ఎన్నికల సిత్రాలు...

20 Nov, 2018 13:12 IST|Sakshi

సంపద పెంచుతాం

టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్దిని చూసి కారు గుర్తుకు మరోసారి ఓటు వేయాలని దేవరకద్ర టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆల వెంకటేశ్వరెడ్డి సతీమణి మంజుల కోరారు. మండల పరిదిలోని లాల్‌కోట గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓటర్లను కలుస్తూ ముందుకు సాగిన కుర్మ, యాదవుల ఇంట్లో గొర్రె పిల్లలు కనిపించగా ఇలా కాసేపు ఎత్తుకున్నారు. 
– చిన్నచింతకుంట 

పచారి కొట్టు.. ఓట్లు పట్టు

గద్వాల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సోమవారం పట్టణంలోని 15, 18వ వార్డుల్లో రాష్ట్ర జల వనరుల శాఖ చైర్మన్‌ వి.ప్రకాశ్‌తో కలిసి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కుంటవీధిలోని ఓ కొట్టులో వస్తువులు అమ్ముతూ దుకాణానికి వచ్చే వారితో మాట్లాడారు. ఈసారి కారు గుర్తుకు ఓట్లు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అయిన తనను గెలిపించాలని కోరారు. 
– గద్వాల అర్బన్‌  

పతి కోసం సతి

ఆయన గెలుపుకోసం ఆమె ఎంతో కష్టపడుతోంది! నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి భార్య స్వాతిరెడ్డి నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సోమవారం పట్టణంలోని 7వ వార్డులో పర్యటించి కరపత్రాలు, కారు గుర్తును చూపిస్తూ ప్రచారం చేశారు. మరోసారి ఎస్‌.ఆర్‌.రెడ్డిని గెలిపించాలని కోరారు. 
– నారాయణపేట రూరల్‌ 

‘తీపి’ రుచి చూడండి..చూపించండి

ఉమామహేశ్వర క్షేత్రంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గువ్వల బాలరాజు–అమల దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అచ్చంపేటలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాల వద్ద వ్యాపారులను కలిసి రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా స్వీట్లు కొనుగోలు చేసిన అమల మహిళలకు ఇలా తినిపించి.. తమకు కూడా మరోమారు విజయం ‘తీపి’రుచి చూపించాలని కోరారు.                  – అచ్చంపేట రూరల్‌  

చాయ్‌ పోస్తా..ఓట్లు పడతా

ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులు ప్రతీ అంశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం మండల పరిధిలోని చిన్నపాడులో డీకే.అరుణ కుమార్తె స్నిగ్దారెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా టీ పాయింట్‌ వద్ద ప్రజలకు చాయ్‌ పోసి అందిస్తూ ఆకట్టుకున్నారు.  
– ధరూరు 

మరిన్ని వార్తలు