ఈఎంఆర్‌లకు మహర్దశ

12 May, 2019 02:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కేంద్రీయ విద్యాలయాల తరహాలో ఏకలవ్య స్కూళ్లు 

ప్రస్తుతం రాష్ట్రంలో 6 ఈఎంఆర్‌లు 

కొత్తగా 5 స్కూళ్లు మంజూరు చేసిన కేంద్రం 

2019–20 విద్యా ఏడాది నుంచి 11 స్కూళ్లు ప్రారంభం 

అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం  

సాక్షి, హైదరాబాద్‌: ఏకలవ్య మోడల్‌ స్కూళ్ల (ఈఎంఆర్‌)కు మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం ఈ స్కూళ్లను కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నప్పటికీ.. త్వరలో పూర్తిగా కేంద్రం అధీనంలో పనిచేయనున్నాయి. ఇందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా సొసైటీ ఏర్పాటు చేయాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్, నవోదయ విద్యాలయ సొసైటీ తరహాలో ఈఎంఆర్‌ సొసైటీని అభివృద్ధి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రాల వారీగా ఉన్న పాఠశాలలు, వాటి అవసరాలు, ఖాళీలు, పోస్టుల భర్తీ తదితర పూర్తి సమాచారాన్ని పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది.

వీలైనంత త్వరగా వివరాలు పంపిస్తే సొసైటీ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6 ఈఎంఆర్‌ పాఠశాలలున్నాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈఎంఆర్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌కు హైదరాబాద్‌ వేదికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వేడుకల ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జూవల్‌ ఓరమ్‌ తెలంగాణకు కొత్తగా ఐదు స్కూళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 2019–20 విద్యా సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తేవాలని, ఆలోపు అనుమతులన్నీ జారీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రాథమిక అనుమతులు వచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. 

సీబీఎస్‌ఈ సిలబస్‌.. 
దేశవ్యాప్తంగా ఉన్న ఈఎంఆర్‌ పాఠశాలల్లో చాలావరకు స్థానిక భాషకు అనుగుణంగా బోధన సాగుతోంది. వీటిని జాతీయ స్థాయి సొసైటీకి అనుసంధానిస్తే.. అన్ని పాఠశాలల్లో ఒకే తరహా బోధన, అభ్యాసన కార్యక్రమాలు నిర్వహించాలి. దీంతో అన్నింట్లో ఇంగ్లిష్‌ మీడియం బోధన నిర్వహించనున్నారు. అదేవిధంగా సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేస్తారు. కేవీ, నవోదయ పాఠశాలలకు ధీటుగా వీటిని బలోపేతం చేస్తారు. దీనికి అవసరమైన నిధులన్నీ కేంద్రమే భరిస్తుంది. అదేవిధంగా ఈ పాఠశాలల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ, జీతభత్యాల చెల్లింపులు తదితర ప్రక్రియంతా కూడా సొసైటీ అధీనంలో జరుగుతుంది.

రాష్ట్రానికి కొత్తగా మంజూరైన 5 ఈఎంఆర్‌లకు గిరిజన మంత్రిత్వ శాఖ నిధులు ఇవ్వనుంది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాల్సి ఉంటుంది. ఒక్కో ఈఎంఆర్‌కు గరిష్టంగా రూ.25 కోట్లు చొప్పున ఐదింటికి రూ.125 కోట్ల వరకు మంజూరు చేసే అవకాశముందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కొత్తగా మంజూరైన ఈఎంఆర్‌లకు నిధులు విడుదలైన వెంటనే చర్యలు చేపడతారు.

మరిన్ని వార్తలు