పంచాయతీ ఎన్నికలు.. ‘సోషల్‌’ పోరు మొదలైంది

19 Jan, 2019 09:35 IST|Sakshi

రసకందాయంలో పంచాయతీ ఎన్నికలు

సోషల్‌ మీడియా వేదికగా అభ్యర్థుల ప్రచారం

గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల బరిలో ఉన్న అభ్యర్థులు వినూత్న ప్రచారానికి తెరలేపారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. కొందరు అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థిస్తుండగా, మరికొందరు వాట్సప్, ఫేస్‌బుక్‌ ద్వారా వారికి కేటాయించిన గుర్తులతో ఫొటోలు ఆపోలోడ్‌ చే స్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. వాట్సప్‌లో ప్రత్యేకంగా గ్రామ సభ్యులతో ఒక గ్రూప్‌ తయారు చేసి ఓట్లు వేయాలని కోరుతున్నారు. సర్పంచ్, వార్డులకు బరిలో ఉన్న అభ్యర్థులు పోటాపోటీగా మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నారు. తాము గెలిస్తే గ్రామంలో చేసే అభివృద్ధి కార్యక్రమాలను సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. గతంలో సర్పంచ్‌ చేసిన పనులు.. తాము గెలిస్తే చేసే అభివృద్ధిని వివరిస్తున్నారు. గ్రామానికి రోడ్లు, భూ ములకు పట్టాలు, పొలాలకు సబంధించిన విత్తనాలు, ఎరువులు, తక్కువ ధరకు ఇప్పించడం. డబుల్‌ బెడ్రూం ఇళ్లు, ఆలయాలు, పాఠశాలల అభివృద్ధి తదితర కార్యక్రమాలు చేపడుతామని హమీలిస్తున్నారు.

గెలుపు వ్యూహాలూ ఇందులోనే...
తమకు అనుకూలంగా ఉన్న ఓ పది మంది కీలక నాయకులతో వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి సర్పంచ్‌ నుంచి వార్డు సభ్యుల గెలుపు వరకు ఇందులోనే చర్చలు జరుపుతున్నారు. వ్యూహాలు రచిస్తున్నారు. అంతే కాకుండా ప్రత్యర్థుల వద్ద అసమ్మతితో ఉన్న నాయకులకు ఈ వాట్సప్‌లో చేర్చి వారి వద్ద సమాచారాన్ని తీసుకుంటున్నారు. దీంతో ప్రత్యర్థులను వాట్సప్‌ వేదికగా చేసుకుని ఎన్నికల్లో ఓడించేందుకు సిద్ధమవుతున్నారు. ఫేస్‌బుక్‌లో అభ్యర్థి ఫోటోలను అప్‌లోడ్‌ చేసి గెలిపించాలని వేడుకుంటూ ప్రచారం చేస్తున్నారు. 

ఓటు  వేయడానికి రావాలని..
గ్రామంలో ఓటు ఉండి వేరేప్రాంతంలో నివసిస్తున్న వారిని ఓటు వేసేందుకు రావాలని, సర్పంచ్, వార్డు సభ్యులుగా బరిలో ఉన్న అభ్యర్థులు కోరుతున్నారు. వేరే ప్రాంతంలో ఉన్న వారికి ఫోన్‌ చేసి ఓటింగ్‌ రోజున గ్రామానికి వచ్చి తమకే ఓటు వేయాలని.. రానుపోను చార్జీలు కూడా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరికొందరు సెల్‌ఫోన్‌ బిల్లులు, విద్యుత్‌ బిల్లు, కులాయి బిల్లు, డిష్‌ బిల్లులు, ఇంటి అద్దె తదితర వాటిని చెల్లిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నయ్యారు.
 

మరిన్ని వార్తలు