చెప్పుడు సరె...చేసుడెట్ల..?

21 Nov, 2018 12:07 IST|Sakshi

పిట్టల దొరలెక్క గది జేస్త.. గిది జేస్త.. గది తెస్త.. గిది తెస్త అనుడు గాదు.. అవి జేయడాన్కి నీకాడున్న తొవ్వేంది.. గది సెప్పు మల్ల అంటుండ్రు ఎలచ్చన్‌ కమిసన్‌ ఆపీసర్లు. గిదేం కొత్త పంచాయితీ తగుల్కుందిరా నాయినా! ఎవరైనా గట్ల సెప్పనీకి అయితద.. జర సమజ్‌ జేస్కొండి సార్లు అని అబ్యర్తులు మనసులో ఏడ్సుకున్నా ఏం జేయనీకి లేదు. గదేందో కొత్త రూలు తెచ్చిండ్రంట. పాపం గీ కాండేట్లకి.. పార్టీవోల్లకి గది మింగుడు పడ్తలేదు. గందుకెగా మేనిపెస్టో.. టూత్‌పేస్టో.. ఎట్ల రడీ చేయ్యాలె అని తండ్లాడుతుండ్రు. అవ్‌ మల్ల బరబర నాల్గు లైన్లు గీకి ఇచ్చేదాంకి గింత రామాయనం ఎందుకు అనుకుంటం గానీ, ఆల్ల కస్టం ఆల్లది. నిజానికి గా ఎలచ్చన్ల సార్లు కొత్తగా చెప్పిందేం లేదె. నువ్‌ ఏం చేస్తవో గది పేపర్లపై పెట్టు.. ఎట్ల చేస్తవొ గది కూడా సెప్పు అంటుండ్రంతె. గిట్ల కాకుండ ఇయ్యాల రేపు జనాల కాడికెల్లి స్పీచులు దంచుత అంటె బండి నడ్వదు.

గీల్ల అవస్తలు జూస్తుంటె గిట్లనే సేతగాని కతలు సెప్పి పత్తాలేకుండ పోయిన ఓ వస్తాద్‌ కత యాదికొస్తంది. పని కోసం పల్లెకెల్లి గాయన ఊరి పంచాయితీ ఆపీసు కాడ మీటింగు పెట్టించిండు. నేను బడా పయిల్వాన్‌. గట్ల గిట్ల కాదు.. మీరు దేన్నయినా సూపుండ్రి మోస్త అని గొప్పలు సెప్పిండు. గా పెద్దోల్లకి గీ శాల్తిని జూడంగానె అనుమానం వచ్చింది. అరె గీడేమో బక్కగున్నడు.. మాటలు మాత్రం కోటలు దాటిస్తుండు అనుకుండ్రు. ఎట్లయితె గట్ల గాని.. ఊరి ముంగటున్న పేద్ద గుండ్రాయిని మోయాలన్నరు. గా పయిల్వాన్‌ అలియాస్‌ బక్కోడు గా గుండు చుట్టు దిరిగి.. గట్లనే అనేసిండు. రేపు అందరు రావలె.. అని పెద్దలు చెబ్తుంటె గాయన అడ్డంపడి.... ‘గిప్పుడు గాదు. నెల్లాల్లు ఆగాలె.. గప్పడ్దాక నన్ను బాగా సూస్కోవాలె’ అని కొత్త పిటింగ్‌ పెట్టిండు. ఇగ జేసేదిలేక సరె అన్నడు. నెలయినంక.. గా వస్తాదు గుండ్రాయి కాడ నిల్సుని ‘ఎవరైన వచ్చి నా బుజంపైన పెట్టుండ్రి. మోస్త మల్ల’ అంటె.. ఇగ జూస్కో అందరూ నోరెల్లబెట్టిండ్రు. ఎంటనె అందరుగల్సి ఆడి బొక్కలిరగ దన్నిండ్రు గది వేరే కత!  

గా బక్కోడి లెక్కనె కొందరు నాయకులు సేసుడుకు వీలుగాని హామీలిచ్చి.. గెలిసినంక అయిదేల్లదాకా పత్తాలేకుండ పోతరు. ఇల్లు గడ్తం.. గుళ్లు గడ్తం.. బాకీలు చేసిండ్రా మాపీ జేస్తం.. జరంత ఓటెయ్యండి సాలు అంటరు. గీ రాజకీయాలు ఎప్పట్నుంచో గిట్లనే నడుస్తున్నయ్‌. జనాలకు ఏం గావాలో సూడకుండ.. ఎలచ్చన్లు కాంగనె ఇగ సాల్‌దియ్‌ మల్లాచూస్కుందం అనుకునే కాండేట్లే ఎక్కువ. పార్టీల మేనిపేస్టోల సానా సానా రాస్తరు.అరె మీకెందుకు ఫికర్‌.. చూస్తుండండి.. గా సొర్గం కిందికి దించుతమని సెబ్తరు. గివి తయారీకి కమిటీలు ఏసుకుంటుండ్రు. కానీ పనులు జెయ్యాలి గదా. అందుకే మల్ల ఒక సారుకి కోపం వచ్చి గీ మద్దెనే హైకోర్టుకెల్లిండు. గీ పార్టీలు ఇస్తున్న హామీలు.. రేపు గెల్సినంక అమలు సేసేతట్లు చూసే బాద్యత గా ఎలచ్చన్ల కమిసన్‌కె పెట్టాలని కోరిండు. జడ్జీలు గిది చూసినంక.. మేనిపెస్టోల ఇచ్చిన హామీలపై ఏం యాక్సన్‌ తీసుకున్నరో చెప్పుండ్రి అని ఆదేశించిండ్రు. జూసినార అందుకె గీసారి పార్టీలోల్లు మేనిపెస్టో చేసుడుకు ఆగమాగం అవుతుండ్రు. ఏం చెబ్తే ఏం సుట్టుకుంటదో అని పరేసాన్‌ అవుతుండ్రు. గిది ఒకందుకు మంచిదే. గానీ.. గీ పార్టీలోల్లు ఏదో కుండ బిరియాని లెక్క వండేసి ఎలచ్చన్‌ సార్లకి ఇస్తరు. ఓట్లు గాలం ఏసేకి ఎలాగు డబ్బులు.. మందు.. గిప్టులు గివి ఉండనే ఉన్నయ్‌. అయినా గీ జనాలు తక్కువోల్లు గాదులే. ఎవలు ఎంత జెప్పిన.. ఎంతిచ్చిన.. ఓటు ఏసేకాడ జర దిమాక్‌ పెడ్తరు. అంతే గద సార్లూ!!– రామదుర్గం మధుసూదనరావు

మరిన్ని వార్తలు