ఎన్నికల టీం రెడీ..

9 Nov, 2018 13:31 IST|Sakshi

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల నియామకం

అసిస్టెంట్‌ రిటర్నింగ్, సెక్టోరియల్‌ అధికారులు కూడా..

పూర్తయిన నోడల్‌ అధికారుల నియామకం

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్న యంత్రాంగం

సాక్షి, మహబూబాబాద్‌: శాసనసభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఓటింగ్‌ యంత్రాల పనితీరు సరిచూసుకోవడంతోపాటు ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన పనులను చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని ఆయా ప్రభుత్వ శాఖల అధికారులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు చేపట్టిన అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వివిధ విభాగాల వారీగా బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఇద్దరి చొప్పున ఉన్నారు.

ముగ్గురు అధికారులు విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో రిటర్నింగ్, అసిస్టెంట్‌ రిటర్నింగ్, ఫ్లయింగ్‌ స్క్వాడ్, సెక్టోరియల్, వీడియో ప్యూయింగ్‌ టీం(వీవీటీ), వీడియో సర్వేలెన్స్‌ టీం (వీఎస్‌టీ) విభాగాలకు చెందిన అధికారుల ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఆయా విభాగాలకు అధికారుల నియామకాలు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇదిలా ఉండగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఇదివరకే జిల్లాలో నోడల్‌ అధికారులు కూడా నియమితులయ్యారు.

రిటర్నింగ్, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ఇలా..
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఓటరు నమోదు అధికారి (ఈఆర్‌వో) ఉంటారు. సదరు నియోజకవర్గానికి ఈఆర్‌ఓగా వ్యవహరించిన అధికారినే ఎన్నికల సంఘం ఆ అసెంబ్లీ సెగ్మెంట్‌కు రిటర్నింగ్‌ అధికారిగా నియమిస్తుంది. జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు ఉండగా, మానుకోట అసెంబ్లీకి ఆర్డీఓ కొమరయ్య, డోర్నకల్‌కు రిటర్నింగ్‌ అధికారిగా తొర్రూర్‌ ఆర్డీవో ఈశ్వరయ్య నియమితులయ్యారు. వీరితోపాటుసహాయ రిటర్నింగ్‌ అధికారులు కూడా ఉంటారు.

నియోజకవర్గం పరిధిలోని మండలాల తహసీల్దార్లకు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా బాధ్యతలు అప్పగించారు. అంటే ఒక్కో నియోజకవర్గంలో సుమారు నలుగురి నుంచి ఆరుగురి వరకు తహసీల్దార్లు ఉన్నారు. వీరందరూ సహాయ రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరిస్తారు. రిటర్నింగ్‌ అధికారితోపాటు ఎన్నికల విధుల్లో వీరు కీలకంగా వ్యవహరించనున్నారు. ఇతర జిల్లాల నుంచి ఇటీవలే బదిలీపై మన జిల్లాకు వచ్చిన తహసీల్దార్లు అందరూ సహాయ రిటర్నింగ్‌ అధికారులుగా నియమితులయ్యారు.

ప్రతీ సెగ్మెంట్‌కు ప్లయ్యింగ్‌ స్క్వాడ్‌ బృందాలు
జిల్లాలోని నియోజకవర్గాల్లో ప్రతి అసెంబ్లీ స్థానానికి ఒక ఫ్లయ్యింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందులో ఒక డిప్యూటీ తహసీల్దార్, ఒక పోలీస్‌ కానిస్టేబుల్, ఒక వీడియో లేదా ఫొటోగ్రాఫర్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో ఈసీ స్పష్టంచేసింది. నియోజకవర్గానికొకటి చొప్పున వీవీటి (వీడియో వ్యూయింగ్‌ టీం), వీఎస్‌టీ (వీడియో సర్వేలెన్స్‌ టీం) బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో ఆయా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించారు. బృందాలు నియోజకవర్గంలో ప్రతి కదలికలను ఎన్నికల సంఘానికి చేరవేసేలా చర్యలు తీసుకుంటాయి. జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, పకడ్బందీగా ఎన్నికల కోడ్‌ అమలు చేసేలా ప్రభుత్వ యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది.  

మరిన్ని వార్తలు