9 రోజులే గడువు

27 Nov, 2018 11:59 IST|Sakshi

తారస్థాయికి ఎన్నికల ప్రచారం

అగ్రనేతలు, స్టార్‌ క్యాంపెయినర్లతో హోరెత్తిస్తున్న పార్టీలు  

స్పీడు పెంచిన టీఆర్‌ఎస్‌.. విస్తృతంగా కేసీఆర్‌ సభలు 

రోడ్‌షో.. సభల్లో పాల్గొననున్న రాహుల్‌గాంధీ  

కమలం నేతల షెడ్యూల్‌ ఖరారు 

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  ఎన్నికల ప్రచారానికి తొమ్మిది రోజులే మిగిలి ఉంది. ఎన్నికల నగారా మోగకముందే ప్రచారపర్వానికి గులాబీ పార్టీ శ్రీకారం చుట్టింది. 50 రోజులుగా ఎడతెరిపిలేకుండా ప్రచారాన్ని సాగిస్తున్న ఆ పార్టీ అభ్యర్థులు ప్రతీ ఇంటి గడప తొక్కుతుండగా.. నామినేషన్ల చివరి రోజు వరకు అభ్యర్థుల ఖరారు తేల్చని ప్రజాకూటమి ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి దూకింది.

కౌంట్‌ డౌన్‌ మొదలైంది.
అభ్యర్థుల ఎంపికలో కమలం పార్టీ కూడా జాప్యం చేయడంతో ప్రచారంలో వెనుకబడే ఉంది. అయితే, ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో అగ్రనేతలు, స్టార్‌ క్యాంపెయినర్లతో ఈ మూడు పార్టీలు జిల్లాలో హోరెత్తిస్తున్నాయి. ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ల రాకతో ఈ వారం రోజులు జిల్లాలో ప్రచారపర్వం తారస్థాయికి చేరనుంది. 


టాప్‌ గేరులో కారు
కారు గేరు మార్చింది. ప్రచారంలో స్పీడు పెంచింది. ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తుండడంతో దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మొదటి విడత ప్రచారాన్ని పూర్తిచేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం రెండో విడత ప్రచారానికి వస్తున్నారు. ఆదివారం షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన గులాబీ బాస్‌.. మంగళవారం ఆమనగల్లుకు రానున్నారు.

సెప్టెంబర్‌ 6వ తేదీన అభ్యర్థుల ఖరారు మొదలు.. క్షేత్రస్థాయి ప్రచారంలో తలమునకలైన టీఆర్‌ఎస్‌ పార్టీ తాజాగా వేగం పెంచింది. స్టార్‌ క్యాంపెయినర్లను రంగంలోకి దించింది. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు ఇప్పటికే జిల్లాలో రోడ్‌షో, బహిరంగ సభల్లో పాల్గొన్ని ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు.

రాహుల్‌ రాకతో...
కారుకు దీటుగా కాంగ్రెస్‌ కూడా ప్రచారంలో వేగం పెంచింది. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీలు ఉమ్మడి జిల్లా పరిధిలోని మేడ్చల్‌లో ఎన్నికల శంఖారావం పూరించారు. తాజాగా మరోసారి రాహుల్‌గాంధీ జిల్లా పర్యటన ఖరారైంది. కొడంగల్, తాండూరు, చేవెళ్ల, పరిగి నియోజకవర్గాల్లో ఆయన బహిరంగ సభలు, రోడ్‌షోల్లో పాల్గొననున్నారు. దీంతో కాంగ్రెస్‌ ప్రచారపర్వం తారస్థాయికి చేరనుంది. ఇప్పటికే ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్లు జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు.

మిగతా స్థానాల్లో.. మలివిడత
ఇప్పటివరకు ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మలిదశలో మిగతా నియోజకవర్గాలను కవర్‌ చేయనున్నారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డిలు పోటీచేస్తున్న కొడంగల్, మహేశ్వరంలో తుది విడతప్రచారంలో పాల్గొనేలా షెడ్యూల్‌ను రూపొందిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ తరఫున బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నందున ఈ నియోజకవర్గాలపై గులాబీ నాయకత్వం ప్రత్యేక దృష్టిసారించింది.


కాషాయదళం కూడా.. 
భారతీయ జనతాపార్టీ కూడా ప్రచారంలో జాతీయ నేతలను రంగంలోకి దింపింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మొదలు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌ను ఎన్నికల ప్రచారానికి రప్పిస్తోంది. రాష్ట్రస్థాయిలో ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా చెప్పుకుంటున్న పరిపూర్ణానంద స్వామి జిల్లాతో పలు సభల్లో ప్రసంగించారు. తాండూరు, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఆయన మంగళవారం కల్వకుర్తి సెగ్మెంట్‌లోని తలకొండపల్లిలో జరిగే మహిళా సదస్సుకు హాజరుకానున్నారు.

మరోవైపు డిసెంబర్‌ 2వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆమనగల్లుకు రానున్నారు. అలాగే, మేడ్చల్, ఎల్‌బీనగర్‌లో జరిగే రోడ్‌షోల్లోనూ పాల్గొంటారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ నెలాఖరులో తాండూరులో పర్యటించనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కమలం పార్టీ... మరింత దూసుకెళుతోంది. 

మరిన్ని వార్తలు