సచివాలయంలో కోడ్ ఉల్లంఘన

17 Mar, 2014 01:49 IST|Sakshi

 డీ బ్లాక్‌లో కిరణ్ ఫ్లెక్సీ
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలోనే యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడి పది రోజులు కావస్తున్నా ఇంకా సచివాలయంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీ దర్శనమిస్తోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ప్రత్యేకించి అన్ని శాఖలకు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, మంత్రులు, నేతల ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, వాహనాల నుంచి తొలగించాలని ఆదేశించారు. అయినా సచివాలయంలో అధికారులు అమలు చేయలేదు. డీ బ్లాక్‌లోకి ప్రవేశించగానే కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీ దర్శనమిస్తోంది.
 
  ఆర్థికశాఖ వెబ్‌సైట్‌లో ఆ శాఖ మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఫొటోలతోపాటు గతంలో ఆర్థికశాఖలో పనిచేసిన ఐఏఎస్ అధికారుల ఫొటోలు కూడా దర్శనమిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో మాజీ సీఎం, మాజీ మంత్రుల ఫొటోలతో కూడిన ప్రభుత్వ క్యాలెండర్లు దర్శనమిస్తున్నాయి. 2009 ఎన్నికలప్పుడు నాటి సీఈఓ ఐవీ సుబ్బారావు.. ప్రభుత్వ క్యాలెండర్‌పై అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో కనిపించకుండా తెల్లకాగితంతో కవర్ చేశారు. ఇప్పుడు మాత్రం మాజీ సీఎం, మాజీ మంత్రుల ఫొటోలతో కూడిన క్యాలెండర్లు యథాతథంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు