ఖర్చుకి లెక్కలుండాలి

6 Nov, 2018 11:09 IST|Sakshi

నిబంధనలు పాటించకపోతే ఎన్నికల్లో పోటీకి అనర్హులు

అభ్యర్థి ఖర్చు రూ.28 లక్షలు 

సాక్షి, జనగామ: ప్రస్తుతం ఎన్నికల ప్రచారం, సరళి చేస్తే అభ్యర్థులు ఖర్చు విపరీతంగా పెడుతున్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పాటించకపోతే మాత్రం వారిపై వేటు తప్పదు. భవిష్యత్‌లో పోటీచేసేందుకు కూడా అనర్హులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి రూ. 28 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని ఎన్నికల కమిషన్‌ నిబంధన ఉంది.ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల కమిషన్‌ అభ్యర్థుల వ్యయానికి కచ్చితమైన నిబంధలు రూపొందించింది. పోటీచేసే అభ్యర్థి రూ.28 లక్షలకు మించి ఖర్చుచేయొద్దని స్పష్టంగా పేర్కొంది. నామినేషన్‌ వేసినప్పటి నుంచి కౌంటింగ్‌ ముగిసే వరకు ఖర్చులను పరిమితం చేసింది. రూ.28 లక్షలకు మించి ఖర్చుచేసినా, ఖర్చుల లెక్కలను చూపకపోయినా వేటుతప్పదని కఠినంగా హెచ్చరిస్తున్నారు. లెక్కలు చూపకుండా గెలిస్తే అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని రద్దుచేయడంతోపాటు భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తారు. 

ఖర్చుల నిబంధనలు ఇవి...

  • అభ్యర్థి నామినేషన్‌ వేసినప్పటి నుంచి గెలుపు పొందిన తరువాత విజయోత్సవ ర్యాలీ లేదా కృతజ్ఞత ర్యాలీ వరకు రూ.28 లక్షలు ఖర్చు పెట్టొచ్చు.
  • ఎన్నికల ఖర్చుల కోసం పోటీ చేసే అభ్యర్థి ప్రత్యేకంగా ఒక బ్యాంకు అకౌంట్‌  తెరవాల్సి ఉంటుంది. అభ్యర్థితోపాటు తన ఏజెంట్‌ పేరుతో బ్యాంకు అకౌంట్‌ తెరవాలి.
  • చీఈ అకౌంట్‌లో మొత్తం రూ.28లక్షలు జమ చేయాలి. ఈ మొత్తంలో తాను సొంతంగా ఇచ్చినది, పార్టీ పంపించిన, ఇతర దాతలు ఇచ్చిన డబ్బులు ఉంటాయి. రూ. 20 వేల లోపు అయితే నగదు రూపంలో, రూ.20 వేలు దాటితే చెక్‌ రూపంలో డిజిటల్‌ ఫార్మెట్‌లో జమచేయాల్సి ఉంటుంది.
  • గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు 40 మందికి వరకు స్టార్‌ క్యాంపెయినర్లను, గుర్తింపులేని రాజకీయ పార్టీలు 20 మంది వరకు స్టార్‌ క్యాంపెయినర్లను నమోదుచేసుకునే అవకాశం ఉంటుంది. ఆ స్టార్‌ క్యాపెయినర్లు వాడుతున్న  హెలీక్యాప్టర్‌ లేదా ప్రత్యేక ప్రచార రథాల్లో ప్రయాణిస్తే ఆ ఖర్చులో సగం అభ్యర్థి వ్యయంలో కలుపుతారు.
  • స్టార్‌ క్యాంపెయినర్లు నిర్వహించే బహిరంగ సభలో ఒక అభ్యర్థితోపాటు ఇతర నియోజకవర్గాల్లోని అభ్యర్థులు ఆ వేదికపై కన్పిస్తే బహిరంగ సభ ఖర్చు అభ్యర్థులకు సమానంగా పంచబడుతుంది.
  • ఎన్నికల సమయంలో అభ్యర్థికి ఒక పుస్తకం ఇస్తారు. ఆ పుస్తకంలో మూడు రకాల పేజీలుంటాయి. మొదటిపేజీలో నగదుకు సంబంధించిన వివరాలు, రెండోపేజీలో బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు, మూడో పేజీలో అభ్యర్థి పెట్టిన ఖర్చుల వివరాలు ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు అభ్యర్థి తరుపు ఏజెంట్‌ నింపాల్సి ఉంటుంది.
  • ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయిన తరువాత అభ్యర్థులు లేదా ఏజెంట్లు అకౌంట్స్‌ అధికారులతో సమావేశమైన, నమోదైన ఖర్చులను సరిచూసుకోవాలి.
  • అభ్యర్థి నామినేషన్‌ వేసినప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు కనీసం మూడు సార్లు అభ్యర్థి ఖర్చులను బిల్లులతో సహా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ఉన్న అకౌంట్‌ విభాగంలో సమర్పించి సరి చూసుకోవాలి. ఆ సమయంలో అకౌంట్‌ సిబ్బంది ఖర్చులను తమ దగ్గర ఉన్న బుక్‌లో నమోదు చేస్తారు. అభ్యర్థికి తెలియకుండా షాడో టీం సభ్యులు అభ్యర్థి ఖర్చుపై నిఘాపెడుతారు. ఆ విషయాన్ని అభ్యర్థి తరుపు ఏజెంట్‌కు తెలియజేస్తారు. ఖర్చు విషయాన్ని సరి చూసుకొని భవిష్యత్‌ ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో అభ్యర్థి తరుపున ప్రచారం చేయడానికి వాహనాలు, బహిరంగ సభల అనుమతులు రద్దుచేస్తారు.
  • అభ్యంతరాలు ఉన్నట్లయితే కౌంటింగ్‌ పూర్తయిన 26వ రోజున ఎన్నికల అధికారులు అభ్యర్థికి లేదా ఏజెంట్లకు తెలియజేస్తారు. అభ్యర్థులు గానీ వారి ఏజెంట్లు గానీ కౌంటింగ్‌ జరిగిన 30వ రోజులోపు అకౌంట్‌ను సరి చూసుకోని సమర్పించాలి.
  • అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షలు దాటినా, అభ్యర్థులు ఎన్నికల ఖర్చును సమర్పించకపోయినా వారి సభ్యత్వం రద్దవుతుంది. భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో పోటీకి అనర్హులు.
మరిన్ని వార్తలు