ఈసారైనా ఒనగూరేనా?

5 Jul, 2014 04:45 IST|Sakshi
  •    అధ్యయనానికే పరిమితమైన వరల్డ్‌క్లాస్
  •      ఏళ్లు గడిచినా ముందుకు కదలని ప్రతిపాదనలు
  •      సికింద్రాబాద్ స్టేషన్‌పై పెరుగుతున్న ఒత్తిడి
  •      ఏ మాత్రం పట్టని నాంపల్లి స్టేషన్ అభివృద్ధి
  •      అదనపు టర్మినళ్లపై  కదలిక శూన్యం
  • సాక్షి, సిటీబ్యూరో: ప్రతి బడ్జెట్ ఒక ప్రహసనం. ప్లాట్‌ఫామ్‌పైకి ఒకదాని తరువాత మరొకటి రైలొచ్చినట్లుగా బడ్జెట్‌లకు బడ్జెట్‌లు వస్తూనే ఉన్నాయి. కానీ నగరానికి పెద్దగా ఒనగూరిన ప్రయోజనం మాత్రం లేదు. ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ పెండింగ్ జాబితాలోనే పేరుకుపోతున్నాయి. ఏటా కొత్త రైళ్లు వస్తున్నాయి.

    ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. కానీ అందుకు తగిన విధంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల విస్తరణ జరగకపోవడంతో రైళ్లరాకపోకల్లో గంటల తరబడి జాప్యం చోటుచేసుకుంటోంది. మరో నాలుగు రోజుల్లో  రైల్వే బడ్జెట్ రానున్న  దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం  రైల్వే ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. వందల కొద్దీ రైళ్ల రాకపోకలతో, లక్షలాది మంది ప్రయాణికుల తాకిడితో నిత్యం కిటకిటలాడే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను సమూలంగా మార్చివేయాలని సూచించారు.

    మరోవైపు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్‌లకు ప్రత్యామ్నాయంగా మరిన్ని టర్మినళ్లు నిర్మించాలన్న సీఎం సూచన  చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశమే. ప్రస్తుత స్టేషన్లపై పెరుగుతున్న ఒత్తిడి దృష్ట్యా మల్కాగిరి, మౌలాలీ, హైటెక్‌సిటీ వంటి రైల్వేస్టేషన్లను విస్తరించాలన్న ప్రతిపాదనలు ఏళ్లకు ఏళ్లుగా కాగితాలకే పరిమితమవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలన్న ఆరేళ్ల నాటి బడ్జెట్ ప్రతిపాదన ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు.
     
    అధ్యయనాలకే పరిమితమైన వరల్డ్‌క్లాస్...


    మినీ భారత్‌ను తలపించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం 80కిపైగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు, 122 సబర్బన్, ఎంఎంటీఎస్‌లు రాకపోకలు సాగిస్తాయి. వీటికితోడు ఏటా 3 నుంచి 4 కొత్త రైళ్లు వచ్చి చేరుతూనే ఉన్నాయి. ఇప్పుడున్న 10 ప్లాట్‌ఫామ్‌లు ఏ మాత్రం చాలడంలేదు. ఒక రైలు ప్లాట్‌ఫామ్ వదిలితే కానీ మరో రైలు స్టేషన్‌లోకి ప్రవేశించడం సాధ్యం కాదు.

    దీంతో చాలా రైళ్లు నగర శివార్లలోనో, సమీప స్టేషన్లలోనో నిలిపివేస్తున్నారు. ఈ ఒత్తిడిని  దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని సుమారు రూ.5 వేల కోట్లతో 2008  బడ్జెట్‌లోనే  ప్రతిపాదించారు. కానీ  ఇప్పటికీ  ఆ  ప్రతిపాదన  ఒక్క అడుగైనా  ముందుకు పడలేదు. అధ్యయనాలకే  పరిమితమైంది.

    సికింద్రాబాద్‌ను  వరల్డ్‌క్లాస్  ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తే  విమానాశ్రయం తరహాలో ఎలివేటెడ్ లైన్‌లను నిర్మిస్తారు. స్టేషన్‌కు చేరుకునే రైళ్లన్నీ  ఒకవైపు నుంచి, స్టేషన్ నుంచి  బయలుదేరేవన్నీ మరోవైపు నుంచి వెళ్లే విధంగా లైన్‌లు, ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేస్తారు. ప్యాసింజర్ రైళ్లు, ఎంఎంటీఎస్, సబర్బన్ సర్వీసుల కోసం ప్రత్యేక  లైన్లు ఉంటాయి. దీనివల్ల  రైళ్ల రాకపోకల్లో ఎలాంటి అంతరాయం లేకుండా, ఆలస్యానికి తావు లేకుండా నిర్వహణ సాధ్యమవుతుంది.
     
    ఆచరణకు నోచని అదనపు టర్మినళ్లు....

    సికింద్రాబాద్‌తోపాటు నాంపల్లి, కాచిగూడ  రైల్వేస్టేషన్‌ల నుంచి రోజూ 2.5 లక్షల మంది ప్రయాణికులు  బయలుదేరుతారు.నాంపల్లి,కాచిగూడ  స్టేషన్‌లలో  5 ప్లాట్‌ఫామ్‌ల చొప్పున ఉన్నప్పటికీ 18 బోగీల కంటే ఎక్కువ బోగీలున్న  దూరప్రాంత ఎక్స్‌ప్రెస్  రైళ్లు ఆగేందుకు  అనుకూలంగా  లేవు. ఒకటి, రెండు స్టేషన్లలో మాత్రమే ఆ సదుపాయం ఉంది.  దీంతో అన్ని రైళ్లను సికింద్రాబాద్‌కే మళ్లిస్తున్నారు. ఆ  విధంగా కూడా  సికింద్రాబాద్‌పై ఒత్తిడి పెరుగుతోంది.  ఇందుకు ప్రత్యామ్నాయంగా మౌలాలీ, మల్కాజిగిరి  స్టేషన్‌లను  భారీ  టర్మినళ్లుగా  నిర్మించాలని  చాలా కాలంగా  ప్రతిపాదనలు ఉన్నాయి.
     
    కలగానే ఎంఎంటీఎస్ ప్రత్యేక లైన్...

    రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే కూడా లోకల్ ట్రైన్‌కే  ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలన్న లక్ష్యంతో  2003లో  ప్రారంభించిన  ఎంఎంటీఎస్‌కు అడుగడుగునా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. నగరంలోని నాలుగు ప్రధాన మార్గాల్లో  రోజూ 121 సర్వీసులతో సుమారు  లక్షా 70 వేల మందికి  రవాణా సదుపాయాన్ని అందజేస్తోన్న ఎంఎంటీఎస్ కోసం  ప్రత్యేకంగా ఓ లైన్ వేయాలన్న ప్రతిపాదన నేటికీ ఆచరణకు నోచలేదు.
     

మరిన్ని వార్తలు