కలెక్టర్‌కు ఈసీ పిలుపు

2 Apr, 2019 12:46 IST|Sakshi

హుటాహుటిన తరలివెళ్లిన రిటర్నింగ్‌ అధికారి 

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం! 

నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం ప్రత్యేక పరిస్థితులపై చర్చ 

ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించిన జేసీ

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం రామ్మోహన్‌ రావుకు ఎన్నికల సంఘం నుంచి పిలుపందింది. ఉన్నఫలంగా హైదరాబాద్‌ రావాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో జిల్లా కలెక్టర్‌ సోమవారం సాయంత్రం హుటాహుటిన హైదరాబాద్‌ తరలివెళ్లారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు సోమవారం హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌కు ఈ పిలుపు అందినట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టర్‌ను పిలుపందినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

నిజామాబాద్‌ కలెక్టర్‌తో పాటు, జగిత్యాల జిల్లా కలెక్టర్‌ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్‌ హైదరాబాద్‌ వెళ్తూ సమీక్ష సమావేశాల నిర్వహణను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం వెంకటేశ్వర్లకు అప్పగించారు. కాగా తమ సమస్యను జాతీయ స్థాయిలో నిరసన తెలిపేందుకు పసుపు, ఎర్రజొన్న రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో అభ్యర్థుల సంఖ్య అనూహ్యంగా 185 చేరిన విషయం విధితమే. ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలింగ్‌ను బ్యాలెట్‌ ద్వారా నిర్వహించాలా? ఈవీఎంల ద్వారా నిర్వహించాలా అనేదానిపై ఎన్నికల సంఘం ఇటీవలే స్పష్టత ఇచ్చింది. ఎం–3 ఈవీఎంలతో పోలింగ్‌ జరపాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది.

 చెకింగ్‌కు సమాయత్తం.. 
అభ్యర్థుల సంఖ్య 185 చేరడంతో ఈ పార్లమెంట్‌ స్థానానికి 26,820 బ్యాలెట్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఈసీ ఆదేశించింది. అలాగే 2,240 కంట్రోల్‌ యూనిట్లు, 2,600 వీవీపీఏటిలను అందించాలని ఎన్నికల సంఘం ఈసీఐఎల్‌ను ఆదేశించింది. త్వరలోనే ఈ పరికరాలన్నీ జిల్లాకు చేరనున్నాయి. వీటి పనితీరును పరిశీలించాల్సి ఉంటుంది. వీటి పరిశీలన, పోలింగ్‌ నిర్వహణకు 600 మంది ఇంజనీర్‌లు కావాలని ఎన్నికల సం ఘం గుర్తించింది. ఈ ఈవీఎంల ఫస్ట్‌లెవల్‌ చెకింగ్, ర్యాండమ్‌ చెకింగ్‌ వంటి ప్రక్రియలు నిర్వహించాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ప్ర త్యేక ఇంజనీర్లు జిల్లాకు రానున్నారు.

ఈ మేరకు పరిశీలనకు ఏర్పాట్లు సిద్ధంగా ఉం డాలని జిల్లా అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు. ఆయా రెవెన్యూడివిజన్ల పరిధిలో పోలింగ్‌ కేంద్రాలను మరోమారు పరిశీలించి రెండు రోజుల్లో నివేదిక అందజేయాలని సహాయ రిటర్నింగ్‌ అధికారుల ను జేసీ ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జరిగిన సమీక్ష సమావేశంలో నిజామాబాద్‌ నగర పాలక సంస్థ కమిషనర్‌ జాన్‌శాంసన్, ఆర్మూర్, నిజామాబాద్‌ ఆర్డీవో లు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ట్రాన్స్‌పోర్టు డిప్యూటీ కమిషనర్‌ డి.వెంకటేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌ మహమ్మద్‌ ముర్తుజా, జిల్లా ఉన్నతాదికారులు చతుర్వేది, స్రవంతి, ఉదయ్‌ప్రకాష్, రాజారాం తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లపై దృష్టి..

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. బ్యాలెట్‌ ద్వారానే పోలింగ్‌ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం వెంకటేశ్వర్లు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష జరిపారు.  తన చాంబర్‌లో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులతో సమావేశమయ్యారు. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి ఇప్పటికే మొదటి దశలో శిక్షణ ఇచ్చారు. తాజాగా రెండో దశ శిక్షణ తరగతులను నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు.

పోలింగ్‌ అధికారులు, సిబ్బందిని, అలాగే ఈవీఎంలు, ఇతర పోలింగ్‌ సామగ్రిని తరలించేందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. ఈసారి పోలింగ్‌ నిర్వహణకు వాహనాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి కంట్రోల్‌ యూనిట్, వీవీప్యాట్‌లతో పాటు, 12 బ్యాలెట్‌ యూనిట్లను తరలించాల్సి ఉంటుంది. దీంతో సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో వాహనాలు అవసరం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు