నిబంధనలు వర్తిస్తాయ్‌!

12 Mar, 2019 10:53 IST|Sakshi

అమల్లోకి ఎలక్షన్‌ కోడ్‌ పోలీసుల తనిఖీలు ప్రారంభం   

నగదు రూ.లక్ష దాటితే లెక్క చెప్పాల్సిందే..  

అభ్యర్థులూ ప్రచారంలో జాగ్రత్తలు అవసరం  

నియమావళి ఉల్లంఘిస్తే చిక్కులు తప్పవు  

నూతన ప్రాజెక్టులకూ బ్రేక్‌   

సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధమైంది. గ్రేటర్‌లో ప్రచారానికి తెరలేవనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడంతో... అప్పటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాల అభ్యర్థులు ప్రచార నిర్వహణలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరముందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కు పాల్పడితే చిక్కులు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అక్రమ నగదు రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. రూ.లక్షకు మించి నగదు తీసుకెళ్తే లెక్కలు అడుగుతారు. సరైన పత్రాలు చూపించని పక్షంలో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకొని ఆదాయ పన్ను(ఐటీ) శాఖ అధికారులకు అప్పగిస్తారు. ఇలాంటి సందర్భాల్లోసామాన్యులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సీజన్‌ ముగిసే వరకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లకపోవడమే ఉత్తమమని పోలీసులు చెబుతున్నారు. తనిఖీల్లో రూ.లక్ష, ఆలోపు నగదు లభిస్తే పోలీసులు ఎలాంటి అభ్యంతరం చెప్పరు. అయితే అంతకుమించి దొరికితే మాత్రం లెక్కలు చెప్పాల్సిందే. ఆ మొత్తానికి తగిన ఆధారాలు చూపించకపోతే నగదును ఐటీకి అందజేస్తారు. ఎవరి దగ్గరైనా అనుమానాస్పద స్థితిలో రూ.లక్ష లభించినా స్వాధీనం చేసుకుంటారు. ఐటీ అధికారులు పూర్తి విచారణ జరిపి సంతృప్తి చెందితేనే ఆ మొత్తంపై పన్ను, జరిమానా కట్టించుకొని మిగిలినవి తిరిగి ఇస్తారు.   

ప్రత్యామ్నాయ మార్గాలనేకం...  
ఇటీవల కాలంలో నగదు తరలింపునకు ప్రత్యామ్నాయ మార్గాలు అనేకం అందుబాటులోకి వచ్చాయి. నోట్ల రద్దు తర్వాత వీటి సంఖ్య మరింత పెరిగింది. చెక్కులు జారీ చేసే అవకాశమూ ఉంది. అయితే దీని ద్వారా నగదు తమ ఎదుటి వారి ఖాతాలో జమ కావడానికి సమయం పడుతుందని భావిస్తే, బ్యాంకుల నుంచి డిమాండ్‌ డ్రాఫ్ట్‌ (డీడీ)లు తీసుకోవచ్చు. ఇది ఖర్చుతో కూడుకున్నదని అనుకుంటే ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్, ఆర్టీజీఎస్, నిఫ్ట్‌ తదితర అందుబాటులో ఉన్నాయి. వీటికయ్యే ఖర్చు కేవలం నామమాత్రమే. తప్పనిసరి పరిస్థితుల్లో నగదు తీసుకెళ్లాల్సి వస్తే బ్యాంకు స్టేట్‌మెంట్, డ్రా చేయడానికి ఉపకరించిన పత్రాలు తదితర వెంట ఉంచుకోవాలి. రూ.10లక్షలకు మించి తీసుకెళ్లే పరిస్థితుల్లో బ్యాంకు అధికారులకు విషయం చెప్పి, వారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజుల ముందే డ్రా చేసిన డబ్బును ఇప్పుడు తీసుకెళ్తే బ్యాంక్‌ పాస్‌బుక్, స్టేట్‌మెంట్‌ దగ్గర ఉంచుకోవాలి. 

ఎన్నికల లింకుంటే చిక్కులే...  
ఒకప్పుడు భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేసినా ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. అయితే నోట్ల రద్దు తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అప్పట్లో కేంద్రం నగదు లావాదేవీల్లో పాదర్శకత పెంచడానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఆన్‌లైన్‌ లావాదేవీలను ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం గరిష్టంగా రూ.2లక్షలకు మించి నగదు లావాదేవీలు చేయకూడదు. అలా చేస్తే పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు సాధారణంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న అనుమానాస్పద సొమ్మును ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తారు. ఇందులో ఎన్నికలకు లింకు ఉన్నట్లయితే మరో కేసు కూడా నమోదు చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్న రూ.59 లక్షలు తెలుగుదేశం పార్టీకి చెందినవని ఆధారాలు లభించాయి. దీంతో సుల్తాన్‌బజార్‌ ఠాణాలో కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఇలాంటి మరికొన్ని కేసులు నమోదయ్యాయి. అనుమానాస్పదంగా ఉన్న నగదును స్వాధీనం చేసుకునే అధికారం క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని 102 సెక్షన్‌ ప్రకారం పోలీసులకు ఉంది. అదే ఆదాయపు పన్ను శాఖ అధికారులైతే ఇన్‌కమ్‌ట్యాక్స్‌ యాక్ట్‌లోని 132 సెక్షన్‌ కింద స్వాధీనం చేసుకుంటారు. ఆపై సదరు అనుమానితుడు ఆ సొమ్ముకు లెక్క చూపిస్తే తిరిగి అప్పగిస్తారు.

మరో నెల ఆగాల్సిందే... 
ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి రావడంతో గ్రేటర్‌పరిధిలో చేపట్టాల్సిన నూతన అభివృద్ధిప్రాజెక్టులను మరో నెల రోజుల పాటునిలిపి వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే పురోగతిలో ఉన్న పనులకు కోడ్‌ వర్తించనప్పటికీ కొత్త ప్రాజెక్టులకు తాత్కాలిక బ్రేక్‌ పడనుంది. ప్రధానంగా ఎస్‌ఆర్‌డీపీ పథకం కింద ఇప్పటివరకు టెండర్లు పిలవనిపనులతో పాటు మూసీ సుందరీకరణ,కేశవాపూర్‌ భారీ స్టోరేజీ రిజర్వాయర్‌ నిర్మాణం తదితర పనులు తాత్కాలికంగానిలిచిపోనున్నాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాతే ప్రభుత్వం, సర్కారువిభాగాలు గ్రేటర్‌ అభివృద్ధి అజెండాపై దృష్టిసారించనున్నాయి. ప్రధానంగా ఆయాపథకాలకు నిధులలేమి శాపంగామారడంతో సమీకరణకు ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్, హడ్కో తదితర ఆర్థిక సంస్థల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉంది.  

ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని ముఖ్యాంశాలివీ...  
వివిధ కులాలు, మతాలు, భాషలు మాట్లాడే వారి మధ్య చిచ్చుపెట్టే విధంగా ప్రసంగాలు చేయొద్దు. విద్వేషాలు రెచ్చగొట్టొద్దు.  
విపక్షాలపై విమర్శలు చేసే సమయంలో వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాల జోలికి వెళ్లొద్దు. నిరాధార ఆరోపణలు చేయకూడదు. ఆయా పార్టీల విధానాలు, కార్యక్రమాలపైనే విమర్శలు చేయాలి.
మసీదులు, చర్చిలు, దేవాలయాలు, పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం నిషేధం. విభిన్న వర్గాల ఓట్లను గంప గుత్తగా పొందేందుకు ఆయా ప్రదేశాల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించరాదు. వారి మనోభావాలను దెబ్బతీయకూడదు.
ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, వంచనకు గురిచేయడం చేయకూడదు.  
ఎన్నికల రోజుకు 48 గంటల ముందుగానే ప్రచారం ముగించాలి. పోలింగ్‌ బూత్‌కు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం చేయొద్దు.  
నివాస సముదాయాల మధ్య ప్రచారం నిర్వహించే సమయంలో భారీ ప్రదర్శనలు, పికెటింగ్‌లు నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదు.  
వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల ప్రచారం కోసం అనుమతి లేనిదే బయటి వ్యక్తుల భూములు, భవనాలు, కాంపౌండ్‌వాల్స్, గోడలను వినియోగించరాదు.  
బ్యానర్లు, నోటీసులు, పోస్టర్లు, వాల్‌రైటింగ్స్‌ చేయకూడాదు. కటౌట్లు ఏర్పాటు చేయొద్దు.  
ఇతర పార్టీల ప్రచారపర్వాన్ని, బహిరంగ సభలను భంగపరిచే చర్యలకు దిగొద్దు. వారి ర్యాలీలను భగ్నం చేసేందుకు ప్రయత్నించొద్దు. ప్రత్యర్థుల మీటింగ్‌లోకి ప్రవేశించి అనుచిత ప్రసంగాలు చేయడం, వారికి వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ చేయొద్దు.  
ఇతర పార్టీల పోస్టర్లను తొలగించేందుకు ప్రయత్నించొద్దు.   
బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణకు ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. ట్రాఫిక్‌ నియంత్రణకు, శాంతియుత వాతావరణం నెలకొనేందుకు సహకరించాలి.  
నిషేదిత ప్రాంతాల్లో సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించొద్దు.   
లౌడ్‌స్పీకర్ల వినియోగానికి విధిగా పోలీసుల అనుమతి తీసుకోవాలి.
తమ పార్టీ సభలను డిస్టర్బ్‌ చేసే వారిపై దాడి చేయరాదు. పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
ముందుగా అనుమతి తీసుకున్న ప్రకారం పోలీసులు చూపిన మార్గంలోనే ర్యాలీలు నిర్వహించాలి. మధ్యలో రూటు మార్చడానికి వీల్లేదు.   
ర్యాలీ జరిగే మార్గంలో నిషేధిత ప్రాంతాలుంటే ఆయా ప్రాంతాల్లో పోలీసులు ఇచ్చిన సూచనల మేరకే ర్యాలీలు నిర్వహించాలి.
ర్యాలీలు నిర్వహించే మార్గంలో ట్రాఫిక్‌కు, జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి. జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయ్యేలా ర్యాలీ నిర్వహించకుండా ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి.
ర్యాలీలను రోడ్డుకు ఒకవైపు మాత్రమే నిర్వహించాలి. మిగతా రహదారి వాహనాలు, జనం రాకపోకలకు అనువుగా ఉండాలి.
ఒకే రోజు ఒకే సమయంలో ఒకే మార్గంలో ర్యాలీలను వివిధ పార్టీలు నిర్వహించకూడదు. ఈ విషయంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా పోలీసులు సూచించినట్లు నడుచుకోవాలి.
ర్యాలీలు నిర్వహించే సమయంలో మారణాయుధాలు, ఇతర అభ్యంతరకర వస్తువులు లేకుండా చూసుకోవాలి.
ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ప్రత్యర్థి పార్టీలు, నేతల దిష్టిబొమ్మల దహనం లాంటి కార్యక్రమాలు చేయకూడదు.   

మరిన్ని వార్తలు