నాటికీ.. నేటికీ మారిన ప్రచార తీరు

9 Apr, 2019 19:47 IST|Sakshi

కాలానికి అనుగుణంగా మార్పు

చేతి రాతల నుంచి.. ఆన్‌లైన్‌ వరకు..

రోజురోజుకూ ఖరీదవుతున్న ఎన్నికలు

సాక్షి, వరంగల్‌ రూరల్‌: కాలం మారుతున్నా కొద్దీ ఎన్నికల ప్రచార శైలి మారుతూ వస్తోంది. ఒకప్పుడు చేతిరాతలు.. గోడ రాతలకే పరిమితమైన ప్రచారం.. ఇప్పుడు సోషల్‌ మీడియా రాజ్యం నడుస్తోంది. ఆన్‌లైన్‌లోనే ప్రచారం చేపడుతున్నారు. అంతా ఆన్‌లైన్‌లో రాస్తున్నారు...స్వయంగా మాట్లాడుతున్నారు. కాలం మారుతున్న కొద్ది కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులో వస్తున్నాయి. వాటిని వినియోగించుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో తక్కువ ఖర్చుతో ప్రచారం నిర్వహించగా ఇప్పుడు ఖరీదైపోయింది.

1952–62 మధ్య కాలంలో..
1952లోదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. 1952–62 మధ్య కాలంలో ప్రచారం సాదాసీదాగా ఉండేది. ఆ తరం వారు నాటి ప్రచార తీరు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెబుతుంటారు. ఇప్పుడు వింటే విస్తుపోవడం మన వంతు అవుతోంది. నాడు అభ్యర్థులు చేతి రాతతో ప్రచార పత్రాలు రూపొందించుకొనే వారు. అప్పట్లో చాలా మందికి గొలుసు కట్టు రాతలో ప్రావీణ్యం కలిగి ఉండేది. కార్బన్‌ పేపర్‌ వినియోగించి రాసేవారు. నిరక్ష్యరాసులు ఎక్కువ, కొద్దిపాటి చదువు వచ్చిన వారు గొలుసు కట్టు రాత చదవటం కష్టంగా ఉండేది. దీంతో వీటిని ఓటర్లకు చదివి వినిపించడానికి ప్రత్యేకంగా కొందరిని నియమించుకునే వారు.

1967–78లో..
ప్రింటింగ్‌ ప్రెస్‌లు అందుబాటులోకి వచ్చాయి. కాగితాలపై రాసుకునే ప్రచార పత్రాలు కనుమరుగయ్యాయి. అభ్యర్థులు కరపత్రాల ముద్రణ వైపునకు దృష్టి సారించారు. వీటిని నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేశారు. మరో పక్క ఎన్నికల గుర్తు, పార్టీ పేరు, అభ్యర్థి పేరు, ఫొటోతో ముద్రించిన వాల్‌పోస్టర్లను ఇళ్ల తలుపులపై అంటించేవారు. ఎన్నికల గుర్తులను తలుపు పక్కన గోడపై గుద్దేవారు. అభ్యర్థులు అన్ని ఊళ్లు తిరిగేవారు. గ్రామానికి వెళితే ఓటర్లను కలిసేవారు కాదు. గ్రామ పెద్దలు నలుగురైదుగురిని కలిసి ఎన్నికల వ్యూహరచన చేసేవారు. వారు క్షేత్రస్థాయిలో దానిని అమలు పరిచేవారు. ముఖ్య నాయకులు ఎవరైనా వచ్చి వెళ్లినా ఆ విషయం ఓటర్లకు పెద్దగా తెలిసేది కాదు.

1983–94లో
రాజకీయ చైతన్యానికి నాంది పడింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ప్రముఖ సినీనటుడు నందమూరి తారకరామారావు జనం మధ్యలోకి రావడం ప్రజలకు రాజకీయం అంటే ఏమిటో తెలిసొచ్చింది. ఊరూరా బ్యానర్లు, మైకులతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అభ్యర్థులతో అనుచరగణం రోడ్‌షోలు నిర్వహించేవారు. వారిని చూడటానికి రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులుదీరి నిలబడేవారు. వాల్‌పోస్టర్లు, కరపత్రాల ముద్రణ ఉన్నా మైకుల హోరు ఎక్కువగా ఉండేది. ఎన్నికల నియమావళి గురించి పట్టించుకునే వారు అప్పట్లో చాలా తక్కువ మంది.

1999నుంచి డిజిటల్‌ రాజ్యం
డిజిటల్‌ ఫ్లెక్సీల రాజ్యం మొదలైంది. పార్టీలు పోటాపోటీగా వీటిని ఏర్పాటు చేసేవారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఫోన్‌ లేని జేబుల్ని వెతకడం కష్టంగా ఉండేది. ఇంటింటా ఫోన్‌లు  ఉండడంతో గంపగుత్త సందేశాలు పంపడం సులభంగా మారింది. తమకు ఓటేయాలని గెలిస్తే అది చేస్తాం.. ఇది చేస్తామంటూ రూపొందించిన సందేశాలను పంపేవారు. పోటీలోని అభ్యర్థి నేరుగా ఓటర్లతో మాట్లాడే ప్రయత్నాలకు ఫోన్‌ మాధ్యమంగా నిలిచింది. ఫోన్‌ లేపగానే ‘నేను మీ నియోజవర్గ అభ్యర్థిని...నన్ను గెలిపించాలి’ అని ముందుగానే రికార్డు చేసిన మాటలు వినిపించేవి. గత ఎన్నికల ప్రచారంలో త్రీడీ సాంకేతిక పరిజ్ఞానం ఉరకలేసింది. జనం, కార్యకర్తలు గుమిగూడిన చోట ఉంచి తెరపై అగ్రనేత మాట్లాడే దృశ్యాలను నేరుగా చూపించారు.

కాలం మారింది..
నగరం, పట్టణం, పల్లె ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇప్పుడు సామాజిక మాధ్యమాన్నే విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, టెలిగ్రాం తదితర సైట్లను ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. ప్రచారంలోని ప్రతి పదనిస క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతోంది. మద్దతుదారులు తమ ఫొటోలు, వీడియో పోస్టులతో హల్‌చల్‌ చేస్తుండటం విశేషం. అభ్యర్థులు ప్రచారంలో బిజీబిజీగా ఉండటంతో వారి అనుచరులు 70 శాతం మంది సామాజిక మాధ్యమాలపై ఆధార పడుతున్నారు. ఈ విషయంలో ప్రధాన పార్టీలు ముందంజలో ఉంటున్నాయి.

ఖరీదైన ఎన్నికలు
తొలినాళ్లలో ఖర్చు నామమాత్రంగా ఉండేది. ప్రచార ఆర్భాటం తక్కువ ఉండటంతో ఖర్చు స్వల్పంగా ఉండేది. ఓటర్లు డబ్బులు అడిగే వారు కాదు. తర్వాతి ఎన్నికల నుంచి ఖర్చు పెరగడం ఆనవాయితీగా మారింది. 2004 ఎన్నికల నుంచి పరిస్థితి పూర్తిగా మారింది. ఖర్చు విపరీతంగా లక్షలకు పెరిగింది. ఎన్నికల సంఘం నిర్ధేశించిన పరిమితిని దాటి ఖర్చులు ఉంటున్నాయి. ప్రస్తుతం ఎన్నికల సంఘం నిర్దేశించిన పరిమితికి మించి ఖర్చు ఎన్ని రేట్లు జరుగుతుందనేది ఎవరూ కూడా అంచనా వేయలేకపోతున్నారు. రూ.కోట్లలోనే జరుగుతుంది. ప్రచారం మొదలు ఓటు వేసే దాక ప్రతి చిన్న విషయానికి అభ్యర్థి చేతి చమురు వదులుతోంది. 

మరిన్ని వార్తలు