సామాజిక వర్గాలపై కొండంత ఆశ !

24 Nov, 2018 08:24 IST|Sakshi

 ప్రతి ఓటరును కలిసేందుకు నాయకుల వ్యూహం 

 గ్రామాలు, పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటర్ల విభజన 

 ఇతర పార్టీల మద్దతుదారులను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం  

సాక్షి, హుజూర్‌నగర్‌ : ఎన్నికల సమరం దగ్గర పడుతుడటంతో ప్రచారంలో నిమగ్నమైన ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును  పెడుతున్నారు. సభలు, సమావేశాలు, చేరికలతో పాటు తెర వెనుక వ్యూహాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు బయట ఎన్నికల ప్రచారం చేస్తున్న అభ్యర్థులు, ఆశావహులు రాత్రివేళల్లో ముఖ్యమైన  నా యకులతో కలిసి ఓటర్లకు ఏ విధంగా చేరువ కావాలనే విషయమై వ్యూహరచన చేస్తున్నారు. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసే విధంగా తమ ప్రచారశైలిని రూపొందించుకుంటున్నారు. తెరమీద సాగుతున్న ప్రచారం కంటే బూత్‌స్థాయిలో తెర వెనుక సాగే మంత్రాంగమే తమ విజయానికి సోపానమవుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ ఓటరు జాబితాలోని ఓటర్లను సామాజిక వర్గాలుగా విభజించి వారిని వ్యక్తిగతంగా కలిసేలా వ్యూహరచన చేస్తున్నారు. ప్రచారానికి ముందే పట్టణాలు, గ్రామాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఓటరు జాబితాను వడ పోస్తున్నారు. కులాలు, మతాలు, యువతీ యువకులు, ఉద్యోగులు, మహిళలను వర్గాలుగా విభజించి విశ్లేషిస్తున్నారు. ఎక్కువ ఓటర్లను ప్రభావితం చేసే గ్రామ ముఖ్య నాయకులపై అభ్యర్థులు దృష్టి సారిస్తున్నారు.

స్థానికంగా ఓటరు జాబితాలో నమోదై ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్ల సమాచారం తీసుకునే పనిలో మరికొందరు నిమగ్నమయ్యారు. తెరవెనుక ఇలాంటి పనులు నిర్వహించేందుకు చురుకైన యువకులను వినియోగించుకుంటున్నారు. క్రియాశీలకంగా వ్యవహరించే యువకులను బృందాలుగా విభజించి ఈ పనులు అప్పగిస్తున్నారు. ఒక్కొక్క గ్రామంలో తమకు అనుకూలంగా ఎవరెవరు ఉంటారు, వ్యతిరేకంగా ఎవరెవరు ఉంటారనేది స్థానిక నాయకులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. తమకు మద్దతు ఇచ్చే ఓటర్లు ప్రత్యర్థి పార్టీవైపు జారిపోకుండా కాపాడుకుంటూనే ప్రతిపక్ష పార్టీల ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా పథకాలు రచిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా వ్యవహరించే ఓటర్లు ఎవరి మాట వింటారనేది గుర్తించి వారి సహాయం  కోరుతూ ముందుకు వెళుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో ఇప్పటికే పార్టీల వారీగా విడిపోయిన క్రమంలో ప్రతి ఓటరును కలిసేందుకే అభ్యర్థులు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రచార సమయంలో ఎవరైనా ముఖ్య నేతలు కలవకపోతే ఉదయం, రాత్రి వేళనో వారి  ఇంటికి వెళ్లి ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. 
మహిళలు, యువతపై దృష్టి .... 
ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, మహిళలు, యు వకులపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. గ్రామాలకు ఎన్నికల ప్రచారానికి వెళ్లే అభ్యర్థులు సామాజిక వర్గాలతో పాటు మహిళలు, యువకుల ఓట్లను ఏ విధంగా రాబట్టుకోగలుగుతామనేది ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటున్నారు. యువజన, మహిళ సంఘాల బాధ్యులతో మాట్లాడి ఈఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. యు వకులు, మహిళలను తమ ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నం చేస్తున్నారు.  

సమస్యల ఏకరువు ...
గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లే అభ్యర్థులకు ప్రజల నుంచి పలు సమస్యలపై ఏకరువు పెడుతున్నారు. ఈ సమయంలో వారిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వారి డిమాండ్లకు తలొగ్గుతున్నారు. తమ కాలనీల్లోని సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం కొందరు చేస్తుంటే మరికొందరు వివిధ అభివృద్ధి పనులను కోరుకుంటున్నారు. తాము చెప్పిన పనులు చేస్తేనే ఎన్నికల్లో మీకు మద్దతు ఇస్తామని ప్రజలు çస్పష్టం చేస్తున్నారు.  ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు రేయింబవళ్లు వ్యూహ ప్రతివ్యూహాలలో నిమగ్నమై ముందుకు వెళుతున్నారు.   

మరిన్ని వార్తలు