అయ్యా...నా డబ్బులు వచ్చాయేమో చూడు...!

3 Nov, 2019 07:50 IST|Sakshi
పోస్టాఫీసు వద్ద పడిగాపులు కాస్తున్న మల్లయ్య

మునుగోడుకు చెందిన మల్లయ్య ఎదురు చూపు  

మునుగోడు : నాకు ప్రతి నెలా వస్తున్న ఆసరా పింఛన్‌ ఒక్కసారిగా నిలిచిపోయింది. ఎందుకు రాలేదు సారు అంటే మండల పరిషత్‌ కార్యాలయంలో అడుగుపొమ్మని పోస్టాఫీసు ఉద్యోగులు చెప్పారు. అక్కడికి వెళ్లి అడిగితే సరిచేశాం వచ్చే నెలా వస్తుంది తీసుకోమని ఎంపీడీఓ మేడం చెప్పింది...తిరిగి మరుసటి నెల ఫోస్టాఫీసుకు వచ్చి అడిగితే రాలేదని చెప్పారు. దీంతో ఈ రోజైనా వస్తుందేమోనని ప్రతి రోజూ ఇక్కడికి వచ్చి వారిని చూడమని వేడుకుంటున్నా...అని మండల కేంద్రానికి చెందిన నారగోని మల్లయ్య అనే వృద్ధుడు శనివారం తన గోడును సాక్షికి మొరపెట్టుకున్నాడు.

మునుగోడుకు చెందిన  మల్లయ్యకు 15 ఏళ్లుగా వృద్ధాప్య పింఛన్‌ వస్తుంది. అయితే ఆ డబ్బులతో తన కుమారులపై ఆధార పడకుండా అతడికి అవసరమైన వైద్య ఖర్చులు, ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నాడు. కానీ సెప్టెంబర్‌ నుంచి డబ్బులు రావడం లేదు. దాంతో ఆయన ఎన్ని కార్యాలయాలు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఇతడితో పాటు మరో 8 మంది లబ్ధిదారులు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారు. విషయాన్ని ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని పింఛన్‌ డబ్బులు ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.    

మరిన్ని వార్తలు