ప్రచారాలకు టైమూ..పాడూ ఉంటుంది

20 Nov, 2018 09:18 IST|Sakshi

సాక్షి, కాజీపేట: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలకు లోబడే ప్రచారం చేసుకోవాలని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు, రాజకీయ పార్టీల నాయకులకు యంత్రాంగం ఇప్పటికే అవగాహన కల్పించింది.  ఉదయం ఆరు గంటల తర్వాతే లౌడ్‌స్పీకర్లతో ప్రచారం మొదలుపెట్టి రాత్రి 10 గంటల కల్లా ముగించాల్సి ఉంటుంది. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత బహిరంగసభలు నిర్వహిస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లు భావించి చర్యలు తీసుకుంటారు. 

బహిరంగసభల సందర్భంగా...
బహిరంగ సభ ఏర్పాటుచేసే ప్రదేశం తేది, సమయాన్ని ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. రాత పూర్వకంగా అనుమతి తీసుకోవాలి. అలాంటప్పుడు పోలీసులే ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ ఏర్పాట్లను పరిశీలించే అవకాశం ఉంటుంది. సభ ఏర్పాటుచేసే ప్రదేశం ప్రభుత్వ ఆస్తులు, దేవాలయాలు  ఆవరణలకు సంబంధించి ఉండకూడదు. ప్రైవేట్‌ ఆస్తులైతే సంబంధిత స్థలం యజమాని నుంచి లిఖిత పూర్వక అనుమతులు తీసుకోవాలి.

ఊరేగింపుల్లో... 
ప్రతి అభ్యర్థి తమ ఊరేగింపు ఆరంభం అయ్యే సమయం, సాగే రూట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ప్రదేశాలు, ముగింపు సమయం ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఊరేగింపు సాగే మార్గంలో, సమావేశాలు నిర్వహించే ప్రదేశాల్లో ఆంక్షలు లేవని పోలీసు అధికారుల నుంచి నిర్ధారించుకోవాలి. అభ్యంతరాలు ఉంటే మార్గం మార్చుకోవాలి. ఊరేగింపుల్లో అందరూ పోలీసులు సూచించిన రీతిలో రోడ్డుకు ఒక పక్కన సాగుతూ క్రమశిక్షణతో మెలగాలి.  

మరిన్ని వార్తలు