మలి సంధ్యలో మరణ శాసనం

1 Jun, 2020 08:58 IST|Sakshi

కాయాకష్టం చేసి కుటుంబాన్ని పోషించుకున్న ఇంటి పెద్దలు.. మలి వయసులో మనుమలు, మనువరాళ్లు, కొడుకులతో సుఖసంతోషాలతో ఉండాల్సిన వారు ఆత్మహత్య చేసుకుంటూ కుటుంబానికి శోకం మిగిల్చుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 రోజుల వ్యవధిలో దాదాపు 12 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులా.. అనారోగ్యమా.. కుటుంబ  కలహాలా.. కారణమేదైనా తమకుతామే మరణ శాసనం లిఖిస్తూ ఆయా కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు.

సాక్షి, వేములవాడ రూరల్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో వారం వ్యవధిలో ముగ్గురు వృద్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. వేములవాడ పరిధిలోని శాత్రాజుపల్లికి చెందిన సంగెపు మల్లారెడ్డి మే 21న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్‌ మండలం చెక్కపల్లికి చెందిన జక్కుల దేవయ్య మే 25న నూకలమర్రి శివారులో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మళ్లీ వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని శాత్రాజుపల్లిలో అనారోగ్య కారణాలతో వృద్ధుడు మే 30న ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో విషాదం నింపింది. అలాగే మే17న జగిత్యాల మండలం సంగంపల్లికి చెందిన దాసరి రాజమల్లు, కాల్వశ్రీరాంపూర్‌ మండలం జగ్గయ్యపల్లెకు చెందిన వృద్ధురాలు మణెమ్మ క్రిమిసంహారకమందు తాగి, మే 18న వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన లస్మవ్వ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మే 19న జమ్మికుంట రూరల్‌ మండలం చింతలపల్లికి చెందిన పుల్లూరి పోచమ్మ, మే 24న ఎలిగేడు మండలం దూళికట్టకు చెందిన మచ్చ రాజమల్లయ్య క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా 15రోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12మంది బలవన్మరణానికి పాల్పడ్డారు.
(రౌడీషీటర్‌ దారుణహత్య)

కారణాలేమిటో..?
వయోభారం, అనారోగ్యం, మలి వమపెలొ కుటుంబసభ్యులకు భారం కాకుండా తనువు చాలించాలనే ఆలోచనతో పలువురు వృద్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా అన్ని రకాలుగా ఉండి నా అనే వాళ్లు లేకపోవడంతో ఇక తాము ఉండలేమనే మనోవేధన, భావనతో కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయా గ్రామస్తుల నోట వినిపిస్తోంది. మలి సంధ్యలో కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఆయా గ్రామాల్లో తోటివారిని కలిచివేస్తోంది. (పెద్ద మనసు చాటుకున్న వెటోరి )

భరోసా కల్పిస్తే.. 
వృద్ధాప్యంలో ఉన్నవారికి కుటుంబ సభ్యులు మేమున్నామనే భరోసా కల్పిస్తే వారిలో మనోధైర్యం కలుగుతుంది. ఆస్తితగాదాలు, మనస్పర్థలు, ప్రేమానురాగాలు లాంటి కారణాలతో వృద్ధ వయస్సులో మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యకు దారి  తీస్తున్నాయి.
– జక్కని రాజు, సైకాలజిస్టు, కరీంనగర్‌

ఇతరులకు భారం కావొద్దనే..
వృద్ధాప్యంలో కొంత మంది తనవల్ల ఇతరులకు ఇబ్బంది కలుగవద్దని ఆలోచిస్తు న్నారు. తను మరొకరి భారం కావద్దనే ఉద్దేశ్యంతో బలన్మరణాలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్న. మరొకరితో సేవలు చేయించుకోవడం ఇష్టం లేక కూడా కొంత మంది వృద్ధులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నా అభిప్రాయం.
– ఆనందరెడ్డి, వైద్యాధికారి, వేములవాడ

మరిన్ని వార్తలు