కోడ్‌ కూసిన వేళ..

8 Oct, 2018 09:27 IST|Sakshi

నిబంధనలు పాటించాల్సిందే...

అన్ని పార్టీలకూ వర్తింపు

ఆచితూచి వ్యవహరించకుంటే ఎన్నికల కమిషన్‌ నుంచి చిక్కులే...

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో గ్రేటర్‌ పరిధిలో వివిధ రాజకీయ పక్షాల ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. ఇదే క్రమంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే అధికార, ప్రతిపక్ష సభ్యులు కూడా ఉంటారు. ఈ విషయంలో ఆచితూచి ప్రచారం నిర్వహించకపోతే అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ నుంచి చిక్కులు ఎదుర్కోక తప్పదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈనేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని ముఖ్యాంశాలివీ..

సమాజంలో వివిధ కులాలు,మతాలు,భాషలుమాట్లాడే వారి మధ్య చిచ్చుపెట్టేలా ఎన్నికల ప్రసంగాలు చేయరాదు. విద్వేషాలను రెచ్చగొట్టరాదు.
విపక్షాలపై విమర్శలు చేసే సమయంలో వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాల జోలికి పోరాదు. నిరాధార ఆరోపణలు చేయరాదు.ఆయా పార్టీల విధానాలు, కార్యక్రమాలపైనే విమర్శలు చేయాలి.
మసీదులు, చర్చిలు, దేవాలయాలు, పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం చేయరాదు. ఆయా వర్గాల ఓట్లను గంపగుత్తగా పొందేందుకు ఆయా ప్రదేశాల్లోకి చొచ్చుకెళ్లి ప్రచారం నిర్వహించరాదు. వారి మనోభావాలను దెబ్బతీయరాదు.
ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, వంచనకు గురిచేయడం చేయరాదు.
ఎన్నికల రోజుకు ముందుగా 48 గంటల్లోగానే ప్రచారపర్వం ముగించాలి. పోలింగ్‌బూత్‌కు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం నిర్వహించరాదు.
నివాస సముదాయాల మధ్యన ప్రచారం నిర్వహించే సమయంలో భారీ ప్రదర్శనలు, పికెటింగ్‌లు నిర్వహించి ప్రజల వ్యక్తిగత జీవితాలను డిస్టర్బ్‌ చేయరాదు.
వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల ప్రచారం కోసం అనుమతిలేనిదే బయటివ్యక్తుల భూములు, భవనాలు, కాంపౌండ్‌వాల్స్‌ను, గోడలను ఎన్నికల ప్రచారానికి వినియోగించరాదు. బ్యానర్లు, నోటీసులు, పోస్టర్లు, వాల్‌రైటింగ్‌ చేయరాదు. కటౌట్లు ఏర్పాటుచేయరాదు.
ఇతర పార్టీల ప్రచారపర్వాన్ని, బహిరంగ సభలను భంగపరిచే చర్యలకు దిగరాదు. వారి ర్యాలీలను భగ్నం చేసేందుకు ప్రయత్నించరాదు. ఎదుటి పక్షాల మీటింగ్‌లోకి ప్రవేశించి అనుచిత ప్రసంగాలు చేయడం, వారికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచరాదు.  
ఇతర పార్టీల పోస్టర్లను తొలగించేందుకు ప్రయత్నించరాదు.
బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణకు ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. వారి సూచనల మేరకు ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ప్రయత్నించాలి.
నిషేధిత ప్రాంతాల్లో సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించరాదు.
లౌడ్‌స్పీకర్ల వినియోగానికి విధిగా పోలీసుల అనుమతి తీసుకోవాలి.
తమ పార్టీ సమావేశాలు, సభలను డిస్టర్బ్‌ చేసే వారిపై నేరుగా దాడిచేయరాదు. పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
ముందుగా అనుమతి తీసుకున్న ప్రకారం పోలీసులు చూపిన మార్గంలోనే ర్యాలీలు నిర్వహించాలి. మధ్యలో రూటు మార్చరాదు.
ర్యాలీ జరిగే మార్గంలో నిషేధిత ప్రాంతాలుంటే ఆయా ప్రాంతాల్లో పోలీసులు ఇచ్చిన సూచనల మేరకే ర్యాలీలు నిర్వహించాలి.
ర్యాలీలు నిర్వహించే మార్గంలో ట్రాఫిక్‌కు, జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగని రీతిలోనే నిర్వహించాలి. జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ జాం అయ్యేలా ర్యాలీ నిర్వహించకుండా ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి.
ర్యాలీలను రోడ్డుకు ఒక వైపు మాత్రమే నిర్వహించాలి. మిగతా రహదారి వాహనాలు, జనం రాకపోకలకు అనువుగా ఉండాలి.
ఒకే రోజు, ఒకే సమయంలో, ఒకే మార్గంలో ర్యాలీలను వివిధ పార్టీలు నిర్వహించరాదు. ఈ విషయంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా పోలీసులు సూచించినట్లు నడుచుకోవాలి.
ర్యాలీలు నిర్వహించే సమయంలో మారణాయుధాలు, ఇతర అభ్యంతరకర వస్తువులు లేకుండా చూసుకోవాలి.
ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ఎదుటి రాజకీయ పార్టీలు, నేతల దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలు ఉండరాదు.

నగరంలో బ్యానర్లు, ఫ్లెక్సీల తొలగింపు
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో వివిధ పార్టీలు, నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలు హోర్డింగ్‌లను  జీహెచ్‌ఎంసీ తొలగించింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన వెలువడటంతో నగరంలో ఎన్నికల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు జి ల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నుండి హైదరాబాద్‌ నగరంలో వివిధ పార్టీలు, ప్రజా ప్రతినిధులు ఏర్పాటుచేసిన ప్రచార సామాగ్రిని తొలగించడంలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా  ప్రభుత్వ పథకాలపై ఏర్పా టు చేసిన భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలను కూడా తొలగించారు. 18 వేల మంది పారిశుధ్య, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది, గత రాత్రి నుండి దా దాపు 10 వాహనాల్లో తిరుగుతూ ప్రచార సామగ్రి తొలగించారని అధికారులు ప్రకటించారు.

మరిన్ని వార్తలు