పరిషత్‌ పీఠాలు ఎవరివో తేలేది నేడే

7 Jun, 2019 02:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేడు ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు

రేపు జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల నిర్వహణ..

ఏర్పాట్లు పూర్తిచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

మండలాల్లో ఎంపీపీ, జిల్లాల్లో జెడ్పీ ఫలితాల వెల్లడి..

 సాక్షి, హైదరాబాద్‌: పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో తదుపరి ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మండల ప్రజాపరిషత్‌ (ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలతోపాటు జిల్లా ప్రజాపరిషత్‌ (జెడ్పీ) చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. శుక్రవారం ఎంపీపీ కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికలతోపాటు ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. శనివారం జెడ్పీ కోఆప్టెడ్, చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఫలితాలను అధికారులు అప్పటికప్పుడు ప్రకటిస్తారు. జిల్లా స్థాయిలో ఐఏఎస్‌ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించినందున ఎస్‌ఈసీ ప్రమేయం లేకుండానే ఎంపీపీల ఫలితాలను మండలాల్లో, జెడ్పీల ఫలితాలను జిల్లాల్లో వెంటనే వెలువరిస్తారు.

గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జెడ్పీ, ఎంపీపీ పదవులకు పరోక్ష పద్ధతుల్లో ఎన్నుకునే విధానం ఉండేది. అయితే, ఫలితాల వెల్లడి తర్వాత బేరసారాల నివారణ చర్యల్లో భాగంగా పరిషత్‌ పదవుల ఎన్నికకు ఎక్కువ వ్యవధి లేకుండా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకు రావడంతో ఈ ఆనవాయితీ మారింది. ఎంపీ టీసీ, జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణం చేయకుం డానే ఎంపీపీ అధ్యక్ష, జెడ్పీ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు. ఇలా ప్రమాణం చేయకుం డానే అధ్యక్ష, చైర్‌పర్సన్లను ఎన్నుకోవడం పంచాయతీరాజ్‌ చరిత్రలో ఇదే తొలిసారి.

ఎన్నికల ప్రక్రియ ఇలా...
ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రతి మండలానికీ సదరు మండల ఎంపీడీవోను పర్యవేక్షణ అధికారిగా నియమించారు. ప్రిసైడింగ్‌ అధికారులు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తారు. సాయంత్రం 5 గంటల్లోగా ఎంపీపీ కోఆప్టెడ్, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తికానున్నాయి. ఎంపీపీ కోఆప్టెడ్, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల కోసం ఉద్దేశించిన ప్రత్యేక సమావేశం శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమవుతుంది. తొలుత కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. ఇందుకోసం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఒకే నామినేషన్‌ దాఖలైతే ఆ అభ్యర్థి ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఒకటికి మించి నామినేషన్లు వస్తే మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ఎన్నిక నిర్వహిస్తారు.

ఇది ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. అనంతరం ఎంపీపీ ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరుపుతారు. ఈ ఎన్నికలన్నీ కోరం ఉంటేనే నిర్వహిస్తారు. సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైతేనే వీటిని నిర్వహిస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షరమాల ప్రకారం పిలిచి చేతులు ఎత్తే పద్ధతిలో సభ్యులతో ఓట్లు వేయిస్తారు. ఎక్కువ ఓట్లు వచ్చినవారిని ఎన్నికైనట్టుగా ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటిస్తారు. ఒకవేళ బరిలో ఉన్నవారందరికీ సమానమైన ఓట్లు వస్తే లాటరీ పద్దతిలో విజేతను ప్రకటిస్తారు. శనివారం జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలు కూడా ఇదే తరహాలో నిర్వహిస్తారు.

కోఆప్టెడ్‌ పూర్తి కాకపోతే అధ్యక్ష ఎన్నికలు ఉండవు...
ఒకవేళ ఏదైనా కారణంతో కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక పూర్తి కాకపోతే ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరగవు. ఈ విషయాన్ని ఎస్‌ఈసీకి తెలియజేస్తే ఈ ఎన్నికల నిర్వహణకు మరో తేదీని ప్రకటిస్తుంది. కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికకు రాజకీయ పార్టీలు విప్‌ జారీ చేసే అవకాశం లేదు. అయితే కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక పూర్తయి ఎంపీపీ పదవులకు ఎన్నిక జరగకపోతే ఆ మరుసటి రోజే ఆ పదవులకు ఎన్నికలు నిర్వహించవచ్చు. ఒకవేళ ఆ రోజు కూడా ఎన్నిక పూర్తి కాకపోతే మరో తేదీని ఎస్‌ఈసీ ప్రకటిస్తుంది.

స్‌ఈసీ నిర్ణయించిన తేదీన నిర్వహించే ఎన్నికలకు కోరం లేకపోయినా ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవచ్చు. కాగా, తాము నియమించిన విప్‌లను మార్చే అవకాశం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కల్పించారు. అయితే ప్రత్యేక సమావేశానికి ఒకరోజు ముందు ఉదయం 11 గంటలలోపు ప్రిసైడింగ్‌ అధికారులకు ఆ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులను మారుస్తున్నట్టు గతంలో ఇచ్చిన వ్యక్తే మరోసారి లేఖ ఇవ్వాలి. దీనిపై ప్రిసైడింగ్‌ అధికారి సంతృప్తి చెందితే అందుకు అనుమతిస్తారు.  

జులైలోనే బాధ్యతల స్వీకరణ...
పాత పాలక మండళ్ల పదవీకాలం ఇంకా ముగియనందున కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, శుక్రవారం ఎన్నికయ్యే ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, శనివారం ఎన్నికయ్యే జెడ్పీ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్ల పదవీకాలం వచ్చేనెల మొదటివారంలో మొదలు కానుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపీటీసీల పదవీ కాలం జూలై 3 వరకు, జెడ్పీటీసీల పదవీకాలం జులై 4 వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఆయా తేదీల తర్వాతే కొత్త పరిషత్‌ సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆగస్టు 5 తర్వాత ఎంపీపీ, ఆగస్టు 6 తర్వాత కొత్త జెడ్పీ చైర్‌పర్సన్లు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.  

మరిన్ని వార్తలు