'కూడు' దూరం చేసిన 'కోడ్‌'...

19 Nov, 2018 17:38 IST|Sakshi

మూతపడ్డ ప్లెక్సీ దుకాణాలు 

దందాపై ఎన్నికల కమిషన్‌ దెబ్బ

సాక్షి, పెద్దపల్లి : వర్షంవస్తే పంటలు పండుతాయి. రోడ్లు దెబ్బతింటాయి. ఈ రెండు ఎంత నిజమో.. ఎన్నికలు రావడంతో ఫ్లెక్సీ వ్యాపారులకు నష్టం.. ప్రచారంలో వెళ్లేవారికి లాభం అంతే జరుగుతోంది. ఎన్నికల కమిషన్‌ విధించిన నిబంధనల దెబ్బకు ఫ్లెక్సీ దుకాణాలు మూతపడడంతో ఎన్నికల కోడ్‌ తమకు కూడు లేకుండా చేసిందని ఫ్లెక్సీ తయారీదారులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా కేంద్రం సహా అన్నిచోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల కోడ్‌ కింద ప్రచారాన్ని నిలిపివేయడంతో ఫ్లెక్సీ తయారీదారులు లబోదిబోమంటున్నారు. ఏడాదికి ఒక్కసారి దసరా పండుగా వస్తే.. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలు దసరా పండుగలాంటిదని వ్యాపారులు పేర్కొంటున్నారు. 

తమకు కాస్త ఆదాయం వస్తుందని ఆశపడ్డ సమయంలో ఎన్నికల కమిషన్‌ గుర్రు మనడంతో తమ దందా పూర్తిగా నిలిచిపోయిందని పలువురు వ్యాపారులు తెలిపారు. ఒక్కోషాపు యజమాని ఈ సీజన్‌లో కనీసం రూ.రెండు నుంచి మూడు లక్షల మేర ఆదాయం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీలతో రాజకీయ నాయకులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండడం తమ వ్యాపారానికి కలిసి వచ్చే అవకాశామని అంటున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ కఠినమైన అంక్షలు విధించడంతో ఎన్నికలు వచ్చిన సంతోషమే లేకుండాపోయిందని అంటున్నారు. ఒక్కో పట్టణంలో నాలుగు నుంచి ఎనిమిది కరీంనగర్‌ లాంటి నగరంలో 25 ఫ్లెక్సీ షాపులు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రస్తుతం గిరాకీ లేకుండా మూత వేసుకునే పరిస్థితిలో ఉన్నాయి.

15 ఏళ్ల క్రితం నుంచే..
ఫ్లెక్సీ వ్యాపారం 15 ఏళ్ల క్రితం నుంచి జోరందుకుంది. నిరుద్యోగ యువకులు ఉపాధి మార్గంగా ఎంచుకున్న ఫ్లెక్సీ దందాలో చాలామంది విద్యావంతులు చేరారు. ఇద్దరు, ముగ్గురు మిత్రులు కలిసి కుటీర పరిశ్రమగా నడుపుకుంటున్న వ్యాపారంపై  క్రమంగా ఆరేడు ఏళ్ల నుంచి ప్రభుత్వ నిబంధనలు ఇబ్బందికరంగా మారాయి. ప్లాస్టిక్‌ నియంత్రణ కింద ఫ్లెక్సీలను నిషేదించడంతో వ్యాపారం నష్టాల బాటపట్టింది. దీంతో ఎక్కడిక్కడ ఫ్లెక్సీల సంఖ్య తగ్గించేందుకు స్వయంగా మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మున్సిపాలిటీ నగరాల్లో నిషేదించారు. దాంతో చిన్న పట్టణాలు, గ్రామాలకు పెక్సీలు పరిమితం కాగా గిరాకీ సగం పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. సుమారు రూ.20 లక్షలతో ఫ్లెక్సీ తయరీ యంత్రాలను కొనుగోలు చేయగా ఇప్పుడు గిరాకీ తగ్గిపోవడంతో దందా లాభం లేకుండా పోయిందని ఈ సమయంలోనే వచ్చిన ఎన్నికలు మరింత నష్టాల పాలు చేశాయంటున్నారు.

అనుమతి ఇవ్వండి..
ఫ్లెక్సీలతో సమాజానికి నష్టం కలుగుతున్న మాట వాస్తవమే. ఇది ఇప్పుడు తెలిసిందికాదు. ప్రభుత్వమే ముందుగానే ఫ్లెక్సీ తయారిని దేశంలో అనుమతించకపోతే బాగుండేది. ఇప్పుడు ఎన్నికల నిబంధనల పేరుతో మొత్తం ప్రచారాన్ని నిలిపివేస్తూ ఫ్లెక్సీలపై నిషేదం విధించడంతో దందాపూర్తిగా ఆగిపోయింది. కొద్దిగానైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇస్తే తమ వ్యాపారం సగమైనా నడిచేది. 10 ఏళ్ల క్రితం ఎన్నికల సమయంలో ప్రచార నిమిత్తం కనీసం రూ.2 లక్షలు సంపాదించాను. ఇప్పుడు రూపాయి లేదు.
-డి.అనిల్, ఫ్లెక్సీ తయారీ వ్యాపారి

మరిన్ని వార్తలు