ప్రచారం గావాలె.. పైసల్‌ దీయాలె !

18 Nov, 2018 13:00 IST|Sakshi

దునియాల గొప్పోల్లు కావాలంటె.. పని చేసుడొకటే గాదు తమ్మీ.. దాన్ని బాగా ప్రచారం చేసుకోవాలె.  పీఎం అయినా.. సీఎం అయి¯నా సరిగా ప్రచారం లేకుంటె మూల కూర్సునుడే! అరె ఈల్లేందిర బై గాదేవుల్లకే ప్రచారం చేస్కోక తప్పలేదు. గా విస్నుమూర్తి.. చక్రం తిప్పిండని.. గా రాముడు విల్లు విరిసిండని.. గవేవో కతల్‌ కతల్‌గ సెబుతూ.. పురానాలని జనాల్లోకి వదిలిండ్రు. గిది ప్రచారం గాదె. మార్కెట్ల కొత్త సెల్‌పోన్‌ మొదలు పెద్ద పెద్ద కార్ల దాకా అమ్ముడు కావాలంటె గీ ప్రచారం చేస్కోవాల్సిందె. గంతెందుకు ఇండ్లల్ల పంక్షన్లు అయితె.. కొందరు పనిగట్టుకుని జనాల్ని గుంపేసి గంటల్‌ గంటల్‌ తమ గొప్పలు సెబుతుంటారు సూడు.. గది కూడా ప్రచారమె!  

పురాన దినాల్లో పండగెప్పుడొస్తదో గుల్లో పూజార్ని అడిగేటోల్లు.. ఆల్లు గింత పెద్ద పంచాంగం పుస్తకం దీసి ఏ దినమో సెప్పేటోల్లు. గిప్పుడు గట్ల కాదు. స్టైలు మార్సిండ్రు. శివరాత్రి వచ్చిన.. ముక్కోటి ఏకాదసి వచ్చిన గుళ్ల ముందు పెద్ద పెద్ద ప్లెక్సీలు కడ్తుండ్రు. గంతెందుకు ఇండ్లల్లో పెండ్లి చేస్తే పంక్షన్‌ హాల్‌కాడే కాదు, ఆల్లుండె గల్లీ ముందర ప్లెక్సీలు పెడ్తుండ్రు. తెల్సిందా తమ్మీ మనం ఏ పని జేసినం.. జేస్తున్నం గనేది ఎంత ముక్యమో.. గా పని మనమే చేస్తున్నమని ప్రచారం చేసుడు కూడా!  

గంత ముక్యం! 
    తమ్మీ గిప్పుడీ ఎలచ్చన్ల కూడా గింతె! రోజూ ప్రచారం అంటె ఆసామాసీ గాదె. గల్లి గల్లీలోని ఇండ్లకెల్లాలె.. రోడ్లపై తిరగాలె.. ఎప్పుడు ముకాలు సూడని కొత్తోల్లని బట్కుని అన్న.. తమ్మీ.. అక్క.. అమ్మా గెట్లున్నావె.. గంతా బాగేనే అని నవ్వుతూ ఓట్లు అడగాలె (అడుక్కోవాలె). మరి కాండేటే గివన్నీ సెయ్యాలంటె యాడవుతది? మస్తు జనాలు కావాలె. ఆల్లు మాత్రం యాడికెల్లి ఒస్తరు. ఎవరి పని వాల్లకుంటది. గా పన్లన్ని వదిలేస్కుని గీ కాండేట్ల ఎన్క తిరగితే.. ఇగ బతుకు బాగు పడినట్లె! జెండా పట్టాలె.. జై కొట్టాలె.. దినం.. దినమంత గీల్ల ఎంట ఉండాలె. ఒక్కమాటలో సెప్పాలంటె పెండ్లి చేసుడెంత కస్టమో.. గీ ప్రచారం గంతె కస్టం. ఇల్లు గట్టి సూడు.. పెల్లి జేసి సూడు.. అన్నారు గానీ.. ఎలచ్చన్ల ప్రచారం చేసి సూడు అని గూడ చెప్పాలె.. 

    గీ పరేసాని తీరుడెట్లని కాండేట్లు ఓ పక్కన బుర్ర కరాబ్‌ చేస్కుంటుండ్రా.. గీల్లని సూసి’ అరె సాబ్‌ బేపికర్‌గ ఉండుండ్రి. మేం ఉన్నం గాదె అంటూ ముఠామేస్త్రిలు తయారయిండ్రు! ఈల్లు కొత్తగ ప్రచార దుకానం తెరిసింండ్రంట! రోజూ బిల్డింగ్‌ల పనికెల్లే కూలీలు గిప్పుడా పని బంద్‌ పెట్టి ప్రచారాల కెలుతుండ్రు! గదైనా గిదైనా పొద్దెక్కెంగానె కూలీ తీసుడు లెక్కే గాదె అనుకుంటుండ్రంట! అడ్డాల్లో కూలీలు ప్రతిరోజూ ఒకే తాన పనికెల్లరు కద. గిది కూడా గట్లనే జేస్తె కాండేటు కొంప కూలుడే!

ఇయ్యాల కాంగిరేసు అబ్యర్తికి జై కొట్టి...రేపు కారు పార్టీకి జై కొట్టాలంటె గెట్లా...ఆల్లు పొరపాట్న కారు బదులు చెయ్యంటె గా కాండేటు ఏ కాల్వలో దుంకాలె? గందుకే మన ముఠామేస్త్రీలు గీ గడబిడ లేకుండా ఎవ్రు ఏ పార్టీకి జై కొడ్తుంటారో.. గీ ఎలచ్చన్లు ముగిసేదాకా ఆల్ల కాడనే కొలువు పెడ్తారంట! కూలోల్లు కూడా గిదేందో బాగుంది.. డబ్బిస్తరు.. బిరియానీ పెడ్తరు.. రాత్రికి మందు పోస్తరు. ఈ నెల్నాల్లన్న కూలీకెల్లి గా బండ పని చేసుడు తప్పుతది గంతె సాలు అనుకుంటుండ్రంట!

జెండాలు పట్టే జనాలు తక్కువైండ్రని కర్నాటక.. మహారాష్ట్ర నుంచి కూడా తోలుకొస్తుండ్రంట! గెలుసుడు.. సోలుడు మాటేందో గానీ కూలీలు జరంత కుసీగా కనిపిస్తుండ్రు. నెలరోజులు జై కొట్టిండ్రు మరి ఓటెయ్యాలె అంటే మాత్రం.. బిడ్డా గిది గిదే...గది గదే అంటుండ్రంట! గంతే గద. యాడ నొక్కాలో గాదు.. యాడ తొక్కాలో తెల్సినోడే ఓటరు. అరె డైలాగ్‌ మంచిగచ్చిందె.. తమ్మీ..రాస్కో! -రాయదుర్గం మధుసూదన్‌ రావు
 

మరిన్ని వార్తలు