉల్లి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. మూడు నాలుగు రోజుల కిందట కిలో ఉల్లి ధర బహిరంగ మార్కెట్‌లో రూ.170కి చేరగా, రెండు రోజుల క్రితం అది రూ.200 దాటింది. గురువారం సైతం మలక్‌పేట మార్కెట్‌లో కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చిన ఉల్లి వ్యాపారులు క్వింటాల్‌ రూ.18 వేలకు అమ్మారు. అంటే మార్కెట్‌ యార్డుల్లోనే కిలో ఉల్లి రూ.180 ఉండగా, అది బహిరంగ మార్కెట్‌లకు వచ్చేసరికి రూ.200లు పలికింది.

శుక్రవారం 2,500 క్వింటాళ్ల నుంచి 3వేల క్వింటాళ్ల మేర మాత్రమే ఉల్లి రాగా, శనివారం 5,514 క్వింటాళ్ల ఉల్లిగడ్డ వచ్చింది. దీంతో శనివారం మార్కెట్‌లో కర్ణాటక నుంచి వచ్చిన పెద్దసైజు ఉల్లి క్వింటాల్‌ రూ.16 వేలు పలకగా, మహారాష్ట్ర ఉల్లి రూ.14 వేలు పలికింది. మీడియం రకం కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చింది రూ.15 వేలు పలకగా, మహారాష్ట్ర ఉల్లిగడ్డ రూ.16 వేలు పలికింది. వీటి ధరలు బహిరంగ మార్కెట్‌లోకి వచ్చేసరికి మరో రూ.20 అదనంగా పెరిగి రూ.170–180 మధ్య ఉన్నాయి.

సోమవారం నుంచి రాష్ట్రానికి మహారాష్ట్ర, రాజస్తాన్‌ నుంచి ఉల్లి దిగుమతి 7 వేల నుంచి 8 వేల క్వింటాళ్ల మేర ఉండే అవకాశం ఉంటుందని మలక్‌పేట మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. అలా అయితే ధర కిలో రూ.100 దిగొచ్చే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి తోడు శనివారం కర్నూల్‌ మార్కెట్‌లోనూ ఉల్లి ధరలు దిగొచ్చాయి. మొన్నటి వరకు కర్నూలులో క్వింటాల్‌ ఉల్లి ధర రూ.14 వేలు పలకగా, అది శనివారం రూ.8 వేలకు తగ్గింది. పొరుగు రాష్ట్రంలో ధరలు దిగిరావడం సైతం రాష్ట్రానికి అనుకూలించనుంది.

15న రానున్న ఈజిప్టు ఉల్లి.. 
ఇక ఈజిప్టు నుంచి కేంద్రం దిగుమతి చేసుకుంటున్న 6,090 మెట్రిక్‌ టన్నుల ఉల్లిలో తెలంగాణ 500 మెట్రిక్‌ టన్నులు ఇదివరకే కోరింది. ఈ ఉల్లి ఈ నెల 15న ముంబై పోర్టు ద్వారా రాష్ట్రానికి చేరే అవకాశం ఉందని మార్కెటింగ్‌ వర్గాలు తెలిపాయి. వారానికి 100 మెట్రిక్‌ టన్నుల వంతున ఐదు వారాల పాటు ఈ ఉల్లిని మార్కెట్‌లోకి వదలనున్నారు. దీన్ని రాష్ట్రంలోని 40 రైతుబజార్ల ద్వారా కిలో రూ.40కే అమ్మనున్నారు. దీనిద్వారా ధరలు దిగొస్తాయని మార్కెటింగ్‌ శాఖ అంచనా వస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం వ్యాపారులతో మాట్లాడి సరూర్‌నగర్, మెహిదీపట్నం మార్కెట్‌లలో కిలో ఉల్లి రూ.40కే విక్రయిస్తోంది. దీనిద్వారా సామాన్యుడికి ఉపశమనం కలుగుతోందని మార్కెటింగ్‌ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు