ఎన్నికల కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం

12 Dec, 2014 02:15 IST|Sakshi

- ఒక్క శాతం కేసులు రుజువైనా 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై వేటు
- సుపరిపాలన వేదిక అధ్యక్షుడు జస్టిస్ రెడ్డప్ప రెడ్డి

సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారనే ఆరోపణలపై నమోదైన కేసుల్లో ఒక్క శాతం కేసులు రుజువైనా సుమారు 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అనర్హతకు గురవుతారని సుపరిపాలన వేదిక అధ్యక్షుడు జస్టిస్ రెడ్డప్పరెడ్డి పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన 9,867 కేసుల్లో ఒక్క కేసూ విచారణ పూర్తికాలేదన్నారు.

ఎన్నికల కేసుల దర్యాప్తు విషయంలో పోలీసు శాఖ, కేంద్ర ఎన్నికల సంఘం  ఉదాసీనతంగా వ్యవహరిస్తున్నాయన్నారు. వేదిక ఉపాధ్యక్షుడు డాక్టర్ రావు చెలికాని, కార్యదర్శి రిటైర్డు ఐఎఫ్‌ఎస్ అధికారి ఎం.పద్మనాభరెడ్డితో కలిసి జస్టిస్ రెడ్డప్పరెడ్డి గురువారం తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం రూ.36 కోట్లకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని 1,916 కేసులను నమోదు చేశారన్నారు.

బంగారు ఆభరణాలు, ఇతర వస్తువుల పంపిణీ ఆరోపణలపై 398 కేసులు, మద్యం పంపిణీ ఆరోపణలపై 4,974 కేసులు పెట్టారని తెలిపారు. ఆ తర్వాత కేసుల దర్యాప్తును పోలీసు శాఖ విస్మరించిందన్నారు. ఎన్నికల్లో పట్టుబడిన నగదును పోలీసులు ఆదాయ పన్నుల శాఖకు అప్పగించి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు