చకచకా.. కులగణన

21 Apr, 2018 12:03 IST|Sakshi

పంచాయతీ రిజర్వేషన్లఖరారుకు సేకరిస్తున్న ప్రభుత్వం

ఓటరు జాబితా సవరణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌

ఈ నెల 30నముసాయిదా జాబితా వెల్లడి

మే 8వరకు అభ్యంతరాల స్వీకరణ..17న తుది జాబితా ప్రకటన

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు ప్రామాణికంగా పరిగణించే కులగణన వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్‌ కమిషన్‌ చకచకా ఏర్పాట్లు చేస్తుండడంతో దానికి తగ్గట్టుగా పంచాయతీరాజ్‌ శాఖ వ్యవహరిస్తోంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని యోచిస్తుండడంతో సమాచారాన్ని తెప్పించింది. జిల్లా పరిధిలో మొత్తం 560 గ్రామ పంచాయతీల్లో 8,93,311 జనాభా ఉంది. ఇందులో ఎస్టీ 98,273, ఎస్సీ 1,90,466, బీసీ(అంచనా) 3,97,058, ఇతరులు 2,07,515 ఉన్నట్లు తేల్చింది. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ 16 శాతం, ఎస్టీ 6 శాతం, బీసీ 34 శాతం రిజర్వేషన్లను అమలు చేశారు. ఇదే విధానం కొనసాగితే ఈసారి 90 గ్రామ సర్పంచ్‌ స్థానాలు ఎస్సీలకు, 34 స్థానాలు గిరిజనులకు, 190 సీట్లు బీసీలకు రిజర్వ్‌ చేయాల్సివుంటుంది. ఇతరులకు 246 సీట్లు దక్కనున్నాయి. కాగా, మొత్తం స్థానాల్లో సగం మహిళలకు కేటాయించాల్సివుంటుంది. 

ఓటరు జాబితా సవరణకు నోటిఫికేషన్‌
గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నిర్దేశిత గడువులోపు ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎలక్షన్‌ కమిషన్‌ది కావడంతో ఆ మేరకు సన్నాహాలు చేస్తోంది. శుక్రవారం ఓటర్ల జాబితా ప్రకటించిన ఈసీ.. ఈ నెల 30వ తేదీన గ్రామ పంచాయతీలు/మండల పరిషత్‌ కార్యాలయంలో ముసాయిదా ఓటర్ల జాబితాను వెల్లడించనుంది. మే 1న జిల్లా, 3న మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలను నిర్వహించనుంది. మే 8వ తేదీవరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. పదో తేదీన క్లెయిమ్‌లను పరిష్కరించే యంత్రాంగం.. 17న తుది ఓటర్ల జాబితాను జిల్లా పంచాయతీ విభాగం ప్రకటించనుంది. వార్డులవారీగా రూపొందించే ఈ జాబితాలో ఓటర్ల ఫొటోలను పొందుపరచనుంది. ఇదిలావుండగా, శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. జూన్‌ 30వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ ముగించేలా సన్నద్ధం కావాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు