నిబంధనలు ఉల్లంఘీస్తే 1950 టోల్‌ ఫ్రీకి డయల్‌ చేయండి

7 Jan, 2020 09:27 IST|Sakshi

సాక్షి, మంచిర్యాలటౌన్‌(అదిలాబాద్‌): మున్సిపాలిటీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు మున్సిపాలిటీల్లో డేగకళ్లు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఎన్నికల ప్రకటన వెలువడిన రోజు నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రభుత్వం, ఎన్నికల విధుల్లో ఉండే అధికార యంత్రాంగం, సిబ్బంది ప్రవర్తనా నియమావళి అనుసరించాల్సిందే. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే ప్రజలు 1950 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. 

నిబంధనలు..

  • రాజకీయ పార్టీ, పోటీ చేసే అభ్యర్థి ఉద్రిక్త పరిస్థితులను పెంచేందుకు ప్రయత్నించడం, విద్వేషాలను రెచ్చగొట్టడం, కుల, మత, వర్గ, ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమాల్లో పాలుపంచుకోవద్దు.
  • జాతి, మతం, కులం పేరుతో ఓట్లు అడగొద్దు.
  • ఎన్నికల ప్రచారానికి ప్రార్థనా మందిరాలైన దేవాలయాలు, మసీదులు, చర్చిలను వేదికలు చేసుకోవద్దు.
  • పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రజా జీవితానికి సంబంధించిన అంశాలు కాకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయవద్దు.
  • విపక్ష పార్టీల అభ్యర్థుల నివాసాల వద్ద వారి అభిప్రాయాలు, కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయొద్దు.
  • ప్రభుత్వ, ప్రైవేటు అధికారులు, ఇంటి యజమానుల నుంచి రాతపూర్వకంగా ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహించవద్దు. జెండాలు, వాల్‌పోస్టర్లు అతికించడం, ప్రచార రాతలు రాయడం చేయవద్దు.
  • ప్రింటింగ్‌ ప్రెస్‌ పేరు, చిరునామా లేకుండా పో స్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు ముద్రించకూడదు.


నిబంధనల మేరకు ఖర్చు చేయాలి..

  • మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చును బ్యాంకు ఖాతా ద్వారానే చెల్లించాల్సి ఉంది. దీంతో ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు బ్యాంకుల్లో కొత్తగా ఖాతాలను తెరవాల్సి ఉంది.
  • మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల్లో రూ. 1 లక్ష వరకు మాత్రమే ఖర్చు చేసేందుకు అనుమతి ఉంది.
  • ప్రచారం సందర్భంగా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఖర్చు చేయాలి.
  • రిటర్నింగ్‌ అధికారి అభ్యర్థికి అందించిన నిర్ధిష్ట నమూనాలో రోజువారీ ఖర్చుల వివరాలు రాయాలి. ప్రత్యేక ఖాతా తెరిచి అందులో నుంచి డబ్బులను విత్‌డ్రా చేయాలి.
  • ఎన్నికల ఫలితాలు వెలువడిన 45 రోజుల్లో వివరాలు విధిగా ఎన్నికల అధికారికి అందజేయాలి.


ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్త..

  • ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలి. ఏ పార్టీకి గానీ, వ్యక్తులకు గానీ అనుకూలంగా లేక వ్యతిరేకంగా పనిచేయొద్దు.
  • ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు.
  • ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రైవేటు కార్యక్రమాల్లో, విందుల్లో పాల్గొనవద్దు.
  • ప్రభుత్వ ధనాన్ని సభలు, సమావేశాలకు వి నియోగించకూడదు. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, వాహనాలను వినియోగించవద్దు.
మరిన్ని వార్తలు