ఈ లెక్క పక్కా!!

21 Nov, 2018 14:43 IST|Sakshi

ఇదీ జిల్లా ఓటర్ల సంఖ్య

తుది జాబితా విడుదల నెల వ్యవధిలో 5,510 మంది ఓటర్ల పెరుగుదల 

ఈ జాబితాలో ఉన్న వారే ఎన్నికల్లో కీలకం

ఆదిలాబాద్‌అర్బన్‌: రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్న జిల్లా ఓటర్ల లెక్క తేలింది. పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలు, పోలింగ్‌కు సిబ్బంది, వెబ్‌కాస్టింగ్, ఎన్నికల అధికారుల నియామకంపై దృష్టి సారించిన ఈసీ ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేసి తాజాగా ఈ నెల 19న తుది జాబితాను విడుదల చేసింది. ఓటర్ల పూర్తి స్థాయి జాబితా జిల్లా అధికారులకు అందాల్సి ఉంది.
తాజాగా విడుదలైన ఓటరు జాబితాలో పేర్లున్న వారే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. కాగా, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు మూడు సార్లు ఓటరు సవరణ కార్యక్రమాలు చేపట్టి అర్హులైన వారి పేరును జాబితాలో నమోదు చేశారు. తాజాగా విడుదలైన జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 3,83,072 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,89,980 మంది ఉండగా, మహిళలు 1,93,030 మంది ఓటర్లు ఉన్నారు. ఇతరులు 62 మంది ఉన్నారు. కాగా, ఈ యేడాది అక్టోబర్‌ 12న విడుదలైన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 3,77,562 మంది ఓటర్లు ఉండగా, ఇప్పుడా సంఖ్య కాస్త పెరిగింది. అంటే ఓటు నమోదుకు ఈసీ అవకాశం కల్పించడంతో ఒక నెల వ్యవధిలోనే 5,510 మంది ఓటర్లు జాబితా చేరారు. 

మూడు సార్లు జాబితా సవరణ.. 
ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో జనాభాకు సరాసరి ఓటర్లు ఉన్నారని భావించిన ఎన్నికల సంఘం ఈ యేడాది మార్చిలో ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఆఫ్‌ ఎలక్ట్రోరల్‌ రోల్‌(ఐఆర్‌ఈఆర్‌) కార్యక్రమం పేరిట ఓటర్ల సవరణ ప్రక్రియ చేపట్టగా, బోథ్‌లో స్పెషల్‌ సమ్మరి రివిజన్‌ పేరిట సవరణ జరిగింది. ఆ ప్రక్రియలో జిల్లాలో బోగస్‌ ఓట్లు చాలా వరకు తొలగిపోగా, అర్హులవి కూడా తొలగించబడ్డాయని పలువురు రాజకీయ నాయకులు అప్పట్లో కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. దీంతో కలెక్టర్‌ ఇంటింటి సర్వే చేపట్టి ఓటర్ల జాబితాను సవరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి యేడాది ఓటర్ల సవరణ కార్యక్రమాలు చేపడుతోంది. దీనికి తోడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఓటర్ల జాబితా రెడీ చేయాలని ఆదేశించడంతో ఈ యేడాది సెప్టెంబర్‌ 10 నుంచి 25 వరకు జాబితాను మళ్లీ సవరించారు. ఈ ప్రక్రియలో కొత్త ఓటరు నమోదుతోపాటు అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సవరణ ప్రక్రియ ద్వారా వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలన చేసి గత అక్టోబర్‌ 12న ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు.
డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్‌ నమోదు చేసేందుకు ఈసీతోపాటు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 18 ఏళ్లు నిండిన ప్రతీ యువతీ, యువకులు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని మరోసారి ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఈ యేడాది అక్టోబర్‌ 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం వరకు ముచ్చటగా మూడోసారి ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులను గత వారం రోజులుగా పరిశీలన చేసిన అధికారులు వాటి వివరాలను ఈసీకి పంపించారు. తాజాగా ఈసీ ఈ నెల 19న ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ఆ జాబితా వివరాలు జిల్లా అధికారులకు రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, మూడు సార్లు చేపట్టిన ఓటర్ల నమో దు కార్యక్రమాల ద్వారా జిల్లాలో సుమారు 20 వేల మందికిపైగా ఓటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. కాగా, తాజాగా విడుదలైన ఓటర్ల జాబితాలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడం గమనార్హం.  

2014లోని జాబితా కంటే తక్కువే.
జిల్లాలో బోథ్, ఆదిలాబాద్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఏప్రిల్‌లో విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా ప్రకారం చూస్తే జిల్లాలో 3,99,271 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడా సంఖ్య 2,83,072కు తగ్గింది. ఈ నాలుగేళ్లలో జిల్లాలో చనిపోయిన, వలస వెళ్లిన, బోగస్‌ ఓటర్లను తొలగించడంతోపాటు కొత్త వారిని నమోదు చేశారు. కానీ జాబితా నుంచి తొలగిపోయిన వారి వారి సంఖ్యకు అనుగుణంగా 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు జాబితాలో నమోదు కాలేదు. ఈ యేడాది మినహాయించి ప్రతీ యేడాది నమోదు సంఖ్య మూడంకెల్లో ఉంటే తొలగింపు సంఖ్య వేలల్లో ఉందన్న విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. త్వరలో సాధారణ ఎన్నికలు ఉండడంతో జిల్లా వ్యాప్తంగా 32 వేల మంది ఓటర్లు జాబితాలో ఈ యేడాది కొత్తగా చేరారు.


 

మరిన్ని వార్తలు